gauhati express
-
అస్సాం ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి: రఘువీరా
విజయవాడ : త్వరలో జరుగనున్న అస్సాం ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ శుక్రవారం గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలను నయవంచనకు గురి చేసిన నరేంద్రమోదీ బూటకపు మాటలను నమ్మి మోసపోవద్దని, బీజేపీని, దాని మిత్రపక్షాలను అస్సాం ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు. సుస్థిర ప్రభుత్వం అందించగల కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఓట్లు దండుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు తూచ్ అంటూ దాటవేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ మాయమాటలు తెలుగువారిని నయవంచనకు గురిచేశాయన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ మట్టి, నీటిముంతలు తీసుకువచ్చి చేతులు దులుపుకొన్నారన్నారు. మాజీ మంత్రి తులసిరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల ఆశలను కేంద్రం వమ్ము చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
రైలు టాయిలెట్లోనే బాంబుల తయారీ
సాక్షి, బెంగళూరు/చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం బెంగళూరు-గువాహటి కజీరంగా ఎక్స్‌ప్రెస్ రైల్లో పేలిన రెండు బాంబులను దుండగులు ఆ రైల్లోనే తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముష్కరులు బాంబు తయారీకి వాడే పదార్థాలను.. పేలుళ్లు జరిగిన ఎస్4, ఎస్5 పక్కనున్న ఎస్-7 బోగీలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి బాంబులుగా మార్చారని క్లూస్ టీం నిర్ధారించింది. తయారైన బాంబులను స్టేషన్లోకి తీసుకురావడం ప్రమాదమని భావించే ఇలా చేశారని పేర్కొంది. కార్బన్ జింక్ బ్యాటరీ, టైమర్లు అమర్చిన బాంబులను ఓ సంచిలో ఉంచి ఎస్4, ఎస్5లలో పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వీటిని హడావుడిగా ఉంచడంతో పేలుళ్ల తీవ్రత తగ్గిందన్నాయి. కాగా, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు సీబీసీఐడీ అధికారులు మరికొంతమంది అనుమానితులను గుర్తించారు. బెంగళూరు, చెన్నై స్టేషన్లతోపాటు వాటి మధ్యనున్న స్టేషన్లలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించాక కొన్ని ఆధారాలు దొరికాయని, వీటిని వెల్లడిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు. పోలీసుల బృందం గువాహటి చేరుకుని, కజీరంగా రైల్లో ప్రయాణించిన వారిని విచారిస్తోందని తెలిపారు. బెంగళూరులో రైలు ఎక్కిన అనుమానితుడు, చెన్నై స్టేషన్లో హడావుడిగా రైలు దిగి పరుగెత్తిన అనుమానితుడు ఒకరేనా అని తేల్చుకోవడానికి నిపుణుల సాయం తీసుకుంటున్నామన్నారు. ఈ పేలుళ్లకు, గత ఏడాది అక్టోబర్‌లో పాట్నాలో జరిగిన పేలుళ్లకు వాడిన బాంబులు ఒకేలా ఉండడంతో తాజా పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్, లేదా ఇతర ఉగ్రవాద సంస్థల పనేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఒక పోలీసు బృందాన్ని పాట్నాకు పంపామని వెల్లడించారు. కజీరంగా రైలు బోగీల పేలుళ్లలో గుంటూరుకు చెందిన స్వాతి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోగా 14 మంది గాయపడడం తెలిసిందే. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. -
ఆ బాంబు టాయిలెట్లోనే తయారు చేశారు
బెంగళూరు : చైన్నై రైల్వే స్టేషన్లో పేలిన బాంబును దుండగులు రైలు టాయిలెట్లోనే తయారు చేసినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి బాంబు తయారీకి ఉపయోగించే పదార్థాలను దుండగులు రైల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎస్-7 కోచ్‌లోని టాయిలెట్లో వాటిని క్రోడీకరించి బాంబును తయారు చేశారని క్లూస్ టీం నిర్ధారణకు వచ్చింది. బాంబును పూర్తిగా తయారు చేసి రైల్వేస్టేషన్‌లోకి తీసుకురావడం ప్రమాదమని భావించడం వల్లే దుండగులు ఇలా చేసి ఉంటారని ఆ టీం అభిప్రాయపడింది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి మృతి చెందింది. మరో 15 మంది గాయపడ్డారు. -
చెన్నైలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఉన్న రైల్లో బాంబు పేలి ఒక యువతి మరణించి 24 గంటలు గడిచిందో, లేదో.. చెన్నై పోలీసులకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువైపోయి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఈ ఫోన్లు మాత్రం ఆగడంలేదు. నగరంలోని ఓ పెద్ద షాపింగ్ మాల్, ఓ విద్యాసంస్థ, ఓ శివారు రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. దీంతో వెంటనే భద్రతా విభాగం అధికారులు హుటాహుటిన వెళ్లి అక్కడ పూర్తిస్థాయిలో తనిఖీ చేసినా, బాంబులు మాత్రం దొరకలేదని నగర పోలీసు కమిషనర్ జేకే త్రిపాఠీ తెలిపారు. -
రైల్లో పేలుడు ఉగ్రవాద చర్యే
గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుడు ఉగ్రవాద చర్యేనని పోలీసులు నిర్ధరించారు. వాస్తవానికి ఆ బాంబు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ప్రాంతంలో పేలాల్సిందని, అయితే రైలు గంటన్నర ఆలస్యంగా నడుస్తుండటంతో చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉండగా పేలిందని తమిళనాడు డీజీపీ కె.రామానుజం తెలిపారు. నెల్లూరులో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సభ ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఒక హెచ్చరిక పంపేందుకే ఈ పేలుడుకు కుట్రపన్ని ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండటం.. కేవలం దాని పైభాగంలో ఉన్న సీటు మాత్రమే దెబ్బతినడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కొన్ని పేలుడు పదార్థాలతో రైల్లో దాక్కున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యేనని తమిళనాడు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. అధికారుల నుంచి తనకు సమాచారం అందుతోందని, పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తమిళనాడు పోలీసులకు సహకరించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రెండు బృందాలను పంపింది. వాటిలో ఒకటి హైదరాబాద్ నుంచి, మరొకటి ఢిల్లీ నుంచి వెళ్లాయి. బాంబు పేలుడు కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకదాన్ని ఏర్పాటుచేసినట్లు తమిళనాడు సీఎం జయలలిత తెలిపారు. మృతురాలి కుటుంబానికి లక్ష రూపాయలు, తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి 25వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. దోషులు త్వరలోనే కటకటాల వెనక్కి వెళ్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
స్వాతి కుటుంబానికి లక్ష ఎక్స్‌గ్రేషియా
చెన్నై : గౌహతి ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన స్వాతి కుటుంబానికి రైల్వే శాఖ లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడినవారికి రూ.25 వేలు పరిహారం చెల్లించనుంది. స్వల్పంగా గాయపడినవారికి రూ.5 వేలు ప్రకటించింది. కాగా జంట పేలుళ్లపై రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ఓ యువతి మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రైల్వేమంత్రి మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. మరో ఏడుగురు స్వలంగా గాయపడినట్లు పేర్కొన్నారు. పేలుళ్లు దురదృష్టకరమని, పేలుడు ఘటనపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. పేలుళ్లపై అప్పుడే ఒక నిర్థారణకు రాలేమని, పేలుళ్లకు పాల్పడింది ఎవరూ, ఎలా జరిగిందనే దానిపై నిర్థారణకు ఓ వారం సమయం పట్టవచ్చునన్నారు. ఇక పేలుళ్ల ధాటికి ధ్వంసం అయిన రెండు బోగీలను తొలగించి, వాటి స్థానంలో రెండు బోగీలను జతపరిచి, గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను 11 గంటలకు పంపించనున్నట్లు తెలిపారు. మరోవైపు పేలుళ్లకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పేలుళ్లపై విచారం వ్యక్తం చేశారు. పేలుళ్లు జరగటం దురదృష్టకరమని ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు పంపాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. పేలుళ్లపై క్రైం బ్రాంచ్ సీఐడీ విచారణ జరపనుంది. -
అక్కడ గురి తప్పి... ఇక్కడ పేలిందా!
చెన్నై : ఉద్యాననగరిపై ఉగ్రవాదుల గురి తప్పి.. చెన్నైని టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం జరిగిన జంట పేలుళ్లు ఘటన దానికి బలం చేకూర్చేలా ఉంది. బెంగళూరు నుంచి చెన్నై వచ్చిన గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. కర్ణాటక విధాన సౌధను పేల్చడానికి కుట్రపన్నిన ఐఎస్ఐ ఉగ్రవాదిని తమిళనాడు పోలీసులు రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘావర్గాల సమాచారం మేరకు జాహీర్ హుసేన్ అనే ఉగ్రవాదిని మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో బెంగళూరులోని విధాన సౌధతో పాటు మరికొన్ని ఐటీ కంపెనీల కేంద్ర కార్యాలయాలను బాంబులతో పేల్చివేయడానికి కుట్రపన్నినట్లు జాహీర్ హుసేన్ వెల్లడించాడని తెలుస్తోంది. కాగా జాహీర్ హుసేన్ అరెస్ట్‌తో బెంగళూరులో ముప్పు కొంతవరకు తప్పినా.. ఉగ్రవాదులు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లకు కుట్ర పన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతన్ని అరెస్ట్ చేసిన రెండోరోజే ఈ పేలుళ్లు జరగటం గమనార్హం. దీంతోపాటు ఇంకా ఎక్కడైనా పేలుళ్లకు పాల్పడే ప్రమాదముందేమోనని నిఘావర్గాలు అప్రమత్తం అయ్యాయి. అయితే పేలుళ్లతో తమకు సంబంధం ఉన్నట్లు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.