విజయవాడ : త్వరలో జరుగనున్న అస్సాం ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ శుక్రవారం గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలను నయవంచనకు గురి చేసిన నరేంద్రమోదీ బూటకపు మాటలను నమ్మి మోసపోవద్దని, బీజేపీని, దాని మిత్రపక్షాలను అస్సాం ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు. సుస్థిర ప్రభుత్వం అందించగల కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఓట్లు దండుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు తూచ్ అంటూ దాటవేస్తున్నాయని విమర్శించారు.
ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ మాయమాటలు తెలుగువారిని నయవంచనకు గురిచేశాయన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ మట్టి, నీటిముంతలు తీసుకువచ్చి చేతులు దులుపుకొన్నారన్నారు. మాజీ మంత్రి తులసిరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల ఆశలను కేంద్రం వమ్ము చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
అస్సాం ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి: రఘువీరా
Published Fri, Mar 25 2016 7:14 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM
Advertisement
Advertisement