గౌహతి ఎక్స్ప్రెస్లో బాంబు పేలుడు ఉగ్రవాద చర్యేనని పోలీసులు నిర్ధరించారు. వాస్తవానికి ఆ బాంబు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రాంతంలో పేలాల్సిందని, అయితే రైలు గంటన్నర ఆలస్యంగా నడుస్తుండటంతో చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉండగా పేలిందని తమిళనాడు డీజీపీ కె.రామానుజం తెలిపారు. నెల్లూరులో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సభ ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఒక హెచ్చరిక పంపేందుకే ఈ పేలుడుకు కుట్రపన్ని ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండటం.. కేవలం దాని పైభాగంలో ఉన్న సీటు మాత్రమే దెబ్బతినడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కొన్ని పేలుడు పదార్థాలతో రైల్లో దాక్కున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యేనని తమిళనాడు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. అధికారుల నుంచి తనకు సమాచారం అందుతోందని, పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు.
తమిళనాడు పోలీసులకు సహకరించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రెండు బృందాలను పంపింది. వాటిలో ఒకటి హైదరాబాద్ నుంచి, మరొకటి ఢిల్లీ నుంచి వెళ్లాయి. బాంబు పేలుడు కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకదాన్ని ఏర్పాటుచేసినట్లు తమిళనాడు సీఎం జయలలిత తెలిపారు. మృతురాలి కుటుంబానికి లక్ష రూపాయలు, తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి 25వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. దోషులు త్వరలోనే కటకటాల వెనక్కి వెళ్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రైల్లో పేలుడు ఉగ్రవాద చర్యే
Published Thu, May 1 2014 4:47 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
Advertisement