సాక్షి, బెంగళూరు/చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గురువారం బెంగళూరు-గువాహటి కజీరంగా ఎక్స్‌ప్రెస్ రైల్లో పేలిన రెండు బాంబులను దుండగులు ఆ రైల్లోనే తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముష్కరులు బాంబు తయారీకి వాడే పదార్థాలను.. పేలుళ్లు జరిగిన ఎస్4, ఎస్5 పక్కనున్న ఎస్-7 బోగీలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి బాంబులుగా మార్చారని క్లూస్ టీం నిర్ధారించింది. తయారైన బాంబులను స్టేషన్‌లోకి తీసుకురావడం ప్రమాదమని భావించే ఇలా చేశారని పేర్కొంది. కార్బన్ జింక్ బ్యాటరీ, టైమర్లు అమర్చిన బాంబులను ఓ సంచిలో ఉంచి ఎస్4, ఎస్5లలో పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వీటిని హడావుడిగా ఉంచడంతో పేలుళ్ల తీవ్రత తగ్గిందన్నాయి. కాగా, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు సీబీసీఐడీ అధికారులు మరికొంతమంది అనుమానితులను గుర్తించారు.
బెంగళూరు, చెన్నై స్టేషన్లతోపాటు వాటి మధ్యనున్న స్టేషన్లలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించాక కొన్ని ఆధారాలు దొరికాయని, వీటిని వెల్లడిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు. పోలీసుల బృందం గువాహటి చేరుకుని, కజీరంగా రైల్లో ప్రయాణించిన వారిని విచారిస్తోందని తెలిపారు. బెంగళూరులో రైలు ఎక్కిన అనుమానితుడు, చెన్నై స్టేషన్‌లో హడావుడిగా రైలు దిగి పరుగెత్తిన అనుమానితుడు ఒకరేనా అని తేల్చుకోవడానికి నిపుణుల సాయం తీసుకుంటున్నామన్నారు. ఈ పేలుళ్లకు, గత ఏడాది అక్టోబర్‌లో పాట్నాలో జరిగిన పేలుళ్లకు వాడిన బాంబులు ఒకేలా ఉండడంతో తాజా పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్, లేదా ఇతర ఉగ్రవాద సంస్థల పనేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఒక పోలీసు బృందాన్ని పాట్నాకు పంపామని వెల్లడించారు. కజీరంగా రైలు బోగీల పేలుళ్లలో గుంటూరుకు చెందిన స్వాతి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చనిపోగా 14 మంది గాయపడడం తెలిసిందే. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు.
రైలు టాయిలెట్‌లోనే బాంబుల తయారీ
Published Mon, May 5 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement
Advertisement