సీఎం అభ్యర్థులు ఎంజాయ్ చేస్తున్నారు!
ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో కానీ, అసోంలో మాత్రం రాజకీయ ప్రత్యర్థుల గుండె మీద చెయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు. సాధారణంగా ఎన్నికలు అనగానే.. ఓటర్లను ఎలా ఆకర్షించాలి, ఏ పథకాలు, ఫండ్స్ అంటూ వాగ్దానాలు చేయాలి అని రాజకీయ నేతలు తలలు పట్టుకు కుర్చుంటారు. పోనీ ఎన్నికలు అయిపోయాక కుదురుగా కూర్చుంటారా అది లేదు. తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని ఆందోళన చెందుతుంటారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినా అందులో విజయం తమదేనని తెలిస్తే సరిగ్గానే సర్వే జరిగిందని, లేనిపక్షంలో అవన్నీ బోగస్ సర్వేలంటూ డంభికాలు పోవడం మనకు తెలిసిన విషయమే.
బీజేపీ నుంచి సీఎం రేసులో ఉన్న కేంద్ర క్రీడాశాఖ మత్రి సర్భానంద సోనోవాల్ హాయిగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రియో ఒలింపిక్స్ నేపథ్యంలో పాటియాలా లోని నేషనల్ స్పోర్ట్ అకాడమిని ఆకస్మికంగా సందర్శించారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ఆయనను ప్రశ్నించగా... తాను సంజయ్ లీలా భన్సాలీ తీసిన బాజీరావ్ మస్తానీ మూవీ చూసి ఎంజాయ్ చేశానని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. టెన్షన్ పైకి కనపడకుండా ఉండటమే బీజేపీ వ్యూహమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మూడుసార్లు కాంగ్రెస్ కు అధికారపీఠం సాధించిన తరుణ్ గొగోయ్ కూడా ఎన్నికల ఫలితాలపై ఉండే ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. కుటుంబంతో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లి సరదాగా గడుపుతూ, గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారట. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేశారు. సీఎంగా వరుసగా నాలుగోసారి సీఎం కుర్చిలో కూర్చునేది తానేని గగోయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికలలో ఓడినా.. ప్రధాని మోదీ చెప్పినట్లుగా రాజకీయ సన్యాసం చేయాల్సిన గత్యంతరం తనకు లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా రాజకీయంగా తాను చాలా యాక్టివ్ గా ఉన్నానని చెప్పారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతుందన్న విషయం విదితమే.