స్వాతి కుటుంబానికి లక్ష ఎక్స్గ్రేషియా
చెన్నై : గౌహతి ఎక్స్ప్రెస్ బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన స్వాతి కుటుంబానికి రైల్వే శాఖ లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడినవారికి రూ.25 వేలు పరిహారం చెల్లించనుంది. స్వల్పంగా గాయపడినవారికి రూ.5 వేలు ప్రకటించింది. కాగా జంట పేలుళ్లపై రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ఓ యువతి మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రైల్వేమంత్రి మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. మరో ఏడుగురు స్వలంగా గాయపడినట్లు పేర్కొన్నారు. పేలుళ్లు దురదృష్టకరమని, పేలుడు ఘటనపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.
పేలుళ్లపై అప్పుడే ఒక నిర్థారణకు రాలేమని, పేలుళ్లకు పాల్పడింది ఎవరూ, ఎలా జరిగిందనే దానిపై నిర్థారణకు ఓ వారం సమయం పట్టవచ్చునన్నారు. ఇక పేలుళ్ల ధాటికి ధ్వంసం అయిన రెండు బోగీలను తొలగించి, వాటి స్థానంలో రెండు బోగీలను జతపరిచి, గౌహతి ఎక్స్ప్రెస్ను 11 గంటలకు పంపించనున్నట్లు తెలిపారు.
మరోవైపు పేలుళ్లకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పేలుళ్లపై విచారం వ్యక్తం చేశారు. పేలుళ్లు జరగటం దురదృష్టకరమని ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు పంపాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. పేలుళ్లపై క్రైం బ్రాంచ్ సీఐడీ విచారణ జరపనుంది.