సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్‌తో పాటు అస్సాం అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్‌లో 30, అస్సాంలో 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు.
పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి. బెంగాల్‌లో హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంలో తృణమూల్ కాంగ్రెస్, తూర్పున పాగా వెయ్యాలన్న వ్యూహంలో బీజేపీ నిలవడంతో హోరాహోరీ పోరు నెలకొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ ఈ 30 స్థానాలకు గాను 26 సీట్లలో గెలుపొందింది. అయితే గత అయిదేళ్లలో ఈ ప్రాంతంలో బీజేపీ పట్టు బిగించి అధికారపక్షానికి సవాల్ విసురుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి సొంత జిల్లా మేదినిపూర్ జిల్లాలో పోలింగ్ జరుగుతూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టీఎంసీ, బీజేపీలు 29 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో నిలిపితే, లెఫ్ట్–కాంగ్రెస్–ఐఎస్‌ఎఫ్ కూటమి మొత్తం 30 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని, జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో అస్సాం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. అధికారాన్ని కాపాడుకోవడానికి పకడ్బందీ వ్యూహాలను రచించిన బీజేపీ–ఏజీపీ కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, లోకల్ కార్డుతో కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్‌ల నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. గత ఎన్నికల్లో బీజేపీ–ఏజీపీలు 47 స్థానాలకు గాను 35 సీట్లలో గెలుపొందాయి.
భద్రతా బలగాల నీడలో
పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన జంగల్‌మహల్‌లో 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతూ ఉండడంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతమై జర్‌గ్రామ్ జిల్లాలో ప్రతీ పోలింగ్ బూత్ దగ్గర 11 మంది పారామిలటరీ సిబ్బంది మోహరించినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. 1307 పోలింగ్ బృందాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించి 127 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పురూలియాలో 185 కంపెనీలు, పూర్వ మేదినీపూర్‌లో 148 కంపెనీలు, బంకూరాలో 83 కంపెనీల బలగాలు మోహరించాయి. ఒక్కో కంపెనీలో వంద మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రానికి చెందిన 22 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో ఉన్నారు.
బరిలో ఉన్న ప్రముఖులు
పశ్చిమబెంగాల్‌లోని 30 స్థానాల్లో కొందరి అభ్యర్థిత్వం ఆసక్తి రేపుతోంది. పురూలియా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ ఇటీవల బీజేపీ గూటికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీ మంత్రి శాంతి రామ్ మెహతా పోటీ పడుతున్నారు. ఖరగ్‌పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. దినేన్ రాయ్ (టీఎంసీ), తపన్ భూహియా (బీజేపీ), ఎస్.కె.సద్దామ్ అలీ (సీపీఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది. అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు.
తొలి దశకు సర్వం సిద్ధం
Published Sat, Mar 27 2021 4:56 AM | Last Updated on Sat, Mar 27 2021 5:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment