chennai central railway station
-
చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపు
సాక్షి, చెన్నై: చెన్నై సెంట్రల్, మదురై రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు చేసిన రామనాథపురం వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు రైల్వేస్టేషన్ కంట్రోల్ రూం వాట్సాప్ నెంబరుకు ఒక సమాచారం వచ్చింది. అందులో చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్లలో బాంబులు పెట్టామని, మరికొద్ది సేపట్లో పేలనున్నట్లు ఉంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అధికారులు చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్ల కంట్రోల్ రూంలకు సమాచారం అందించారు. ఈ రెండు రైల్వేస్టేషన్లలో భద్రతా అధికారులు, బాంబు స్క్వాడ్ నిపుణులు పోలీసు జాగిలాలతో రెండు గంటలపాటు తనిఖీలు జరిపారు. బాంబులేవీ లభించలేదు. విచారణలో బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి రామనాథపురానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక దళం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: మద్యం మత్తులో వదినను లైంగికంగా వేధించిన మరిది.. -
హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్.. అరెస్ట్
హైదరాబాద్: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో సోమవారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో దంపతుల నుంచి 10 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుంచి కోల్‌కతా మీదుగా బంగారాన్ని చెన్నైకు దంపతులు తీసుకవచ్చారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అందిన పక్కా సమాచారంతో డీఆర్ఐ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బంగారం స్మగ్లింగ్ చేసిన మరియ సెల్వరాజ్ అనే దంపతులను అరెస్ట్ చేశారు. -
నిందితుల జాడేది?
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ మే 1వ తేదీన జంట పేలుళ్లతో దద్దరిల్లింది. ఆనాటి దుర్ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్వాతి ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారానికి వంద రోజులు పూర్తిచేసుకుంది. అయితే విచారణ మాత్రం ఒక్క అడుగూ ముందుకు కదలలేదు. పోలీసులు నిందితుల నిగ్గు తేల్చలేకపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశంలోని అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో తీవ్రవాదుల అలికిడి తక్కువ. అయితే ఆ రోజులు మారిపోయాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలే ఇందుకు తార్కాణం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తలపెట్టిన సభల్లో బాంబు పేలుళ్లకు ప్రయత్నాలు జరిగాయి. బీజేపీ, హిందూ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. సుమారు పది మంది వరకు కరుడుగట్టిన ఐఎస్ఐ తీవ్రవాదులు అరెస్టయ్యారు. కొందరు తృటిలో తప్పించుకున్నారు. బీజేపీ, హిందూనేతలకు ఇటీవల తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచివున్నట్లు సమాచారం అందింది. అడపాదడపా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం రాష్ట్ర పోలీస్ యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తూనే ఉంది. నిందితులేరీ? రాష్ట్రంలో తీవ్రవాదుల ఉనికిని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో జంట పేలుళ్లు మరోసారి బహిర్గతం చేశాయి. బెంగళూరు నుంచి (వయా చెన్నై) గుహవటికి వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు మే 1వ తేదీ ఉదయం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని 9వ నంబరు ఫ్లాట్‌ఫామ్‌పై ఆగింది. రైలు ఆగిన వెంటనే రెండు భోగీల్లో పేలుళ్లు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీసీఎస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వాతి కూర్చున్న సీట్ కిందనే బాంబుపేలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే అధికారులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. అప్పటికప్పుడే పోలీసు విచారణ బృందం రంగంలోకి దిగింది. అదిగో ఆచూకీ, ఇదిగో నిందితుడు అంటూ కొద్దిరోజులు హడావుడి చేశారు. ఇది తీవ్రవాదుల పనేనని అన్నారు. అయితే ఏ తీవ్రవాద సంస్థా ఈ సంఘటనపై ప్రకటన చేయలేదు. ఇతర కేసుల్లో పట్టుబడిన నిందితులకు సెంట్రల్ పేలుళ్లతో సంబంధాలున్నట్లు ప్రచారం చేశారు. అయితే ఇవేవీ నిర్ధారించలేదు. వీలైనంత వేగంగా నిందితులను పట్టుకుని ప్రయాణికులకు ధైర్యం కల్పించాల్సిన విచారణ బృందంలో పురోగతి లేకపోయింది. పేలుళ్లు చోటుచేసుకుని వందరోజులు పూర్తవుతున్నా స్పష్టమైన ఆధారాలు, నిందితుల అరెస్ట్ లేనికారణంగా వైఫల్యాలు తేటతెల్లమయ్యాయి. ప్రయాణికుల భద్రత ఎంతమాత్రమో తెలియని పరిస్థితి. -
రైలు టాయిలెట్లోనే బాంబుల తయారీ
సాక్షి, బెంగళూరు/చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం బెంగళూరు-గువాహటి కజీరంగా ఎక్స్‌ప్రెస్ రైల్లో పేలిన రెండు బాంబులను దుండగులు ఆ రైల్లోనే తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముష్కరులు బాంబు తయారీకి వాడే పదార్థాలను.. పేలుళ్లు జరిగిన ఎస్4, ఎస్5 పక్కనున్న ఎస్-7 బోగీలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి బాంబులుగా మార్చారని క్లూస్ టీం నిర్ధారించింది. తయారైన బాంబులను స్టేషన్లోకి తీసుకురావడం ప్రమాదమని భావించే ఇలా చేశారని పేర్కొంది. కార్బన్ జింక్ బ్యాటరీ, టైమర్లు అమర్చిన బాంబులను ఓ సంచిలో ఉంచి ఎస్4, ఎస్5లలో పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వీటిని హడావుడిగా ఉంచడంతో పేలుళ్ల తీవ్రత తగ్గిందన్నాయి. కాగా, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు సీబీసీఐడీ అధికారులు మరికొంతమంది అనుమానితులను గుర్తించారు. బెంగళూరు, చెన్నై స్టేషన్లతోపాటు వాటి మధ్యనున్న స్టేషన్లలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించాక కొన్ని ఆధారాలు దొరికాయని, వీటిని వెల్లడిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు. పోలీసుల బృందం గువాహటి చేరుకుని, కజీరంగా రైల్లో ప్రయాణించిన వారిని విచారిస్తోందని తెలిపారు. బెంగళూరులో రైలు ఎక్కిన అనుమానితుడు, చెన్నై స్టేషన్లో హడావుడిగా రైలు దిగి పరుగెత్తిన అనుమానితుడు ఒకరేనా అని తేల్చుకోవడానికి నిపుణుల సాయం తీసుకుంటున్నామన్నారు. ఈ పేలుళ్లకు, గత ఏడాది అక్టోబర్‌లో పాట్నాలో జరిగిన పేలుళ్లకు వాడిన బాంబులు ఒకేలా ఉండడంతో తాజా పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్, లేదా ఇతర ఉగ్రవాద సంస్థల పనేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఒక పోలీసు బృందాన్ని పాట్నాకు పంపామని వెల్లడించారు. కజీరంగా రైలు బోగీల పేలుళ్లలో గుంటూరుకు చెందిన స్వాతి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోగా 14 మంది గాయపడడం తెలిసిందే. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. -
ఆ బాంబు టాయిలెట్లోనే తయారు చేశారు
బెంగళూరు : చైన్నై రైల్వే స్టేషన్లో పేలిన బాంబును దుండగులు రైలు టాయిలెట్లోనే తయారు చేసినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి బాంబు తయారీకి ఉపయోగించే పదార్థాలను దుండగులు రైల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎస్-7 కోచ్‌లోని టాయిలెట్లో వాటిని క్రోడీకరించి బాంబును తయారు చేశారని క్లూస్ టీం నిర్ధారణకు వచ్చింది. బాంబును పూర్తిగా తయారు చేసి రైల్వేస్టేషన్‌లోకి తీసుకురావడం ప్రమాదమని భావించడం వల్లే దుండగులు ఇలా చేసి ఉంటారని ఆ టీం అభిప్రాయపడింది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి మృతి చెందింది. మరో 15 మంది గాయపడ్డారు. -
పేలుళ్ల దర్యాప్తులో ముందడుగు!
* బెంగళూరు స్టేషన్లోనూ కనిపించిన * రైలు పేలుళ్ల అనుమానితుడు చెన్నై: బెంగళూరు-గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు పేలుళ్ల దర్యాప్తులో ముందడుగు! గురువారం పేలుళ్లు జరిగిన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో రికార్డయిన సీసీటీవీ దృశ్యాల్లో ఫ్లాట్‌ఫారమ్‌పై పరిగెడుతూ కనిపించిన అనుమానితుడు బెంగళూరు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ దృశ్యాల్లోనూ కనిపించాడు. బెంగళూరు స్టేషన్లో ముఖం కనిపించకుండా కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నాడని పోలీసులు శనివారం చెప్పారు. దీంతో అతనిపై అనుమానం మరింత బలపడుతోంది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. బట్టతలతో, నడివయసులో ఉన్న అతడు గురువారం చెన్నైలో గువాహటి ఎక్స్‌ప్రెస్ రైల్లో పేలుళ్లు సంభవించిన ఎస్4, ఎస్5 బోగీల పక్కనున్న ఎస్3 బోగీ నుంచి హడావుడిగా రైలు దిగి ఎగ్జిట్ మార్గం వద్దకు పరుగులు తీశాడు. అతడు ఉదయం 7.08 గంటలకు రైలు దిగగా, 7.15 ప్రాంతంలో రెండు పేలుళ్లు జరిగాయి. చెన్నై స్టేషన్లో ఈ అనుమానితుడి కదలికలు అసాధారణంగా ఉన్నాయని పోలీసులు శనివారమే వెల్లడించారు. చెన్నైలో రైలు దిగిన అతడు మళ్లీ అక్కడ రైలు ఎక్కలేదని స్పష్టం చేశారు. అతని వివరాల కోసం పోలీసులు అతని సహప్రయాణికులను విచారిస్తున్నారు. మరోపక్క.. బెంగళూరులో ఇద్దరు అనుమానితులను తమిళనాడు సీబీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, రైల్లోని ఎస్4, ఎస్5 బోగీల్లో టికెట్లు రిజర్వు చేసుకున్న ఇద్దరు బుకింగ్ సమయంలో గుర్తింపు కోసం ఇచ్చిన చిరునామా తదితర వివరాలు నకిలీవని తేలింది. పేలుళ్లలో వీరి ప్రమేయం ఉండే అవకాశముందని భావిస్తున్నారు. -
పేలుళ్ల అనుమానితుడి వీడియో విడుదల
* రైలు దిగి పరిగెత్తిన అనుమానితుడు * తమిళనాడు సీబీసీఐడీ వెల్లడి * బాంబులను బెంగళూరులో అమర్చి ఉండొచ్చని అనుమానం చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం బెంగళూరు- గువాహటి రైల్లో జరిగిన రెండు బాంబుల పేలుళ్లకు సంబంధించి కీలక అనుమానితుడి వీడియో ఫుటేజీని శుక్రవారమ్కిడ విడుదల చేశారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో దర్యాప్తులో తొలి ఆధారం దొరికినట్లు భావిస్తున్నారు. తమిళనాడు సీబీసీఐడీ ఐజీపీ మహేశ్‌కుమార్ అగర్వాల్ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పుటేజీని విడుదల చేశారు. ‘కొన్ని వీడియో దృశ్యాల్లో కనిపించిన వ్యక్తి కదలికలు అసాధారణంగా ఉన్నాయి. వీటిని తనిఖీ చేయాలి’ అని అన్నారు. వీడియో ఫుటేజీలో.. బట్టతలలో ఉన్న మధ్యవయస్కుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. రైలు తొమ్మిదో నంబర్ ఫ్లాట్‌ఫారమ్ చేరుకున్నాక అతడు.. పేలుళ్లు జరిగిన ఎస్4, ఎస్5 బోగీల పక్కనున్న ఎస్3 బోగీ నుంచి హడావుడిగా రైలు దిగి పరిగెత్తాడు. అతడు చెన్నైలో రైలు ఎక్కలేదని ఐజీపీ స్పష్టం చేశారు. ఈ అనుమానితుడి సమాచారాన్ని సీబీసీఐడీ కంట్రోల్ రూమ్ నంబర్లు 044-22502510/ 22502500, 77086 54202లకు తెలియజేయాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. పేలుళ్లకు వాడిన బాంబులను చెన్నైలో అమర్చలేదని, వాటిని చెన్నైకి ముందు స్టేషన్లలో పెట్టి ఉండొచ్చని ఐజీపీ తెలిపారు. ముష్కరుల లక్ష్యం కూడా చెన్నై కాదని తెలుస్తోందన్నారు. రైలు ఆలస్యం కాకుండా షెడ్యూలు ప్రకారం నడిచి ఉంటే ఉదయం ఏడింటికి అది ఆంధ్రప్రదేశ్‌లో ఉండేదన్నారు. పేలిన బాంబులకు కొన్ని నెలల కిందటి పాట్నా పేలుళ్లకు వాడిన బాంబులతో పోలికలు ఉన్నాయన్నారు. బాంబుల లక్ష్యం గురువారం ఆంధప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీనా అని అడగ్గా, టార్గెట్‌పై నిర్దిష్ట సమాచారమేదీ లేదన్నారు. పేలుళ్ల స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. బెంగళూరులో తమిళనాడు సీబీఐసీఐడీ సాక్షి, చెన్నై/బెంగళూరు: గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో పేలిన రెండు బాంబులను బెంగళూరులో అమర్చి ఉంటారని తమిళనాడు సీబీసీఐడీ అనుమానిస్తోంది. తక్కువ తీవ్రత గల టైమర్ బాంబులను రైలు బెంగళూరులో బయల్దేరడానికి ముందు అమర్చి ఉండొచ్చని తమిళనాడు సీబీసీఐడీ అధికారి ఒకరు చెప్పారు. దుండగులకు కర్ణాటకలోని నిద్రాణ ఉగ్ర వాద ముఠాలు సహకరించి ఉండొచ్చని సమాచారం అందడంతో తమిళనాడు సీబీసీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం బెంగళూరు చేరుకుంది. సిటీ రైల్వే స్టేషన్లో గురువారం నాటి సీసీటీవీ వీడియోలను పరిశీలించింది. పేలుళ్లు జరిగిన ఎస్-4, ఎస్-5ల బోగీల్లో ప్రయాణించిన 74 మంది పేర్లు, సెల్‌ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు సేకరించింది. ఈ పేలుళ్లలో గుంటూరుకు చెందిన స్వాతి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోగా, 14 మంది గాయపడడం తెలిసిందే. ఎన్ఎస్జీ బృందం చెన్నైకి చేరుకుని పేలుళ్ల స్థలాన్ని, పేలుళ్లు జరిగిన రెండు బోగీలను పరిశీలించింది. గురు, శుక్రవారాల్లో చెన్నైలో ఓ షాపింగ్ మాల్, విద్యాసంస్థ, సబర్బన్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టించాయి. విస్తృతంగా తనిఖీ చేసిన పోలీసులు ఫోన్స్ కాల్స్ నకిలీవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలో మరిన్ని పేలుళ్లకు కుట్ర: రైల్లో పేలుళ్ల నేపథ్యంలో తమిళనాడు పోలీసులు రాష్ట్రంలో జరిపిన తనిఖీల్లో 15 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరు చెన్నైల్లో మరిన్ని పేలుళ్లకు కుట్ర పన్నారని అనుమానిస్తున్నారు. గత నెల 29న అరె స్టు చేసిన శ్రీలంకకు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ జాకీర్ హుస్సేన్ పోలీసుల విచారణలో.. చెన్నైలో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తెలిసింది. దీంతో పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టారు. శ్రీలంకకు చెందిన శివబాలన్(39)ను టీ నగర్లో, మహమ్మద్ సలీం(37)ను రాయపురంలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని, రూ. 2.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అషఫ్ ్రఆలీని, అతని అనుచరులుగా భావిస్తున్న 12 మందిని కడలూరు జిల్లా పరంగిపేట్టైలోని ఓ ఇంట్లో అరెస్ట్ చేశారు. -
పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం
-
ఉద్యోగంలో చేరిన 3 నెలలకే..
* సెలవులో వస్తూ ప్రాణాలు కోల్పోయిన స్వాతి గుంటూరు, న్యూస్‌లైన్: గువాహటి ఎక్స్‌ప్రెస్ పేలుళ్లలో మరణించిన గుంటూరు లోని శ్రీనగర్ 7వ లైనుకు చెందిన స్వాతి మూడు నెలల కిందటే బెంగళూరులోని టీసీఎస్‌లో చేరారు. మరికొద్ది నెలల్లోనే ఈమె వివాహం కానున్నట్టు సమాచారం. గుంటూరులో ప్రాథమిక విద్య అనంతరం హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్, ఎంటెక్ చేసిన స్వాతి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. స్వాతి తల్లిదండ్రులు పరుచూరి రామకృష్ణ, పరుచూరి కామాక్షి. వీరికి ఇద్దరే సంతానం కాగా.. స్వాతి తమ్ముడు ప్రద్యుమ్న ముంబై ఐఐటీలో చదువుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఉద్యోగంలో చేరిన స్వాతి, అదే నెల చివర్లో స్వస్థలానికి వచ్చి వెళ్లింది. వేసవి కావడంతో ఏడు రోజులు సెలవు తీసుకుని గుంటూరు వచ్చేందుకు బుధవారం గువాహటి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. రాత్రి 11.30 సమయంలో ఫోన్ చేసి ఈ మేరకు సమాచారం అందించింది. ఉదయం ఆమె రాకకోసం ఎదురుచూస్తున్న తల్లిదండులకు ఊహించని విషాదం ఎదురైంది. ఆమె మరణవార్త తెలుసుకుని చెన్నై వెళ్లిన కుటుంబసభ్యులు పోస్టుమార్టం అనంతరం స్వాతి మృతదేహాన్ని తీసుకుని తిరిగి గుంటూరుకు బయలుదేరారు. వ్యవసాయం చేసే రామకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి కాగా కొంతకాలంగా నగరంలోనే స్థిరపడ్డారు. ఆయన భార్య కామాక్షి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. -
రైల్లో బాంబు పేలుళ్లు
* గుంటూరుకు చెందిన యువతి మృతి * 14 మందికి గాయాలు.. చెన్నై సెంట్రల్ స్టేషన్లో దుర్ఘటన * బెంగళూరు నుంచి గువాహటి వెళుతున్న రైల్లోని ఎస్-4, ఎస్-5 బోగీల్లో పేలిన బాంబులు * మరో రెండు పేలని బాంబులు స్వాధీనం! * దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు అప్రమత్తం * పేలుళ్లను ఖండించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి * మృతురాలి కుటుంబానికి లక్ష ఎక్స్‌గ్రేషియూ: రైల్వే మంత్రి * సీబీ-సీఐడీ విచార ణకు ఆదేశించిన తమిళనాడు ప్రభుత్వం.. దర్యాప్తులో కేంద్ర సహాయానికి నిరాకరణ సాక్షి, చెన్నై/ న్యూఢిల్లీ/ బెంగళూరు: స్థలం: చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్.9 సమయం: గురువారం ఉదయం 07.10 గంటలు బెంగళూరు నుంచి చెన్నై, విజయవాడ మీదుగా గువాహటి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. రైలు అప్పటికే సుమారుగా గంటన్నర లేటు. ఇంతలో రైలు రాకగురించిన ప్రకటన విన్పించడంతో ప్రయాణికుల్లో హడావుడి మొదలైంది. రైలు ప్లాట్‌ఫామ్ మీదకి వస్తోందనగా ఐదు నిమిషాల వ్యవధిలోనే ఒకదాని వెంబడి మరొకటిగా రెండు పేలుళ్లు సంభవించాయి.. ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు పరుగులు పెట్టారు. పేలుళ్లు సంభవించిన గువాహటి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-4, ఎస్-5 బోగీల్లో హాహాకారాలు చెలరేగాయి. ఎస్-5లో ప్రయూణిస్తున్న బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగి, గుంటూరుకు చెందిన పరుచూరి స్వాతి (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. గాయపడిన వారిని పోలీసులు స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు ప్రభుత్వం పేలుళ్లపై తమ ప్రత్యేక పోలీసు విభాగం సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించింది. ఛిద్రమైన స్వాతి శరీరం గువాహటి ఎక్స్‌ప్రెస్ బెంగళూరులో బుధవారం రాత్రి 11.30లకు బయలుదేరింది. ఉదయం 07.10 ప్రాంతంలో రైలు స్టేషన్ సమీపిస్తుండగా మొదట ఎస్-4 బోగీలో సీటు నంబరు 28 కింద, స్వల్పతేడాతో ఎస్-5 సీటు నంబరు 69 కింద అమర్చిన తక్కువ తీవ్రత కలిగిన రెండు బాంబులు భారీ శబ్దంతో పేలాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు తలోదిక్కుగా పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు ప్లాట్‌ఫామ్ నంబర్ 9లో గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లు సంభవించినట్టు గుర్తించారు. పేలుళ్ల ధాటికి మరణించిన స్వాతి ఎస్-5లో సీటు నంబరు 69లో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. పేలుడు తీవ్రతకు ఆమె శరీరం ఛిద్రమైంది. రెండు బోగీల అడుగు భాగంలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డారుు. ఎస్-4లో సీటు నంబర్లు 25-32, ఎస్-5లో 65-72 సీటు నంబర్ల మధ్య పేలుళ్లు సంభవించడంతో ఆయా సీట్లలో ప్రయాణిస్తున్న వారే తీవ్రంగా గాయపడ్డారు. లోయర్ బెర్త్ కింద బాంబు అమర్చడంతో అధిక శాతం మందికి కాళ్లు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే, జీఆర్ పోలీస్, ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు బాంబు స్క్వాడ్లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారుు. బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న అనేక రైళ్లను నిలిపివేశారు. కొన్నింటిని రద్దుచేశారు. ఎస్-4లో పేలుడు ధాటికి ఎస్-3 బోగీ కూడా దెబ్బతింది. బెంగళూరు నుంచి వచ్చిన వారితో పాటు చెన్నైలో ఎక్కాల్సిన వారి లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేసి బోగీల్లోకి ఎక్కించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు రైలు గువాహటి బయలుదేరింది. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెంది న ఆంజనేయులు (29) అనే వ్యక్తి గొంతులో ఏదో దిగబడడంతో తీవ్ర రక్తస్రావమైంది. అతనికి శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మురళి (27), లోక్‌నాథ్ (విశాఖపట్నం)లు కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. సుమంతో దేవనాథ్ (37), గుర్తు తెలియని మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రైలు సుమారు గంటన్నర ఆలస్యంగా నడుస్తుండటంతో పేలుళ్లకు కుట్రదారుల లక్ష్యం చెన్నై కాకపోవచ్చనే అనుమానాన్ని తమిళనాడు డీజీపీ కె.రామానుజం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నట్టైతే.. పేలుళ్లు సంభవించిన 7.10 సమయూనికి ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేటకు సమీపంలో రైలు ఉండేదని అంటున్నారు. టైమర్లను అమర్చి పేలుళ్లకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఎలాంటి పరికరాన్ని వినియోగించారో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. టిఫిన్ బాక్సు, సిలిండర్ రూపంలో ఉన్న రెండు పేలని బాంబులను నిర్వీర్యం చేశారు. గత కొన్నేళ్లలో చెన్నైలో పేలుళ్లు సంభవించడం బహుశా ఇదే మొదటిసారి. 1998లో వివిధ ప్రాంతాల్లో జరిగిన 12 పేలుళ్లలో సుమారు 60 మంది చని పోయారు. ఉగ్రవాది అనే అనుమానంతో రెండురోజుల క్రితం శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, అతనికి మన దేశానికి చెందిన ఉగ్ర మాడ్యూళ్లతో సంబంధాలున్నట్టుగా విశ్వసిస్తున్న నేపథ్యంలో తాజా పేలుళ్లు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ పేలుళ్ల దర్యాప్తులో కేంద్ర సహాయం తీసుకునేందుకు తమిళనాడు సీఎం జయలలిత నిరాకరించారు. దీనిని బట్టి ఇది ఉగ్రవాదుల చర్యగా ఆ రాష్ట్రం భావించడం లేదని తెలుస్తోంది. బుద్ధిలేని హింసాకాండ... ప్రణబ్ రైల్లో పేలుళ్లను బుద్ధిలేని హింసాత్మక చర్యగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభివర్ణించారు. పేలుళ్ల వార్త తెలుసుకుని తానెంతో విచారానికి గురైనట్టు తమిళనాడు గవర్నర్ రోశయ్యకు పంపిన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్సింగ్, తమిళనాడు సీఎం జయలలిత, కాంగ్రెస్, బీజేపీ సహాపలు పార్టీల నేతలు పేలుళ్లను ఖండించారు. మృతురాలి కుటుంబానికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియూ అందిస్తున్నట్లు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 వేలు, స్వల్ప గాయాలైన వారికి 5 వేలను పరిహారంగా ఇస్తున్నట్టు తెలిపారు. 044 - 25357398 హెల్ప్‌లైన్‌ను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ముష్కరుల ఫొటోల్లో చెన్నై సెంట్రల్! సాక్షి, చెన్నై: గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ప్రకటించకున్నా ఇది ఐఎస్ఐ తీవ్రవాదుల పనేనని అధికారులు విశ్వసిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ జాకీర్ హుస్సేన్ పాత్ర ఉందేమో నని అనుమానిస్తున్నారు. అతన్ని గత నెల 29న చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. జాకీర్ అనుచరులు పలువురు అప్పటికే నగరంలో సంచరిస్తున్నట్లు తెలియడంతో గాలింపులు చేపట్టి 30న ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఈ ముఠా నగరంలో విధ్వంసాలు సృష్టించేందుకు అనువైన ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ప్రాంతాలను ఫొటోలు తీసి శ్రీలంకకు పంపుతున్నట్లు తేలింది. ఈ ఫొటోల్లో సెంట్రల్ రైల్వే స్టేషన్, నగరంలోని జెమినీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుళ్లకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఎస్-4లోని విశాఖపట్నం వాసి ఆనంద్ వినయ్, ఎస్-5లోని బీహార్‌కు చెందిన మహ్మద్ ఖాద్రీలను పోలీసులు విచారిస్తున్నారు. విమానాశ్రయాల్లో బందోబస్తు పెంపు న్యూఢిల్లీ: చెన్నైలో పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అప్రమత్తం చేసింది. బందోబస్తును తీవ్రం చేయడంతో పాటు క్విక్ రియూక్షన్ బృందాలను పెంచాల్సిందిగా, ప్రయాణికులకు వివిధ రకాల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలోనూ నిఘా విస్తృతం చేశారు. -
రైల్వే స్టేషన్లో హై అలర్ట్
ఆర్పీఎఫ్, జీఆర్పీ, సివిల్ పోలీసుల సంయుక్త తనిఖీలు కర్నూలు, న్యూస్‌లైన్: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జంట పేలుళ్ల సంఘటన నేపథ్యంలో జిల్లాలో రైల్వే స్టేషన్లో హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై పేలుళ్ల సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా పోలీసులకు నాటు బాంబులు లభించడంతో గురువారం జిల్లాలోని కర్నూలు, నంద్యాల, డోన్ రైల్వే స్టేషన్లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పాటు రైల్వే పోలీసులు కూడా అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఆర్పీఎప్, జీఆర్పీ, సివిల్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫారం బయట, లోపల, రైల్వే స్టేషన్ చుట్టు పక్కల క్లాక్ రూమ్స్‌లో సోదాలు చేశారు. కర్నూలులో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్నజీముద్దీన్, జీఆర్పీ సీఐ వివి.నాయుడు, రెండవ పట్టణ సీఐ బాబు ప్రసాద్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులు, బ్యాగులు సోదాలు చేశారు. అలాగే గుంటూరు-కాచిగూడ, గుంతకల్లు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లలో పెట్టెల వారీగా తనిఖీలు చేపట్టారు. నంద్యాలలో ఐదు రైళ్లు, డోన్‌లో నాలుగు రైళ్లు, కర్నూలులో రెండు రైళ్లు కలిపి మొత్తం 11 రైళ్లల్లో తనిఖీలు నిర్వహించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. తీవ్రవాదుల పేలుళ్లపై అనుమానం వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లకు, రైల్వే పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలంటూ పోలీసు, రైల్వే అధికారులు ప్రయాణికులకు తగు సూచనలు చేశారు. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు రైల్వే స్టేషన్లో ఆ చివర నుంచి ఈ చివరి వరకు దాదాపు గంటపాటు పోలీస్ జాగిలంతో పాటు బాంబు స్క్వాడ్ బృందంతో సోదాలు నిర్వహించారు. ఒకేసారి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తుండటంతో ఏమి జరిగిందోనని కొంత మంది ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. -
ఆ బాంబులు సీమాంధ్ర కోసమేనా?
గురువారం చెన్నైలో పేలిన బాంబులు నిజానికి ఆంధ్రప్రదేశ్ లో పేల్చాలని ఉగ్రవాదులు పథకం వేశారా? ఆ బాంబులను ఆంధ్రప్రదేశ్ లోకి తరలిస్తున్నారా? అవుననే అంటున్నారు ఉగ్రవాద వ్యవహారాల నిపుణులు. ఎందుకంటే సీమాంధ్ర తప్ప మొత్తం దక్షిణ భారతదేశంలో ఎన్నికలు అయిపోయాయి. ఈ బాంబులు పేలిక కంపార్ట్ మెంట్లలోని ప్రయాణికులు అందరూ కోస్తా ప్రాంతానికి వెళ్తున్న వారే. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు వీటిని ఉద్దేశించి ఉండవచ్చునని హోం శాఖ కు చెందిన ఒక నిపుణుడు పేర్కొన్నారు. రైలు చెన్నైకి దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. సమాయినికి రైలు ప్రయాణించి ఉంటే బాంబు పేలే సమయానికి అది కోస్తా ప్రాంతంలో ఉండి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అయితే బాంబులను టైమర్ ద్వారా పేల్చి ఉండవచ్చునని చెబుతున్నారు. మరో వైపు బాంబు పేలుళ్ల నేపథ్యంలో రైలులోనే ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెన్నై రైల్వే స్టేషన్ లో కానీ, తమిళనాడులో రైళ్లలో కానీ పేలుళ్లు జరగడం ఇదే తొలిసారి. తమిళనాట ఇంతకుముందు ఒకే బాంబు పేలుడు సంఘటన జరిగింది. అంది 1998 లో కోయంబత్తూరులో ఒకే సారి 12 చోట్ల బాంబులు పేలి, 60 మంది చనిపోయారు. దాదాపు 200 మంది గాయపడ్డారు. ఆ తరువాత జరిగిన సంఘటన ఇదే. -
రైల్లో పేలుడు ఉగ్రవాద చర్యే
గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుడు ఉగ్రవాద చర్యేనని పోలీసులు నిర్ధరించారు. వాస్తవానికి ఆ బాంబు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ప్రాంతంలో పేలాల్సిందని, అయితే రైలు గంటన్నర ఆలస్యంగా నడుస్తుండటంతో చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉండగా పేలిందని తమిళనాడు డీజీపీ కె.రామానుజం తెలిపారు. నెల్లూరులో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సభ ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఒక హెచ్చరిక పంపేందుకే ఈ పేలుడుకు కుట్రపన్ని ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండటం.. కేవలం దాని పైభాగంలో ఉన్న సీటు మాత్రమే దెబ్బతినడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కొన్ని పేలుడు పదార్థాలతో రైల్లో దాక్కున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యేనని తమిళనాడు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. అధికారుల నుంచి తనకు సమాచారం అందుతోందని, పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తమిళనాడు పోలీసులకు సహకరించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రెండు బృందాలను పంపింది. వాటిలో ఒకటి హైదరాబాద్ నుంచి, మరొకటి ఢిల్లీ నుంచి వెళ్లాయి. బాంబు పేలుడు కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకదాన్ని ఏర్పాటుచేసినట్లు తమిళనాడు సీఎం జయలలిత తెలిపారు. మృతురాలి కుటుంబానికి లక్ష రూపాయలు, తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి 25వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. దోషులు త్వరలోనే కటకటాల వెనక్కి వెళ్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు
-
స్వాతి కుటుంబానికి లక్ష ఎక్స్‌గ్రేషియా
చెన్నై : గౌహతి ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన స్వాతి కుటుంబానికి రైల్వే శాఖ లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడినవారికి రూ.25 వేలు పరిహారం చెల్లించనుంది. స్వల్పంగా గాయపడినవారికి రూ.5 వేలు ప్రకటించింది. కాగా జంట పేలుళ్లపై రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ఓ యువతి మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రైల్వేమంత్రి మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. మరో ఏడుగురు స్వలంగా గాయపడినట్లు పేర్కొన్నారు. పేలుళ్లు దురదృష్టకరమని, పేలుడు ఘటనపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. పేలుళ్లపై అప్పుడే ఒక నిర్థారణకు రాలేమని, పేలుళ్లకు పాల్పడింది ఎవరూ, ఎలా జరిగిందనే దానిపై నిర్థారణకు ఓ వారం సమయం పట్టవచ్చునన్నారు. ఇక పేలుళ్ల ధాటికి ధ్వంసం అయిన రెండు బోగీలను తొలగించి, వాటి స్థానంలో రెండు బోగీలను జతపరిచి, గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను 11 గంటలకు పంపించనున్నట్లు తెలిపారు. మరోవైపు పేలుళ్లకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పేలుళ్లపై విచారం వ్యక్తం చేశారు. పేలుళ్లు జరగటం దురదృష్టకరమని ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు పంపాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. పేలుళ్లపై క్రైం బ్రాంచ్ సీఐడీ విచారణ జరపనుంది. -
ప్లాట్ఫారం మూసివేత.. హెల్ప్‌లైన్ నంబర్ల ప్రకటన
చెన్నై రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుడు అనంతరం తొమ్మిదో నెంబరు ప్లాట్‌ఫారాన్ని మూసేశారు. బాంబు పేలుడు ఫలితంగా రెండు బోగీలతో పాటు ప్లాట్ఫారం కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ప్లాట్‌ఫారాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. రైల్లో మరిన్ని బాంబులు ఏమైనా ఉన్నాయేమోనని పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. చెన్నై వస్తున్న పలు రైళ్లను ఇతర స్టేషన్లలో ఆపేశారు. చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్లే దారులన్నీ హడావుడిగా మారిపోయాయి. మరోవైపు బెంగళూరు, చెన్నైలలో భారతీయ రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటుచేసింది. ప్రయాణికులు గానీ, వారి బంధువులు గానీ సంప్రదించేందుకు వీలుగా ఈనెంబర్లు ప్రకటించింది. పేలుడుకు కారణం ఏంటన్న విషయం ఇంతవరకు నిర్ధారణ కాలేదని తమిళనాడు డీజీపీ కె.రామానుజం తెలిపారు. బెంగళూరు వాసులు అయితే 080- 22876288, చెన్నై వాసులు అయితే 044 25357398 నెంబర్లలో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. -
చెన్నై పేలుళ్లలో గుంటూరు యువతి మృతి
చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో మృతి చెందిన యువతి గుంటూరు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతురాలు గుంటూరుకు చెందిన స్వాతిగా (22) గుర్తించటం జరిగింది. కాగా చెన్నైపై ఉగ్రవాదులు పంజా విసిరారు. చెన్నై రైల్వేస్టేషన్ గురువారం ఉదయం జంట పేలుళ్లతో దద్దరిల్లింది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి ఎస్-4 బోగీలోని 70వ సీటులో కూర్చున్న స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటు.... ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు వణికిపోయారు. భయంతో రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీశారు. మరోవైపు బాంబు పేలుళ్ల సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. -
ఎస్-4 బోగీలోని సీటు నెం.70వద్ద పేలుడు!
చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ బాంబు పేలుళ్ల ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తొమ్మిదో నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్ లోని ఎస్-4,5 బోగీల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు గుర్తించారు. ఎస్-4 బోగీలోని సీటు నెంబరు 70 వద్ద పేలుళ్లు జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. గురువారం ఉదయం 7.20 నిమిషాలకు మొదటి పేలుడు, వెంటనే రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో రెండు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇక జంట పేలుళ్లలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 15 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీ టీవీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు
చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పదిమంది గాయపడినట్లు సమాచారం. రైల్వే స్టేషన్‌లోని 9వ నెంబర్ ఫ్లాట్‌ఫామ్ పై నిలిచి ఉన్న (త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న) గౌహతి ఎక్స్‌ప్రెస్ ఎస్-5 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడు ఉదయం 7.20 నిమిషాలకు జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రైల్వే పోలీసులు అంబులెన్స్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పేలుడు నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు.