గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి
సాక్షి, విజయవాడ : బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఢిల్లీ శివారు ప్రాంతంలో రైతులపై పోలీసులు చేసిన దౌర్జన్యానికి నిరసనగా కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నరఘువీరా మాట్లాడుతూ.. రైతులు తమ గోడు చెప్పుకోవటానికి ఢిల్లీ వస్తే పోలీసులు లాఠీ జలిపించారని అన్నారు. రైతుల కోసం ఎన్నికల్లో మీరిచ్చిన హామీలేంటి.. చేసిందేంటని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు అప్పులు మాఫీ చేయరు కానీ అంబానీలకు దోచిపెడతారని మండిపడ్డారు.
స్వామినాథన్ రిపోర్టు ప్రకారం రైతు కష్టపడిన దానికి యాభై శాతం ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారని ఆరోపించారు. అహింసావాది అయిన గాంధీ జయంతి రోజునే రైతులను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే 2లక్షల రైతు రుణమాఫీ ఉంటుందని అన్నారు. పంట భీమా కూడా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీని గద్దెదించే వరకు రైతులు నిద్రపోవద్దని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment