జట్టును ఆదుకున్న ఆంధ్ర బ్యాటర్
వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358/9
మరో 116 పరుగులు వెనుకంజ
దేశం తరఫున ఆడుతూ కెరీర్‌లో తొలి సెంచరీ అంటే ఎలా ఉండాలి...జీవితకాలం ఇలాంటి క్షణాల కోసమే శ్రమించే కష్టాన్ని మరచిపోయేలా ఉండాలి...ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక మైదానంలో ఎందరో కలలు గనే చోట సాధించినట్లుగా ఉండాలి... అన్నీ అనుకూలించినప్పుడు కాదు...జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ తానేంటో చూపించాలి...అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ, శరీరానికి తగిలే దెబ్బలను తట్టుకుంటూ, వేలాది మంది తనకు జేజేలు పలికేలా శతకం బాదాలి...వీటన్నింటికీ ఒక్కటే సమాధానం! మన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కొట్టినట్లుగా సెంచరీ ఉండాలి.
మెల్‌బోర్న్ టెస్టులో భారీ ఆధిక్యంపై కన్నేసి విజయంపై గురి పెట్టిన ఆస్ట్రేలియాను మన నితీశ్, వాషింగ్టన్ సుందర్ సమర్థంగా అడ్డుకున్నారు. శతక భాగస్వామ్యంతో జట్టును గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించారు. ముందుగా ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఆపై ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చారు.
నితీశ్ అద్భుత బ్యాటింగ్‌కు సుందర్ సమన్వయం తోడవడంతో కంగారూలు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వీరిద్దరు కలిసి 47.3 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఈ ఇద్దరు బ్యాటర్ల పోరు తర్వాత ప్రస్తుతానికి భారత్ ఓటమి ప్రమాదంనుంచి దాదాపుగా తప్పించుకున్నట్లే.
మెల్‌బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్‌ను భారత యువ ఆటగాళ్లు ఆసక్తికరంగా మార్చారు. ఒక దశలో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం కోల్పోయి ఓటమికి బాటలు వేసుకునేటట్లు కనిపించిన టీమిండియా కోలుకొని మెరుగైన స్థితికి చేరింది. మ్యాచ్ మూడో రోజు వెలుతురులేమితో ఆటను నిర్ణీత సమయానికి ముందే అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
నితీశ్ కుమార్ రెడ్డి (176 బంతుల్లో 105 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా...వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో 50; 1 ఫోర్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నితీశ్‌తో పాటు సిరాజ్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ మరో 116 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 164/5తో ఆట కొనసాగించిన భారత్ శనివారం 70 ఓవర్లు ఆడి మరో 194 పరుగులు జోడించింది.
ప్రస్తుతానికి ఆసీస్‌కు ఆధిక్యం ఉన్నా...నాలుగో రోజు ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేసి సవాల్ విసురుతుందనేది ఆసక్తికరం. మిగిలిన సమయం, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి కావడం అంత సులువు కాదు. అదే జరిగితే ఈ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియవచ్చు.
భారీ భాగస్వామ్యం...
తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు వెనుకబడి ఉన్న స్థితినుంచి రిషభ్ పంత్ (37 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (17) మూడో రోజు ఆటను కొనసాగించారు. వీరిద్దరు మరింత బాధ్యతాయుతంగా ఆడి జట్టును రక్షించాల్సి ఉన్నా...ఎక్కువ సేపు నిలబడలేకపోయారు.
ముఖ్యంగా పంత్ చెత్త షాట్‌తో తన వికెట్ సమర్పించుకోగా, జడేజా ఎల్బీగా దొరికిపోయాడు. 30 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. జడేజా అవుటయ్యాక సుందర్ బ్యాటింగ్‌కు రాగా, మరో ఎండ్‌లో నితీశ్ 22 పరుగుల వద్ద ఆడుతున్నాడు. మరో మూడు వికెట్లు తీసి భారత్ ఆట ముగించవచ్చని భావించిన ఆసీస్‌కు ఇక్కడే అసలు ప్రతిఘటన ఎదురైంది. నితీశ్, సుందర్ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ మెల్లగా స్కోరును పెంచుతూ పోయారు.
లంచ్ సమయానికి స్కోరు 244/7 వద్ద నిలిచింది. రెండో సెషన్‌లో పూర్తిగా వీరిద్దరిదే హవా సాగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా 24 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ బౌలర్లు విఫలమయ్యారు. మూడో సెషన్‌లో కూడా వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు.
ఆసీస్ తొలి 15 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేకపోయింది. ఎట్టకేలకు 127 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం తర్వాత సుందర్‌ను అవుట్ చేసి లయన్ ఈ జోడీని విడదీశాడు. మరో రెండు పరుగులకే బుమ్రా (0) కూడా వెనుదిరిగాడు. అయితే మరో 15 బంతుల పాటు చివరి వికెట్ చేజార్చుకోకుండా భారత్ మూడో రోజును ముగించింది.
స్కోరు వివరాలు:
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 474; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలండ్ (బి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; కోహ్లి (సి) క్యారీ (బి) బోలండ్ 36; ఆకాశ్‌దీప్ (సి) లయన్ (బి) బోలండ్ 0; పంత్ (సి) లయన్ (బి) బోలండ్ 28; జడేజా (ఎల్బీ) (బి) లయన్ 17; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 105; సుందర్ (సి) స్మిత్ (బి)లయన్ 50; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (116 ఓవర్లలో 9 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159, 6–191, 7–221, 8–348, 9–350. బౌలింగ్: స్టార్క్ 25–2–86–0, కమిన్స్ 27–6–86–3, బోలండ్ 27–7–57–3, లయన్ 27–4–88–2, మార్ష్ 7–1–28–0, హెడ్ 3–0–11–0.
సుందర్ సంయమనం...
దాదాపు నాలుగేళ్ల క్రితం వాషింగ్టన్ సుందర్ బ్రిస్బేన్ టెస్టుతో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 161/5తో కష్టాల్లో ఉన్న స్థితిలో అతను బ్యాటింగ్‌కు దిగి జట్టును గట్టెక్కించాడు. అతను చేసిన 62 పరుగులు ఆ తర్వాత భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మరోసారి అతను అలాంటి పాత్రనే పోషించాడు.
ఈ టెస్టు కోసం ప్రధాన బ్యాటర్ గిల్‌ను పక్కన పెట్టి ఆల్‌రౌండర్ సుందర్‌ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ తప్పుడు నిర్ణయం జట్టు ఓటమికి కారణం కావచ్చని విశ్లేషకులు అన్నారు. అయితే సుందర్ తన బ్యాటింగ్‌తో వారి అనుమానాలను పటాపంచలు చేశాడు. ముఖ్యంగా ఏ రెగ్యులర్ బ్యాటర్‌కు తగ్గని రీతిలో అద్భుతమైన డిఫెన్స్‌తో జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
సుందర్ పట్టుదల, ఓపికతో అండగా నిలవడం వల్లే మరో వైపు నితీశ్ సెంచరీ సాధ్యమైంది. ఎంతో జాగ్రత్తగా ఆడిన
సుందర్ ఏకంగా 162 బంతులు ఎదుర్కొన్నాడు. కమిన్స్ ఓవర్లో అతను కొట్టిన సింగిల్‌తో భారత్ ఫాలో ఆన్ ప్రమాదంనుంచి తప్పించుకుంది. తాను ఎదుర్కొన్న 103వ బంతికి గానీ సుందర్ ఏకైక ఫోర్ కొట్టలేదు.
టీ విరామం తర్వాత 146 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. మళ్లీ ఆ్రస్టేలియాను నిలువరించడంలో సఫలమైన తర్వాత చివరకు లయన్ బౌలింగ్‌లో అతను వెనుదిరిగాడు. బ్రిస్బేన్ విజయం తర్వాత తన కుక్క పిల్లకు అక్కడి మైదానం ‘గాబా’ పేరును సుందర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి ప్రదర్శన తర్వాత రెండో కుక్క పిల్ల ఏమైనా ఉంటే ‘ఎంసీజీ’ అంటాడేమో!
ఇక తగ్గేదేలే...
పెర్త్ టెస్టులో 73/6 నుంచి జట్టును 150 వరకు అతనే తీసుకెళ్లాడు...అడిలైడ్‌లో 87/5, 105/5 వద్ద ఉన్నప్పుడు 42, 42తో రెండు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మెల్‌బోర్న్‌లో 191/6 నుంచి స్కోరును 300 దాటించాడు...ఈ సిరీస్‌లో తొలి రోజునుంచి తనదైన ముద్ర వేసిన నితీశ్ కుమార్ రెడ్డి 284 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ టెస్టుకు ముందు అతని ప్రదర్శన చూస్తే ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నట్లుగా కనిపించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఎంసీజీలో అతను ఆ లోటును తీర్చుకున్నాడు. ఐపీఎల్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు, బంగ్లాదేశ్‌తో టి20లో 34 బంతుల్లో 74 పరుగుల ఆటతో తానేంటో చూపించినా...నితీశ్‌ను టెస్టు ఆటగాడిగా ఎవరూ చూడలేదు. 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 674 పరుగులు, బౌలింగ్‌లో 56 వికెట్ల అతని రికార్డు ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి అర్హతగా మారుతుందని, తుది జట్టులో స్థానం దక్కుతుందని ఊహించలేదు.
మీడియం పేస్ బౌలింగ్ చేసే బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా తరహాలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని నితీశ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. కానీ ఈ సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు డకౌట్‌లు బ్యాటింగ్‌పై కూడా సందేహాలు రేపాయి. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ నితీశ్‌పై నమ్మకముంచింది. అతడిని తమ ట్రంప్ కార్డ్‌గా వాడి అద్భుత ఫలితాలు సాధించింది. ఇప్పుడు సెంచరీతో నితీశ్ తన స్థాయిని ప్రదర్శించాడు.
అతను ఎనిమిదో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చే సమయానికి భారత్ మరో 283 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాంటి సమయంలోనూ ఎలాంటి తడబాటు లేకుండా అతను స్వేచ్ఛగా ఆడిన తీరు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలను సైతం ఆకట్టుకుంది. షాట్ల ఎంపిక మాత్రమే కాదు, అతనిలో కనిపించిన ఆత్మవిశ్వాసం ఎంతో అనుభవం ఉన్నవాడిలా చూపించింది. ముఖ్యంగా క్రీజ్‌లో పట్టుదలగా నిలబడిన తీరు, పోరాటతత్వం ఈ 21 ఏళ్లు కుర్రాడిని మరో మెట్టు ఎక్కించాయి.
స్టార్క్ బౌలింగ్‌తో ఆఫ్ డ్రైవ్ బౌండరీతో 81 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అతను ‘పుష్ప’లా తగ్గేదేలే అంటూ సంకేతం చూపించాడు. ఆ తర్వాత పరిస్థితికి తగినట్లుగా తనను తాను మార్చుకున్నాడు. 85 స్కోరు వద్దనుంచి 97కు చేరేందుకు 48 బంతులు తీసుకున్నాడు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది.
సెంచరీ తర్వాత బ్యాట్‌ను మైదానంలో జెండా తరహాలో పాతి ఇది ఆరంభం మాత్రమే అన్నట్లుగా తన రాకను నితీశ్ ఘనంగా చూపించాడు. 21 ఏళ్ల 214 రోజుల వయసులో సెంచరీ బాది ఆ్రస్టేలియా గడ్డపై అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వారిలో మూడో స్థానంలో అతను నిలవడం విశేషం.
కమిన్స్‌తో తలపడి... నిలబడి...
నితీశ్ ఇన్నింగ్స్‌లో చూడచక్కటి షాట్లు ఎన్నో ఉన్నాయి. అతని పది ఫోర్లు కూడా ఎంతో నియంత్రణతో, ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి సాధికారతతో వచ్చాయి. ఆరంభంలో లయన్ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన సిక్స్, ఆ తర్వాతి బౌండరీలో చక్కటి ఫుట్‌వర్క్ కనిపించింది. అయితే సెంచరీని అందుకునే క్రమంలో అతను కొన్ని కఠిన క్షణాలను కూడా దాటాడు!
ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ , తన సన్‌రైజర్స్ సారథి కమిన్స్ బౌలింగ్‌ను అతను ఎదుర్కొన్న తీరు శనివారం ఆటలో హైలైట్‌గా నిలిచింది. ఎన్ని ప్రమాదకరమైన బంతులు వచ్చినా... నితీశ్ తలవంచి కాడి పడేయలేదు. వాటికి ఎదురొడ్డి నిలబడ్డాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్ అతనిలోని మొండితనాన్ని చూపించింది. ముఖ్యంగా బౌన్సర్‌గా వచ్చిన మూడో బంతిని ఆడలేకపోయిన నితీశ్ అదృష్టవశాత్తూ చివరి క్షణంలో దానినుంచి తప్పించుకోగలిగాడు.
ఆఖరి బంతి కూడా దాదాపు ఇదే తరహాలో అతడిని వెంటాడింది. మరికొద్ది సేపటికి కమిన్స్ బౌలింగ్‌లోనే బంతి మోచేయి కింది భాగంలో బలంగా తగలడంతో అతను విలవిల్లాడుతూ బ్యాట్ వదిలేశాడు. ఫిజియో వచ్చి చికిత్స చేయాల్సి వచ్చింది. అయితే ఈ కుర్రాడు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయి తానేంటో చూపించాడు.
ఆ మూడు బంతులు!
లయన్ వేసిన ఇన్నింగ్స్ 112వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి నితీశ్ మరో ఎండ్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో అతని స్కోరు 97. అదే ఓవర్ తర్వాత ఐదు బంతులు ఆడిన సుందర్ చివరి బంతికి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్ చివరి బంతికి మరో రెండు పరుగులు తీసిన అతను 99 వద్ద నిలిచాడు. అయితే మరుసటి ఓవర్లో ఒక్కసారిగా ఉత్కంఠ చోటు చేసుకుంది.
తొలి మూడు బంతులు ఎదుర్కొన్న బుమ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ సమయంలో సిరాజ్ క్రీజ్‌లోకి వచ్చాడు. కమిన్స్ బంతులను అతను ఆడగలడా అని అన్ని వైపులనుంచి సందేహం. మైదానంలో ఫ్యాన్స్ కూడా మునివేళ్లపై నిలిచారు. ఎలాగో అతను ఆ గండాన్ని దాటాడు. ఆఖరి బంతిని సిరాజ్ డిఫెండ్ చేసినప్పుడు ఎంసీజీ మొత్తం ఊగిపోవడం విశేషం! అయితే బోలండ్ తర్వాతి ఓవర్ మూడో బంతిని లాఫ్టెడ్ ఆన్‌డ్రైవ్‌గా ఆడటంతో నితీశ్ శతకం పూర్తయింది.
అభిమానుల ఉత్సాహంతో ‘జి’ దద్దరిల్లగా...ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి ముత్యాల రెడ్డి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఆ సమయంలో కామెంటరీలో ఉన్న మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ...‘ఈ భావోద్వేగ క్షణం గురించి ఏం చెప్పినా తక్కువే. అక్కడ ఏడుస్తోంది నితీశ్ తండ్రి మాత్రమే కాదు. మైదానంలో ఉన్న సగటు భారత అభిమానులకు కూడా అదే భావన వచ్చి ఉంటుంది. నా కళ్లల్లో కూడా కన్నీళ్లు తిరిగాయంటే ఆశ్చర్యపోవద్దు’ అని వ్యాఖ్యానించాడు.
5 ఎనిమిది లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించిన ఆటగాళ్లలో నితీశ్ ఐదోవాడు. భారత ఆటగాళ్లలో అతనే మొదటివాడు.
8 ఈ సిరీస్‌లో నితీశ్ సిక్సర్ల సంఖ్య. గతంలో ఆ్రస్టేలియా గడ్డపై ఒక సిరీస్‌లో మైకేల్ వాన్ (8; ఇంగ్లండ్), క్రిస్ గేల్ (8;వెస్టిండీస్) మాత్రమే ఎనిమిది సిక్స్‌లు బాదారు.
‘విశాఖపట్నం యువకుడు నితీశ్ కుమార్‌రెడ్డికి నా అభినందనలు. అండర్–16 స్థాయిలో, రంజీ ట్రోఫీలో ఎన్నో విజయాలతో అతను సత్తా చాటాడు. ఇలాంటి ఘనతలు మున్ముందు మరిన్ని సాధించాలని, భారత జట్టులో సభ్యుడిగా దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ –నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
‘బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి నా అభినందనలు. జట్టు కష్టాల్లో ఉండి ఫాలో ఆన్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో పరిస్థితి చక్కదిద్దడంలో అతను కీలక పాత్ర పోషించాడు. రాబోయే ఎన్నో ఘనతల్లో ఇది మొదటిది కావాలి. మైదానంలో అతని విజయాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment