న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరుపార్టీల అధ్యక్ష అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థల ప్రచారంపై చైనా హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారానికి అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఉపయోగించే ఫోన్లను చైనా హ్యాకర్లు.. హ్యాక్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ , ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ట్రంప్, వాన్స్ ప్రచారాన్ని చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రంప్ బృందం ధృవీకరించకపోవటం గమనార్హం. అయితే హ్యాక్ విషయంలో ట్రంప్ బృందం దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలవకుండా అడ్డుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ చైనా, ఇరాన్‌లను ప్రోత్సహించారని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. ‘హ్యాకింగ్‌కు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం మాకు తెలియదు. చైనా అన్ని రకాలుగా సైబర్ దాడులు, సైబర్ దొంగతనాలను వ్యతిరేకిస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది’ అని పేర్కొంది. ‘‘అధ్యక్ష ఎన్నికలు అమెరికా దేశీయ వ్యవహారాలు. వాటిపై చైనాకు ఎటువంటి ఉద్దేశ్యం లేదు. అమెరికా ఎన్నికలలో చైనా జోక్యం చేసుకోదు’’ అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఇక.. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ ప్రచారంపై హ్యాక్ జరిగింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌లోని ముగ్గురు సభ్యులపై ఆమెరికా ఆరోపణలు చేసింది. వారు నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని పేర్కొంది.
చదవండి: అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment