gowhati express
-
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు
-
ప్లాట్ఫారం మూసివేత.. హెల్ప్‌లైన్ నంబర్ల ప్రకటన
చెన్నై రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుడు అనంతరం తొమ్మిదో నెంబరు ప్లాట్‌ఫారాన్ని మూసేశారు. బాంబు పేలుడు ఫలితంగా రెండు బోగీలతో పాటు ప్లాట్ఫారం కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ప్లాట్‌ఫారాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. రైల్లో మరిన్ని బాంబులు ఏమైనా ఉన్నాయేమోనని పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. చెన్నై వస్తున్న పలు రైళ్లను ఇతర స్టేషన్లలో ఆపేశారు. చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్లే దారులన్నీ హడావుడిగా మారిపోయాయి. మరోవైపు బెంగళూరు, చెన్నైలలో భారతీయ రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటుచేసింది. ప్రయాణికులు గానీ, వారి బంధువులు గానీ సంప్రదించేందుకు వీలుగా ఈనెంబర్లు ప్రకటించింది. పేలుడుకు కారణం ఏంటన్న విషయం ఇంతవరకు నిర్ధారణ కాలేదని తమిళనాడు డీజీపీ కె.రామానుజం తెలిపారు. బెంగళూరు వాసులు అయితే 080- 22876288, చెన్నై వాసులు అయితే 044 25357398 నెంబర్లలో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. -
చెన్నై పేలుళ్లలో గుంటూరు యువతి మృతి
చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో మృతి చెందిన యువతి గుంటూరు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతురాలు గుంటూరుకు చెందిన స్వాతిగా (22) గుర్తించటం జరిగింది. కాగా చెన్నైపై ఉగ్రవాదులు పంజా విసిరారు. చెన్నై రైల్వేస్టేషన్ గురువారం ఉదయం జంట పేలుళ్లతో దద్దరిల్లింది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి ఎస్-4 బోగీలోని 70వ సీటులో కూర్చున్న స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటు.... ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు వణికిపోయారు. భయంతో రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీశారు. మరోవైపు బాంబు పేలుళ్ల సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. -
ఎస్-4 బోగీలోని సీటు నెం.70వద్ద పేలుడు!
చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ బాంబు పేలుళ్ల ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తొమ్మిదో నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్ లోని ఎస్-4,5 బోగీల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు గుర్తించారు. ఎస్-4 బోగీలోని సీటు నెంబరు 70 వద్ద పేలుళ్లు జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. గురువారం ఉదయం 7.20 నిమిషాలకు మొదటి పేలుడు, వెంటనే రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో రెండు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇక జంట పేలుళ్లలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 15 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీ టీవీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు
చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పదిమంది గాయపడినట్లు సమాచారం. రైల్వే స్టేషన్‌లోని 9వ నెంబర్ ఫ్లాట్‌ఫామ్ పై నిలిచి ఉన్న (త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న) గౌహతి ఎక్స్‌ప్రెస్ ఎస్-5 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడు ఉదయం 7.20 నిమిషాలకు జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రైల్వే పోలీసులు అంబులెన్స్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పేలుడు నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు.