* బెంగళూరు స్టేషన్‌లోనూ కనిపించిన
* రైలు పేలుళ్ల అనుమానితుడు
చెన్నై: బెంగళూరు-గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు పేలుళ్ల దర్యాప్తులో ముందడుగు! గురువారం పేలుళ్లు జరిగిన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో రికార్డయిన సీసీటీవీ దృశ్యాల్లో ఫ్లాట్‌ఫారమ్‌పై పరిగెడుతూ కనిపించిన అనుమానితుడు బెంగళూరు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ దృశ్యాల్లోనూ కనిపించాడు. బెంగళూరు స్టేషన్‌లో ముఖం కనిపించకుండా కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నాడని పోలీసులు శనివారం చెప్పారు. దీంతో అతనిపై అనుమానం మరింత బలపడుతోంది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. బట్టతలతో, నడివయసులో ఉన్న అతడు గురువారం చెన్నైలో గువాహటి ఎక్స్‌ప్రెస్ రైల్లో పేలుళ్లు సంభవించిన ఎస్4, ఎస్5 బోగీల పక్కనున్న ఎస్3 బోగీ నుంచి హడావుడిగా రైలు దిగి ఎగ్జిట్ మార్గం వద్దకు పరుగులు తీశాడు. అతడు ఉదయం 7.08 గంటలకు రైలు దిగగా, 7.15 ప్రాంతంలో రెండు పేలుళ్లు జరిగాయి. చెన్నై స్టేషన్‌లో ఈ అనుమానితుడి కదలికలు అసాధారణంగా ఉన్నాయని పోలీసులు శనివారమే వెల్లడించారు. చెన్నైలో రైలు దిగిన అతడు మళ్లీ అక్కడ రైలు ఎక్కలేదని స్పష్టం చేశారు. అతని వివరాల కోసం పోలీసులు అతని సహప్రయాణికులను విచారిస్తున్నారు. మరోపక్క.. బెంగళూరులో ఇద్దరు అనుమానితులను తమిళనాడు సీబీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, రైల్లోని ఎస్4, ఎస్5 బోగీల్లో టికెట్లు రిజర్వు చేసుకున్న ఇద్దరు బుకింగ్ సమయంలో గుర్తింపు కోసం ఇచ్చిన చిరునామా తదితర వివరాలు నకిలీవని తేలింది. పేలుళ్లలో వీరి ప్రమేయం ఉండే అవకాశముందని భావిస్తున్నారు.
పేలుళ్ల దర్యాప్తులో ముందడుగు!
Published Sun, May 4 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement