'జోరుమీద రాహుల్.. మీడియాతో బ్రేక్ఫాస్ట్'
గువాహటి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మునుపెన్నడూ లేనంత ఉత్సాహంగా కనిపించారు. ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. శనివారం అసోం పర్యటనకు వెళ్లిన రాహుల్.. ఉదయం మీడియా ప్రతినిధులతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం వారితో గంట సమయం పలు అంశాలపై చర్చించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ వివిధ స్థానిక మీడియా ప్రతినిధులు ఎడిటర్స్ ఇతర కార్యనిర్వాహకులతో అల్పహార విందు చేశారు. అనంతరం అసోం ఎన్నికలు, జాతీయ వ్యవహారాలు, అంతర్జాతీయ అంశాలను స్పృషిస్తూ తన అభిప్రాయాలను మీడియాకు తెలిపారు.
చాలా ప్రశ్నలు మీడియా రాహుల్ కు సందించగా వాటిలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రాహుల్ గాంధీ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు మాత్రం పొడిపొడి సమాధానాలు చెప్పి.. అడిగిన వారికి అనుమానాలు మిగిల్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఆరోపణలు చేసుకుంటూ జీఎస్టీ బిల్లు విషయంలో ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారా అని అడిగినప్పుడు సమాధానం కొద్దికొద్దిగా చెప్పారు. జీఎస్టీ బిల్లుకు ఆ కేసుకు ఎలాంటి సమాధానం లేదని అన్నారు. మాకు ప్రధానంగా మూడు ఆందోళనలు ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుంటే తాము బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు.