
చెన్నై పేలుళ్లలో గుంటూరు యువతి మృతి
చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో మృతి చెందిన యువతి గుంటూరు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతురాలు గుంటూరుకు చెందిన స్వాతిగా (22) గుర్తించటం జరిగింది. కాగా చెన్నైపై ఉగ్రవాదులు పంజా విసిరారు. చెన్నై రైల్వేస్టేషన్ గురువారం ఉదయం జంట పేలుళ్లతో దద్దరిల్లింది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి.
పేలుడు ధాటికి ఎస్-4 బోగీలోని 70వ సీటులో కూర్చున్న స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటు.... ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు వణికిపోయారు. భయంతో రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీశారు. మరోవైపు బాంబు పేలుళ్ల సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించి విస్తృత తనిఖీలు చేస్తున్నారు.