- ట్రంప్ వర్సెస్ హారిస్ టఫ్ ఫైట్
- 2020 ఫలితాల టైంలో క్యాపిటల్ హిల్ మీద దాడి
- అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా ఘటన
- మళ్లీ ఆ పరిస్థితి రాకూడదనే భారీగా బందోబస్తు
- వాషింగ్టన్ సహా 18 స్టేట్స్‌లో నేషనల్ గార్డ్స్ మోహరింపు
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ.. మునుపెన్నడూ లేని రీతిలో హైఅలర్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. వాష్టింగన్ సహా మొత్తం 18 రాష్ట్రాలు భారీ స్థాయిలో నేషనల్ గార్డ్స్‌ను మోహరించాయి.
గత ఎన్నికల టైంలో ఫలితాల తర్వాత క్యాపిటల్ భవనం వద్ద జరిగిన దాడి ఘటన అమెరికా చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ట్రంప్ అనుకూల వర్గమే ఈ దాడికి పాల్పడిందనే అభియోగాలు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో అంతర్యుద్ధం తలెత్తిందా? అనే స్థాయిలో చర్చ జరిగింది అంతటా.
ఈ నేపథ్యంలో ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతుండడం, ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణామాల నడుమ మరోసారి ఆ తరహా ఘటనలు జరగకుండా భద్రతా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.
బుల్లెట్‌ప్రూఫ్ గ్లాసులు, గ్రిల్‌తో కూడిన భారీ గేట్లు, ఆయుధాలతో ప్రత్యేక దళాలు(స్వాట్), భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్, ఎన్నికల సిబ్బంది చేతికి అందుబాటులో పానిక్ బటన్స్(ఎమర్జెన్సీ).. సుమారు లక్ష పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్న దృశ్యాలివి. ఏఐ టెక్నాలజీ సాయంతో నిఘాను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
పోలింగ్ ముగిసే సమయం నుంచే ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో.. ఆ భద్రతను మరింత పటిష్ట పరిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. వీటికి తోడు కౌంటింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు అంచనాల నడుమ.. నేషనల్ గార్డ్స్‌లోని సివిల్ సర్వీస్ ట్రూప్స్‌తోపాటు సైబర్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment