
ఉద్యోగంలో చేరిన 3 నెలలకే..
* సెలవులో వస్తూ ప్రాణాలు కోల్పోయిన స్వాతి
గుంటూరు, న్యూస్‌లైన్: గువాహటి ఎక్స్‌ప్రెస్ పేలుళ్లలో మరణించిన గుంటూరు లోని శ్రీనగర్ 7వ లైనుకు చెందిన స్వాతి మూడు నెలల కిందటే బెంగళూరులోని టీసీఎస్‌లో చేరారు. మరికొద్ది నెలల్లోనే ఈమె వివాహం కానున్నట్టు సమాచారం. గుంటూరులో ప్రాథమిక విద్య అనంతరం హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్, ఎంటెక్ చేసిన స్వాతి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
స్వాతి తల్లిదండ్రులు పరుచూరి రామకృష్ణ, పరుచూరి కామాక్షి. వీరికి ఇద్దరే సంతానం కాగా.. స్వాతి తమ్ముడు ప్రద్యుమ్న ముంబై ఐఐటీలో చదువుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఉద్యోగంలో చేరిన స్వాతి, అదే నెల చివర్లో స్వస్థలానికి వచ్చి వెళ్లింది. వేసవి కావడంతో ఏడు రోజులు సెలవు తీసుకుని గుంటూరు వచ్చేందుకు బుధవారం గువాహటి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. రాత్రి 11.30 సమయంలో ఫోన్ చేసి ఈ మేరకు సమాచారం అందించింది.
ఉదయం ఆమె రాకకోసం ఎదురుచూస్తున్న తల్లిదండులకు ఊహించని విషాదం ఎదురైంది. ఆమె మరణవార్త తెలుసుకుని చెన్నై వెళ్లిన కుటుంబసభ్యులు పోస్టుమార్టం అనంతరం స్వాతి మృతదేహాన్ని తీసుకుని తిరిగి గుంటూరుకు బయలుదేరారు. వ్యవసాయం చేసే రామకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి కాగా కొంతకాలంగా నగరంలోనే స్థిరపడ్డారు. ఆయన భార్య కామాక్షి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.