Assam elections
-
కొనసాగుతున్న ఉత్కంఠ: హస్తినకు అసోం రాజకీయం
సాక్షి,ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీని నిలబెట్టుకున్నప్పటికీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా ప్రతిష్టంభన కొసాగుతోంది. ఫలితాలొచ్చి అయిదు రోజులైనా సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడలేదు. దీంతో అసోం రాజకీయం హస్తినకు చేరింది. తదుపరి ముఖ్యమంత్రిపై అనిశ్చితి మధ్య నాయకత్వ సమస్యలపై చర్చించడానికి అసోం సిట్టింగ్ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, హిమాంత్ బిశ్వలను బీజేపీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది. కొత్త సీఎం ఎవరనేది శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరువురు నేతలూ ఢిల్లీకి చేరుకుని, బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారు. నడ్డా నివాసంలో హోంమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్ సమాశానికి తొలుత హిమంత బిశ్వ శర్మను పిలిపించిన అధిష్టానం శర్వానంద్ సోనో వాల్ని కూడా పిలిపించడం విశేషం. ఈ సమాశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. హిమంత బిశ్వ శర్మ తనకు 40 మంది ఎమ్మెల్యేలతోపాటు మిత్ర పక్షాల మద్దతు ఉందని అంటుండగా, సీఎం తన పరిపాలనకే ప్రజలు ఓటు వేశారని శర్వానంద్ వాదిస్తున్నారు. అటు 50 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే, హిమాంత బిశ్వ శర్మకు మద్దతుగా నిలుస్తోంది. తమ పార్టీకి చెందిన 29 ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో అనిశ్చిత రాజకీయం వాతావరణం మరింత వేడెకింది. ఈ నేపథ్యంలో నాయకత్వ సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా అధిష్టానం పావులు కదుపుతోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా అసోంలోని మొత్తం 126 స్థానాలకుగానూ 75 సీట్లలో బీజేపీ నాయకత్వంలోని ఎన్ఏడీ కూటమి విజయం సాధించగా, బీజేపీ 60 సీట్లలో గెలిచింది. ఎన్నికల జరిగిన మిగతా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా అసోంలో మాత్రం సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించని సంగతి తెలిసిందే. -
తనయుడిని గెలిపించిన తల్లి.. జైలు నుంచే జయభేరి
డిస్పూర్: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన... ప్రచారంలో పాల్గొనకుండానే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందారు. గొగోయ్‌కు మొత్తం 57,219 ఓట్లు రాగా.. మొత్తం 46.06 శాతం ఓటర్ల మద్దతు ఆయనకు లభించింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం అభియోగాల కింద 2019లో గొగోయ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గొగోయ్ గువహటి మెడికల్ కాలేజీ అండ్ హాస్సిటల్లో చికిత్స పొందుతున్నారు. అఖిల్ గొగోయ్ గత ఏడాది అక్టోబర్‌లో రైతు సంస్థ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్), కొన్ని యాంటీ సీఏఏ సంస్థల మద్దతుతో రైజోర్ దళ్‌ను స్థాపించారు. అస్సాంలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు రైజోర్ దళ్ కొత్తగా ఏర్పడిన మరో పార్టీ అస్సాం జాతియా పరిషత్ (ఏజేపీ) తో కలిసి 18 స్థానాలకు పోటీ చేసింది. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచినప్పటికీ... ఎన్నికల్లో మాత్రం సుభ్రామిత్ర గొగోయ్‌కు టిక్కెట్ ఇచ్చింది. దాంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. కుమారుడి తరఫున రంగంలోకి దిగిన తల్లి... ఇక ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోవడంతో.. గొగోయ్ జైలు నుంచే ప్రజా సమస్యలపై అనేక బహిరంగ లేఖలు రాశారు. దీనికితోడు జైల్లో ఉన్న తన కుమారుడి కోసం 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియదా గొగోయ్.. శిబ్‌సాగర్‌లోని గల్లీల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. కుమారుడి కోసం ఆమె చేస్తున్న పోరాటానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేథా పాట్కర్, సందీప్ పాండే మద్దతు తెలిపారు. శిబ్‌సాగర్‌కు తరలివచ్చి ప్రియదా గొగోయ్‌తో కలిసి ప్రచారం చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కొన్వర్ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంటి అగ్రనేతలను సైతం రంగంలోకి దించినా.. గొగోయ్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఈ సందర్భంగా అఖిల్ గొగోయ్ భార్య మాట్లాడుతూ.. ‘‘అసోం శిబ్‌సాగర్ జనాలు అఖిల్ మీద పెంచుకున్న ప్రేమ, ఆప్యాయతలే తనని గెలిపించాయి. ఈ విజయం మా అందరి బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా శిబ్‌సాగర్ జనాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ, ఆప్యాయత వల్లనే అఖిల్ గొగోయ్ విజయం సాధించారు. అసోం చరిత్రలో ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే ఇంతవరకు జైలుకెళ్లిన వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించిన ఘటనలు ఎక్కడా లేవు’’ అన్నారు. ఏవరీ అఖిల్ గొగోయ్... గువాహటిలోని కాటన్ కాలేజి నుంచి పట్టభద్రుడైన 46 ఏళ్ల గొగోయ్.. రాజకీయాలకు కొత్తేం కాదు. 1995-96 మధ్య ఆయన కాటన్ కాలేజి స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనేక ఏళ్లుగా అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్) వేదికగా అనేక పోరాటాలకు నేతృత్వం వహించారు. 2019 డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం హింసకు దారితీయడంతో.. దీని వెనుక గొగోయ్ హస్తం ఉందంటూ ఎన్ఐఏ అధికారులు తనను అరెస్ట్ చేశారు. చదవండి: అస్సాంలో కమలదళానికి కఠిన పరీక్ష -
ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఎన్నికల ఫలితాలు
-
తొలి దశకు సర్వం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్‌తో పాటు అస్సాం అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30, అస్సాంలో 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి. బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంలో తృణమూల్ కాంగ్రెస్, తూర్పున పాగా వెయ్యాలన్న వ్యూహంలో బీజేపీ నిలవడంతో హోరాహోరీ పోరు నెలకొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ ఈ 30 స్థానాలకు గాను 26 సీట్లలో గెలుపొందింది. అయితే గత అయిదేళ్లలో ఈ ప్రాంతంలో బీజేపీ పట్టు బిగించి అధికారపక్షానికి సవాల్ విసురుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి సొంత జిల్లా మేదినిపూర్ జిల్లాలో పోలింగ్ జరుగుతూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఎంసీ, బీజేపీలు 29 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో నిలిపితే, లెఫ్ట్–కాంగ్రెస్–ఐఎస్ఎఫ్ కూటమి మొత్తం 30 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో అస్సాం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. అధికారాన్ని కాపాడుకోవడానికి పకడ్బందీ వ్యూహాలను రచించిన బీజేపీ–ఏజీపీ కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, లోకల్ కార్డుతో కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్‌ల నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. గత ఎన్నికల్లో బీజేపీ–ఏజీపీలు 47 స్థానాలకు గాను 35 సీట్లలో గెలుపొందాయి. భద్రతా బలగాల నీడలో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన జంగల్మహల్లో 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతూ ఉండడంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతమై జర్గ్రామ్ జిల్లాలో ప్రతీ పోలింగ్ బూత్ దగ్గర 11 మంది పారామిలటరీ సిబ్బంది మోహరించినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. 1307 పోలింగ్ బృందాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించి 127 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పురూలియాలో 185 కంపెనీలు, పూర్వ మేదినీపూర్‌లో 148 కంపెనీలు, బంకూరాలో 83 కంపెనీల బలగాలు మోహరించాయి. ఒక్కో కంపెనీలో వంద మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రానికి చెందిన 22 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో ఉన్నారు. బరిలో ఉన్న ప్రముఖులు పశ్చిమబెంగాల్లోని 30 స్థానాల్లో కొందరి అభ్యర్థిత్వం ఆసక్తి రేపుతోంది. పురూలియా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ ఇటీవల బీజేపీ గూటికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీ మంత్రి శాంతి రామ్ మెహతా పోటీ పడుతున్నారు. ఖరగ్‌పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. దినేన్ రాయ్ (టీఎంసీ), తపన్ భూహియా (బీజేపీ), ఎస్.కె.సద్దామ్ అలీ (సీపీఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది. అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు. -
రెండున్నరేళ్లలో బోడో ఒప్పందం అమలు
ఉడల్గురి: తాము అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో బోడో ఒప్పందంలోని అన్ని క్లాజులను సంపూర్ణంగా అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అసోం ప్రజలకు హామీ ఇచ్చారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్(బీటీఆర్)లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గతేడాది ప్రధాని బోడో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కాల్పుల విరమణ, ఈప్రాంత సర్వతోముఖాభివృద్ధి ఆరంభమయ్యాయన్నారు. బోడో ప్రాంతాల్లో శాంతి తమ ఉద్దేశమని, తిరిగి అధికారంలోకి వస్తే ఒప్పందం సంపూర్ణంగా అమలు చేస్తామని చెప్పారు. బోడో యువత తుపాకుల బదులు కంప్యూటర్ను ఎంచుకోవచ్చని, దేశాభివృద్ధికి దోహదపడవచ్చని చెప్పారు. ప్రధాని చొరవతోనే ఈ ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయంలో బోడో ఘర్షణల్లో దాదాపు 5వేల మంది మరణించారని, కానీ కాంగ్రెస్ నేతలు స్వీయప్రయోజనాలు చూసుకుంటూ పబ్బం గడిపారని విమర్శించారు. కాంగ్రెస్ తాజాగా ఏర్పరిచిన మహాకూటమి ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురాలేదన్నారు. ఇప్పటికే బోడోల కోసం 65 పథకాలను ప్రకటించామన్నారు. రాహుల్ పిక్నిక్కు వచ్చారు ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ జరిపిన అసోం పర్యటనపై అమిత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన రాష్ట్రానికి పిక్నిక్కు వచ్చినట్లు వచ్చిపోయారన్నారు. నాలుగు తరాలుగా కాంగ్రెస్ టీ వర్కర్లకు చేసిందేమీలేదని, రాహుల్ మాత్రం ఫొటోలుదిగిపోయారని ఎద్దేవా చేశారు. టీ వర్కర్లకు బీజేపీ చేసిన మేలును ఆయన వివరించారు. బీజేపీ మాత్రమే అసోంను కాపాడగలదని చెప్పారు. ఏఐయూడీఎఫ్‌ను చెంత చేర్చుకొని అసోంలో కాంగ్రెస్ ఎలా శాంతిని తెస్తుందని ప్రశ్నించారు. బద్రుద్దీన్ పార్టీ అధికారంలోకి వస్తే అసోంలోకి మరింత మంది వలసదారులు వస్తారన్నారు. తమ ప్రభుత్వం అసోంలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించిందన్నారు. -
ఆఫీసర్స్ అందరూ మహిళలే
మహిళల్లో ఓటు వేయాలన్న ఉత్సాహం కలిగించడం కోసం అస్సాంలోని నల్బరి జిల్లా యంత్రాంగం కొత్తగా ఆలోచిస్తోంది. నల్బరినే ఎందుకు అంటే.. ఆ జిల్లాలోని అత్యున్నతస్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావడం! డిప్యూటీ కమిషనర్ మహిళ. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహిళ. ముగ్గురు అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు మహిళలు. వీళ్లంతా కలిసి నల్బరిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు నడిపించేందుకు రకరకాల ప్రణాళికలు, పథకాలు రచిస్తున్నారు! 126 స్థానాలు గల అస్సాం అసెంబ్లీకి మూడు విడతలుగా.. మార్చి 27, ఏప్రిల్ 1, 6 తేదీలలో.. పోలింగ్ జరుగుతోంది. అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓటర్లే ప్రభావం చూపబోతున్నారని సర్వేల అంచనా. బ్రహ్మపుత్ర నది ఉత్తరపు ఒడ్డున అస్సాం నగరం గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంది నల్బరి జిల్లా. ఆ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలేనన్నది మరీ కొత్త సంగతైతే కాదు. అయితే వీళ్లంతా కలిసి మహిళా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. వీళ్లకేం పని? వీళ్లకే పని! డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు.. వీళ్లే కదా జిల్లా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయవలసింది, బాధ్యత గల పౌరులుగా మెలిగేలా నడిపించవలసింది! అస్సాంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడం పౌరధర్మం అయితే, ఓటు వేయించడం అధికారం ధర్మం. ఆ ధర్మాన్నే ఈ మహిళా అధికారులంతా బాధ్యతగా, వినూత్నంగా చేపడుతున్నారు. అభ్యర్థులు మహిళల ఓట్ల కోసం పాట్లు పడుతుంటే, అధికారులు మహిళల చేత ఓటు వేయించడం కోసం ‘ప్లాట్’లు ఆలోచిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. లోపల బూత్ సిబ్బంది, బయట భద్రతా సిబ్బంది అంతా మహిళల్నే నియమిస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. మహిళల్ని ఆ పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన నల్బరీ, బర్క్షెత్రి, ధర్మాపూర్లను ప్రత్యేక జోన్లుగా, సెక్టార్లుగా, చౌక్‌లుగా విభజించి అక్కడ మహిళా చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాలలో ఉండేది మళ్లీ మహిళలే. వారు తమ పరిధిలోని మహిళలకు ఓటు ఎందుకు వేయాలో చెబుతారు. ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో వివరిస్తారు. ‘ఈసారి మన మహిళల ఓటు మీద అస్సాం భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని సర్వేలను ఉదహరిస్తూ కొన్ని ప్రధానమైన అభివృద్ధి అంశాలను అర్థమయ్యేలా చేస్తారు. ఓటు ఎవరికి వేసినా గానీ, మొత్తానికైతే ఓటు వేయడం మానకూడదన్న స్పృహ కలిగిస్తారు. ఇందుకోసం ఆ కేంద్రాల్లోని మహిళా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. ఇక పోలింగ్ డ్యూటీలో ఉన్న మహిళలకైతే వాళ్లెంత చిన్న బాధ్యతల్లో ఉన్నా ప్రత్యేక వసతుల్ని కల్పిస్తున్నారు. ‘‘మహిళలు సౌకర్యంగా ఉంటే, సమాజం సవ్యంగా సాగుతుంది’’ అంటారు డిప్యూటీ కమిషనర్ పురబి కన్వార్. అందుకే ఆమె ఓటు వేసే మహిళలకే కాకుండా, ఓటు వేయమని చెప్పే, బూత్ లోపల ఓటు వేసేందుకు దారి చూపే మహిళా సిబ్బంది అందరికీ కూడా సౌకర్యంగా ఉండేట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. పురబి కన్వార్ జిల్లా ఎన్నికల అధికారి కూడా. మరోవైపు.. ఇళ్లకు డెలివరీ అయ్యే గ్యాస్ సిలిండర్లపై ‘ఓటు వెయ్యడం మీ కర్తవ్యం’ అని తెలియజెప్పే స్టిక్కర్లను అతికించమని చెబుతున్నారు. ఇప్పటి వరకు అలా స్టిక్కర్లు అంటించిన సిలిండర్లు ఐదు వేల వరకు డెలివరీ అయ్యాయి. అలాగే వీధి నాటకాలు వేయిస్తున్నారు. మహిళా కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ‘మహిళా అధికారుల జిల్లా’గా నల్బరి స్టోరీ అప్పుడే అయిపోలేదు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్.. అందరూ మహిళలే! జిల్లా ఎస్పీ మహిళ (అమన్‌జీత్ కౌర్). జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్ ఆఫీసర్లు, సబ్–రిజిస్ట్రార్ (రెవిన్యూ), ఇంకా.. డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, సబ్–డివిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అంతా మహిళలే. ఇంత మంది మహిళా అధికారులు ఉన్నప్పుడు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం లేకుండా ఉంటుందా? మహిళల్లో చైతన్యం వెల్లివిరవకుండా ఉంటుందా? -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏ నిలిపేస్తాం
డిస్పూర్: అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను నిలిపివేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ఆమె మంగళవారం అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు తేజ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట ప్రజలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. గత ఐదేళ్లుగా తేయాకు మహిళా కార్మికుల దినసరి వేతనం పెరగటం లేదని మండిపడ్దారు. అయితే తాము అధికారంలోకి వస్తే తేయాకు మహిళా కార్మికులకు దినసరి వేతనం రూ.365 చేస్తామని ప్రియాంక తెలిపారు. అసోంలో 5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అసోం మహిళల భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకమని తెలిపారు. మహిళలపై అసోంలో చాలా దాడులు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మహిళల రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. 126 నియోజవర్గాలు ఉన్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికల జరగనున్నాయి. చదవండి: దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్ -
సీఎం అభ్యర్థులు ఎంజాయ్ చేస్తున్నారు!
ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో కానీ, అసోంలో మాత్రం రాజకీయ ప్రత్యర్థుల గుండె మీద చెయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు. సాధారణంగా ఎన్నికలు అనగానే.. ఓటర్లను ఎలా ఆకర్షించాలి, ఏ పథకాలు, ఫండ్స్ అంటూ వాగ్దానాలు చేయాలి అని రాజకీయ నేతలు తలలు పట్టుకు కుర్చుంటారు. పోనీ ఎన్నికలు అయిపోయాక కుదురుగా కూర్చుంటారా అది లేదు. తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని ఆందోళన చెందుతుంటారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినా అందులో విజయం తమదేనని తెలిస్తే సరిగ్గానే సర్వే జరిగిందని, లేనిపక్షంలో అవన్నీ బోగస్ సర్వేలంటూ డంభికాలు పోవడం మనకు తెలిసిన విషయమే. బీజేపీ నుంచి సీఎం రేసులో ఉన్న కేంద్ర క్రీడాశాఖ మత్రి సర్భానంద సోనోవాల్ హాయిగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రియో ఒలింపిక్స్ నేపథ్యంలో పాటియాలా లోని నేషనల్ స్పోర్ట్ అకాడమిని ఆకస్మికంగా సందర్శించారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ఆయనను ప్రశ్నించగా... తాను సంజయ్ లీలా భన్సాలీ తీసిన బాజీరావ్ మస్తానీ మూవీ చూసి ఎంజాయ్ చేశానని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. టెన్షన్ పైకి కనపడకుండా ఉండటమే బీజేపీ వ్యూహమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మూడుసార్లు కాంగ్రెస్ కు అధికారపీఠం సాధించిన తరుణ్ గొగోయ్ కూడా ఎన్నికల ఫలితాలపై ఉండే ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. కుటుంబంతో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లి సరదాగా గడుపుతూ, గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారట. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేశారు. సీఎంగా వరుసగా నాలుగోసారి సీఎం కుర్చిలో కూర్చునేది తానేని గగోయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికలలో ఓడినా.. ప్రధాని మోదీ చెప్పినట్లుగా రాజకీయ సన్యాసం చేయాల్సిన గత్యంతరం తనకు లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా రాజకీయంగా తాను చాలా యాక్టివ్ గా ఉన్నానని చెప్పారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతుందన్న విషయం విదితమే. -
అస్సాం ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి: రఘువీరా
విజయవాడ : త్వరలో జరుగనున్న అస్సాం ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ శుక్రవారం గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలను నయవంచనకు గురి చేసిన నరేంద్రమోదీ బూటకపు మాటలను నమ్మి మోసపోవద్దని, బీజేపీని, దాని మిత్రపక్షాలను అస్సాం ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు. సుస్థిర ప్రభుత్వం అందించగల కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఓట్లు దండుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు తూచ్ అంటూ దాటవేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ మాయమాటలు తెలుగువారిని నయవంచనకు గురిచేశాయన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ మట్టి, నీటిముంతలు తీసుకువచ్చి చేతులు దులుపుకొన్నారన్నారు. మాజీ మంత్రి తులసిరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల ఆశలను కేంద్రం వమ్ము చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
'జోరుమీద రాహుల్.. మీడియాతో బ్రేక్‌ఫాస్ట్'
గువాహటి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మునుపెన్నడూ లేనంత ఉత్సాహంగా కనిపించారు. ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. శనివారం అసోం పర్యటనకు వెళ్లిన రాహుల్.. ఉదయం మీడియా ప్రతినిధులతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం వారితో గంట సమయం పలు అంశాలపై చర్చించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ వివిధ స్థానిక మీడియా ప్రతినిధులు ఎడిటర్స్ ఇతర కార్యనిర్వాహకులతో అల్పహార విందు చేశారు. అనంతరం అసోం ఎన్నికలు, జాతీయ వ్యవహారాలు, అంతర్జాతీయ అంశాలను స్పృషిస్తూ తన అభిప్రాయాలను మీడియాకు తెలిపారు. చాలా ప్రశ్నలు మీడియా రాహుల్ కు సందించగా వాటిలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రాహుల్ గాంధీ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు మాత్రం పొడిపొడి సమాధానాలు చెప్పి.. అడిగిన వారికి అనుమానాలు మిగిల్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఆరోపణలు చేసుకుంటూ జీఎస్టీ బిల్లు విషయంలో ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారా అని అడిగినప్పుడు సమాధానం కొద్దికొద్దిగా చెప్పారు. జీఎస్టీ బిల్లుకు ఆ కేసుకు ఎలాంటి సమాధానం లేదని అన్నారు. మాకు ప్రధానంగా మూడు ఆందోళనలు ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుంటే తాము బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు.