రోహిత్‌ను తప్పించి తుది సమరానికి! | India and Australia final Test from today | Sakshi
Sakshi News home page

రోహిత్‌ను తప్పించి తుది సమరానికి!

Published Fri, Jan 3 2025 3:34 AM | Last Updated on Fri, Jan 3 2025 3:34 AM

India and Australia final Test from today

టీమిండియా కెప్టెన్‌పై వేటు

నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా చివరి టెస్టు 

విజయం సాధిస్తే సిరీస్‌ సమం 

ఆసీస్‌ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 

ఉదయం 5 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో గాయం, నిషేధం లేదా మరో వ్యక్తిగత కారణంతో కాకుండా ఫామ్‌ లేకపోవడంతో తుది జట్టుకు దూరమైన కెపె్టన్‌ ఇప్పటి వరకు ఎవరూ లేరు! కానీ ఇప్పుడు తొలిసారి రోహిత్‌ శర్మ అలాంటి స్థితిలో నిలిచాడు. వరుస వైఫల్యాలు, డ్రెస్సింగ్‌ రూమ్‌లో విభేదాలవంటి వార్తల నేపథ్యంలో రోహిత్‌పై వేటు పడింది. నేటి నుంచి ఆ్రస్టేలియాతో జరిగే చివరి టెస్టులో అతడిని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తప్పించడం ఖాయమైంది. 

సిరీస్‌లో తొలి పోరులో భారత్‌ను గెలిపించిన బుమ్రా నాయకత్వంలోనే ఇప్పుడు సిరీస్‌ను సమం చేసే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. భారత్‌ గెలిస్తే ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ని నిలబెట్టుకోవడంతో పాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ చేరే ఆశలు ఇంకా మిగిలి ఉంటాయి. ఆసీస్‌ గెలిస్తే ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.  

సిడ్నీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్‌ చివరి అంకానికి చేరింది. నేటి నుంచి జరిగే ఐదో టెస్టులో ఇరు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఆసక్తికరంగా సాగిన సమరంలో ప్రస్తుతం 1–2తో వెనుకబడిన భారత్‌ ఎలాగైనా గెలిచి సిరీస్‌ సమం చేయాలని పట్టుదలగా ఉంది. 

సొంతగడ్డపై భారత్‌ చేతిలో గత రెండు ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ సిరీస్‌లు ఓడిన ఆ్రస్టేలియా ఈసారి ఎలాగైనా తమ స్థాయిని ప్రదర్శించి ట్రోఫీని గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు పూర్తిగా కోల్పోతుంది. సిడ్నీ పిచ్‌ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించవచ్చు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు తక్కువ.  

రోహిత్‌ స్థానంలో గిల్‌... 
కెపె్టన్‌ రోహిత్‌ శర్మ ఈ టెస్టులో ఆడే విషయంపై స్పందిస్తూ గురువారం ‘ఇప్పుడే ఏమీ చెప్పలేను’ అని కోచ్‌ గంభీర్‌ చెప్పడంలోనే రోహిత్‌ స్థానంలో సందేహం కనిపించింది. ఈ సిరీస్‌లో వ్యక్తిగత కారణాలరీత్యా తొలి టెస్టుకు దూరమైన రోహిత్‌... ఆ తర్వాత 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 31 పరుగులే చేశాడు. 

ఇది ఆందోళనకరమే అయినా... వేటు పడవచ్చని ఎవరూ ఊహించలేదు. కానీ కోచ్‌ గంభీర్, సెలక్టర్‌ అగార్కర్‌తో చర్చించిన తర్వాత మ్యాచ్‌కు దూరంగా ఉండేందుకు రోహిత్‌ సిద్ధమయ్యాడు. అతని స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ జట్టులోకి రానున్నాడు. గాయంతో బాధపడుతున్న పేసర్‌ ఆకాశ్‌దీప్‌ స్థానంలో ప్రసిధ్‌ కృష్ణ లేదా హర్షిత్‌ రాణా ఆడే అవకాశం ఉంది. ఈ రెండు మార్పుల అనంతరం భారత జట్టు సిద్ధమైంది. 

అయితే పెర్త్‌లో సెంచరీ మినహా వరుసగా విఫలమైన కోహ్లి ఈ సారైనా రాణిస్తాడా అనేది చూడాలి. రాహుల్, పంత్, జడేజా కూడా తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా ఆడాల్సి ఉంది. బౌలింగ్‌లో బుమ్రాకు సిరాజ్‌ తగిన మద్దతు ఇస్తే ఆసీస్‌ను నిలువరించవచ్చు.  

మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్‌... 
ఆస్ట్రేలియా కూడా ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఫామ్‌లో లేని మిచెల్‌ మార్ష్ స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ వెబ్‌స్టర్‌ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. మెల్‌బోర్న్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో గెలుపుపై కంగారూలు గురి పెట్టారు. 

ఖ్వాజా మినహా మిగతా ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్‌ నైపుణ్యంతో సారథి కమిన్స్‌ జట్టును సమర్థంగా నడిపిస్తుండగా...10 వేల పరుగుల మైలురాయికి 38 పరుగుల దూరంలో ఉన్న స్మిత్‌ అతని సొంత మైదానంలో చెలరేగితే ఆసీస్‌ భారీస్కోరు సాధించడం ఖాయం.  

రోహిత్‌ అన్యమనస్కంగా... 
టెస్టుకు ముందు రోజు భారత జట్టు ప్రాక్టీస్‌ సమయంలోనే రోహిత్‌పై వేటుకు సంబంధించిన సంకేతాలు కనిపించాయి. స్లిప్‌ ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ సమయంలో వరుసగా కోహ్లి, రాహుల్, నితీశ్‌ రెడ్డి, గిల్‌ నిలబడగా... రోహిత్‌ జాడే కనిపించలేదు. నెట్స్‌లో ప్రధాన బ్యాటర్ల సాధన సాగినంత సేపూ అతను ఒక పక్కన నిలబడి బుమ్రాతో కబుర్లు చెబుతూ కనిపించాడు. 

ఆ తర్వాత అంతా ముగిసిన తర్వాత కొద్దిసేపు ప్రాక్టీస్‌ చేసినా తీవ్రత కనిపించలేదు. నేరుగా వచ్చిన బంతులను కూడా అతను ఆడే ప్రయత్నం చేయకపోగా, అవన్నీ స్టంప్స్‌ను పడగొట్టాయి. పూర్తి ఏకాగ్రతతో అతను అర గంట కూడా సాధన చేయలేదు. పక్క నెట్‌లోనే నితీశ్, గిల్‌లకు ప్రత్యేక సూచనలిస్తూ సాధన చేయించిన కోచ్‌ గంభీర్‌తో కనీసం పలకరింపులు కూడా కనపడలేదు. ప్రాక్టీస్‌ ముగిశాక బుమ్రా, అగార్కర్‌లతో కలిసి రోహిత్‌ మైదానం వీడాడు.

1 సిడ్నీలో ఆ్రస్టేలియా జట్టుతో భారత్‌ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడింది. టీమిండియా ఒక్క టెస్టులో మాత్రమే (1978లో) గెలిచి, ఐదు టెస్టుల్లో ఓడిపోయింది. మరో 7టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement