ఆర్పీఎఫ్, జీఆర్‌పీ, సివిల్ పోలీసుల సంయుక్త తనిఖీలు
కర్నూలు, న్యూస్‌లైన్: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జంట పేలుళ్ల సంఘటన నేపథ్యంలో జిల్లాలో రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై పేలుళ్ల సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే విజయవాడ రైల్వే స్టేషన్‌లో కూడా పోలీసులకు నాటు బాంబులు లభించడంతో గురువారం జిల్లాలోని కర్నూలు, నంద్యాల, డోన్ రైల్వే స్టేషన్‌లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పాటు రైల్వే పోలీసులు కూడా అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఆర్పీఎప్, జీఆర్‌పీ, సివిల్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫారం బయట, లోపల, రైల్వే స్టేషన్ చుట్టు పక్కల క్లాక్ రూమ్స్‌లో సోదాలు చేశారు.
కర్నూలులో ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌నజీముద్దీన్, జీఆర్‌పీ సీఐ వివి.నాయుడు, రెండవ పట్టణ సీఐ బాబు ప్రసాద్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులు, బ్యాగులు సోదాలు చేశారు. అలాగే గుంటూరు-కాచిగూడ, గుంతకల్లు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లలో పెట్టెల వారీగా తనిఖీలు చేపట్టారు. నంద్యాలలో ఐదు రైళ్లు, డోన్‌లో నాలుగు రైళ్లు, కర్నూలులో రెండు రైళ్లు కలిపి మొత్తం 11 రైళ్లల్లో తనిఖీలు నిర్వహించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు.
తీవ్రవాదుల పేలుళ్లపై అనుమానం వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లకు, రైల్వే పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలంటూ పోలీసు, రైల్వే అధికారులు ప్రయాణికులకు తగు సూచనలు చేశారు. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు రైల్వే స్టేషన్‌లో ఆ చివర నుంచి ఈ చివరి వరకు దాదాపు గంటపాటు పోలీస్ జాగిలంతో పాటు బాంబు స్క్వాడ్ బృందంతో సోదాలు నిర్వహించారు. ఒకేసారి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తుండటంతో ఏమి జరిగిందోనని కొంత మంది ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు.