నిందితుల జాడేది?
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ మే 1వ తేదీన జంట పేలుళ్లతో దద్దరిల్లింది. ఆనాటి దుర్ఘటనలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్వాతి ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారానికి వంద రోజులు పూర్తిచేసుకుంది. అయితే విచారణ మాత్రం ఒక్క అడుగూ ముందుకు కదలలేదు. పోలీసులు నిందితుల నిగ్గు తేల్చలేకపోయారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశంలోని అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో తీవ్రవాదుల అలికిడి తక్కువ. అయితే ఆ రోజులు మారిపోయాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలే ఇందుకు తార్కాణం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తలపెట్టిన సభల్లో బాంబు పేలుళ్లకు ప్రయత్నాలు జరిగాయి.
బీజేపీ, హిందూ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. సుమారు పది మంది వరకు కరుడుగట్టిన ఐఎస్‌ఐ తీవ్రవాదులు అరెస్టయ్యారు. కొందరు తృటిలో తప్పించుకున్నారు. బీజేపీ, హిందూనేతలకు ఇటీవల తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచివున్నట్లు సమాచారం అందింది. అడపాదడపా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం రాష్ట్ర పోలీస్ యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తూనే ఉంది.
నిందితులేరీ?
రాష్ట్రంలో తీవ్రవాదుల ఉనికిని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో జంట పేలుళ్లు మరోసారి బహిర్గతం చేశాయి. బెంగళూరు నుంచి (వయా చెన్నై) గుహవటికి వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు మే 1వ తేదీ ఉదయం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని 9వ నంబరు ఫ్లాట్‌ఫామ్‌పై ఆగింది. రైలు ఆగిన వెంటనే రెండు భోగీల్లో పేలుళ్లు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీసీఎస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వాతి కూర్చున్న సీట్ కిందనే బాంబుపేలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే అధికారులు, జీఆర్‌పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. అప్పటికప్పుడే పోలీసు విచారణ బృందం రంగంలోకి దిగింది.
అదిగో ఆచూకీ, ఇదిగో నిందితుడు అంటూ కొద్దిరోజులు హడావుడి చేశారు. ఇది తీవ్రవాదుల పనేనని అన్నారు. అయితే ఏ తీవ్రవాద సంస్థా ఈ సంఘటనపై ప్రకటన చేయలేదు. ఇతర కేసుల్లో పట్టుబడిన నిందితులకు సెంట్రల్ పేలుళ్లతో సంబంధాలున్నట్లు ప్రచారం చేశారు. అయితే ఇవేవీ నిర్ధారించలేదు. వీలైనంత వేగంగా నిందితులను పట్టుకుని ప్రయాణికులకు ధైర్యం కల్పించాల్సిన విచారణ బృందంలో పురోగతి లేకపోయింది. పేలుళ్లు చోటుచేసుకుని వందరోజులు పూర్తవుతున్నా స్పష్టమైన ఆధారాలు, నిందితుల అరెస్ట్ లేనికారణంగా వైఫల్యాలు తేటతెల్లమయ్యాయి. ప్రయాణికుల భద్రత ఎంతమాత్రమో తెలియని పరిస్థితి.