Tarun Gogoi
-
తరుణ్ గొగోయ్ పరిస్థితి విషమం
గువాహటి : అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ ఆరోగ్యం విషమించింది. కరోనా అనంతర సమస్యలతో ఆయన గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈనెల 2 నుంచి చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై గొగోయ్‌కి చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిస్వ శర్మ శనివారం వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, కీలక అవయవ వ్యవస్థలు వైఫల్యం చెందాయని తెలిపారు. ఆగస్ట్ 25న∙గొగోయ్‌కి కోవిడ్‌గా నిర్ధారణ అయింది. -
ఇది మోదీ చేసిన మూడో తప్పు : గగోయ్
గువాహటి : ప్రధాని నరేంద్ర మోదీ అవలంభిస్తున్న విధానాలపై అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గగోయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాలను, నిపుణులను సంప్రదించడకుండా కరోనా లాక్‌డౌన్‌ను ప్రకటించడం మోదీ చేసిన మూడో అతిపెద్ద తప్పిదమని వ్యాఖ్యానించారు. మోదీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన గగోయ్ ఈ విధంగా స్పందించారు. నోట్ల రద్దు మోదీ చేసిన మొదటి తప్పని, ఎటువంటి ప్రణాళిక లేకుండా జీఎస్టీ తీసుకురావడం రెండో తప్పని, ఇప్పుడు ఎటువంటి కార్యాచరణ లేకుండా లాక్డౌన్ విధించడం మూడో తప్పని విమర్శించారు. మోదీ నిర్ణయం ఒక ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపదని.. ఇది చాలా మంది పేదలను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా వలస కార్మికులు పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో లాక్డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన వలస కార్మికుల ప్రస్తావనే లేదని ఆరోపించారు. (చదవండి : ఉపాధికి మరో 40 వేల కోట్లు) ‘ఎటువంటి ప్రణాళిక లేకుండా లాక్డౌన్ ప్రకటించిన మోదీ.. ఆయన దూరదృష్టి గల నాయకుడు కాదని నిరూపించుకున్నాడు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీలో కేవలం రుణాలు మాత్రమే ఇవ్వనున్నారు. కరోనా వల్ల నష్టపోయిన వారికి కొద్దిమేర సబ్సిడీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ నాకు ఇందులో అది కనిపించలేదు. మోదీ ఆయనను ఒక నిపుణుడు అని అనుకుంటారు. ప్రతిది ఆయనకే తెలుసని భావిస్తారు.. అందుకే ఎవరినీ సంప్రదించడానికి ఇష్టపడరు.. ఇదంతా ఒక నియంత ధోరణి. కరోనా వైరస్ భారత్‌లోని ప్రవేశించకముందే భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కేంద్రం ఆర్థిక ప్యాకేజీని చాలా రోజుల క్రితమే ప్రకటించి ఉంటే బాగుండేంది’ అని గగోయ్ అన్నారు. -
పోలీస్ స్టేషన్లోనే మహిళపై అత్యాచారం
గౌహతి : అసోంలోని ఓ పోలీసు స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. రక్షించాల్సిన రక్షక భటుడే ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రామ్డియా పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న బినోద్ కుమార్ దాస్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. దీనిపై లోతైన విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనను అస్సాం మాజీ సీఎం తరుణ్ గగోయ్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిగా ఉన్న పోలీసును కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసు నియామాకాలు జరిగేటప్పుడు అభ్యర్థులకు మానసిక పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరానిదని ఆయన వ్యాఖ్యానించారు. -
భారత్ నీటిపై చైనా పెత్తనం
అస్సోం : భారత్‌కు రావల్సిన బ్రహ్మాపుత్ర నది నీటిని చైనా అక్రమంగా దారి మళ్లిస్తోందని అస్సాం మాజీ సీఎం తరుణ్ గగోయ్ ట్వీటర్లో ఆందోళన వ్యక్తం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ ఎగువన బ్రహ్మాపుత్ర నదిపై చైనా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందని, మనకు రావాల్సిన నీటి వాటాను కూడా చైనా అక్రమంగా తరలిస్తోందని వెల్లడించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని ఆయన ట్వీటర్ వేదికగా కోరారు. భారత ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తరుణ్ గగోయ్ కోరారు. భవిషత్తులో నీటి కోసం చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బ్రహ్మాపుత్ర నదిపై చైనా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మింస్తుందని భారత్ పలు సంధర్భాల్లో అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. కాగా చైనా అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు, డోక్లాం విషయంలో భారత అభ్యంతరాలను ఖాతరు చేస్తూ సరిహద్దులో తన బలగాలను మోహరించడంతో యుద్ద వాతావరణం నెలకొన్న విషయం విదితమే. #China has already been diverting #Brahmaputra water with a dam which will create water shortage for us. The artificial rainwater harvesting plan of them will create even more danger. PM @narendramodi should take it seriously or our future will be in dark. — Tarun Gogoi (@tarun_gogoi) March 28, 2018 -
బాధితురాలిపై మంత్రి కామెంట్.. తీవ్ర విమర్శలు!
గువాహటి: 'చీకటి పడుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నా వద్దకు వచ్చారు. బైకుపై వచ్చిన వాళ్లు హెల్మెట్ ధరించి ఉన్నారు. నేను అక్కడినుంచి వెళ్లిపోతున్నాను. ఇంతలో ఒకడు నన్ను అడ్డగించగా.. రెండో వ్యక్తి చెప్పరాని విధంగా నన్ను తాకాడు. దీంతో నిస్సహాయంగా ఉండిపోయాను'.. ఇది అస్సాం రాజధాని గువాహటికి 330 కి.మీ దూరంలోని జోర్హాత్ గ్రామానికి చెందిన ఓ యువతి ఫేస్ బుక్ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాతో ఈ పోస్ట్ విపరీతంగా షేర్ కావడంతో పార్లమెంటరీ వ్యవహరాలశాఖ మంత్రి చంద్ర మోహన్ పఠ్వారీ ఈ ఘటనపై స్పందించి తీవ్ర విమర్శలపాలయ్యారు. గతేడాది అసోం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏజీపీ నేత అయిన చంద్ర మోహన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన జోర్హాత్ గ్రామ యువతి పోస్ట్ పై స్పందిస్తూ.. ఆ యువతి లెఫ్ట్ వింగ్ కు చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి అని అందుకే పోలీసుల వద్దకు వెళ్లకుండా, అందర్నీ తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలపై కూడా రాజకీయం చేయడంతో మంత్రి చంద్ర మోహన్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ జోర్హాత్, గోలఘాట్, సోనిత్ పూర్, గువాహటిలో ఆందోళన చేపట్టారు. చట్టాలు కేవలం బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ లకు మాత్రమే అనుకున్నావా అంటూ అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ మంత్రి చంద్ర మోహన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్ర మోహన్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి హిమంతా బిస్వా శర్మ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని గొగోయ్ డిమాండ్ చేశారు. -
మళ్లీ నేనే సీఎం.. నాలుగోసారి మాదే హవా!
గువాహటి: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మాల్సిన అవసరం లేదని, అందుకే వాటిని తాను అంగీకరించనని చెప్పారు. గతంలోనూ ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని ఎన్నో పర్యాయాలు నిరూపితమైందని పేర్కొన్నారు. గతంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించానని నేటి ఫలితాలలో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ గెలుపుతో వరుసగా నాలుగోసారి సీఎం తానే అవ్వనున్నట్లు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తాము అధికారం నిలబెట్టుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో వాగ్దానాలు చేశారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా చేసిందేమి లేదన్నారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినప్పుడు ఆయన ప్రశ్నించారు. మరోవైపు అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడయ్యాయి. -
సీఎం అభ్యర్థులు ఎంజాయ్ చేస్తున్నారు!
ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో కానీ, అసోంలో మాత్రం రాజకీయ ప్రత్యర్థుల గుండె మీద చెయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు. సాధారణంగా ఎన్నికలు అనగానే.. ఓటర్లను ఎలా ఆకర్షించాలి, ఏ పథకాలు, ఫండ్స్ అంటూ వాగ్దానాలు చేయాలి అని రాజకీయ నేతలు తలలు పట్టుకు కుర్చుంటారు. పోనీ ఎన్నికలు అయిపోయాక కుదురుగా కూర్చుంటారా అది లేదు. తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని ఆందోళన చెందుతుంటారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినా అందులో విజయం తమదేనని తెలిస్తే సరిగ్గానే సర్వే జరిగిందని, లేనిపక్షంలో అవన్నీ బోగస్ సర్వేలంటూ డంభికాలు పోవడం మనకు తెలిసిన విషయమే. బీజేపీ నుంచి సీఎం రేసులో ఉన్న కేంద్ర క్రీడాశాఖ మత్రి సర్భానంద సోనోవాల్ హాయిగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రియో ఒలింపిక్స్ నేపథ్యంలో పాటియాలా లోని నేషనల్ స్పోర్ట్ అకాడమిని ఆకస్మికంగా సందర్శించారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ఆయనను ప్రశ్నించగా... తాను సంజయ్ లీలా భన్సాలీ తీసిన బాజీరావ్ మస్తానీ మూవీ చూసి ఎంజాయ్ చేశానని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. టెన్షన్ పైకి కనపడకుండా ఉండటమే బీజేపీ వ్యూహమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మూడుసార్లు కాంగ్రెస్ కు అధికారపీఠం సాధించిన తరుణ్ గొగోయ్ కూడా ఎన్నికల ఫలితాలపై ఉండే ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. కుటుంబంతో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లి సరదాగా గడుపుతూ, గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారట. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేశారు. సీఎంగా వరుసగా నాలుగోసారి సీఎం కుర్చిలో కూర్చునేది తానేని గగోయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికలలో ఓడినా.. ప్రధాని మోదీ చెప్పినట్లుగా రాజకీయ సన్యాసం చేయాల్సిన గత్యంతరం తనకు లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా రాజకీయంగా తాను చాలా యాక్టివ్ గా ఉన్నానని చెప్పారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతుందన్న విషయం విదితమే. -
సర్వే అంచనాలను కొట్టిపారేసిన సీఎం
గువాహటి: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కొట్టిపారేశారు. అసోంలో మళ్లీ తమదే గెలుపని అన్నారు. తాము అధికారం నిలబెట్టుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మంచి రోజులంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో మాటలు చెప్పారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఏమీ చేయలేదని అన్నారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఆయన ప్రశ్నించారు. కాగా, అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. -
పీవీపై బురద జల్లిన సీఎం
బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో పీవీ నరసింహారావుకు తాను లేఖ రాసినా ఆయన పట్టించుకోలేదంటూ అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ బురద చల్లారు. ఆయనకు పార్టీ మీద పట్టు లేదన్నారు. బాబ్రీ కూల్చివేత సమయానికి ఆహారశాఖ మంత్రిగా ఉన్న తరుణ్ గొగోయ్.. అప్పటి పరిస్థితిలో పీవీ వ్యవహరించిన తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'టర్న్ ఎరౌండ్ - లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్' అనే పేరుతో తాను రాసిన పుస్తకంలో గొగోయ్ ఈ విషయం చెప్పారు. 1992 డిసెంబర్ నెలలో బాబ్రీ కూల్చివేత సమయంలో పీవీ వ్యవహరించి తీరు సరికాదన్నారు. పీవీ చాలా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి అని, ఆయన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ఏనాడూ మంత్రుల పనిలో వేలుపెట్టేవారు కారని చెప్పారు. ఆహార శాఖ మంత్రిగా కూడా తన నిర్ణయాలన్నీ తానే తీసుకునేవాడినని చెప్పారు. 2001 నుంచి ఇప్పటివరకు అసోం ముఖ్యమంత్రిగా ఉంటున్న గొగోయ్.. తన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాలతో ఈ పుస్తకం రాశారు. అయితే పీవీకి పార్టీ మీద అంతగా పట్టు లేదని, మంత్రిగా తనకున్న పరిమితులు కూడా దాటి తాను ఆయనకు ఒక లేఖ రాశానని, మైనారిటీ నేతలను ఆయన విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సిందని గొగోయ్ రాశారు. మసీదు కూల్చివేత తర్వాతే మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని.. అయితే ఆయన తన లేఖకు స్పందించలేదని అన్నారు. కోకా కోలా, పెప్సీ లాంటి బహుళ జాతి సంస్థలను భారతదేశంలోకి అనుమతించినది తానేనని గుర్తుచేసుకున్నారు. దానిపై ప్రతిపక్షాలు విమర్శించినా.. తాను మాత్రం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. -
'100 శాతం పక్షపాతంతో పనిచేస్తోంది'
గువాహటి/కోల్ కతా: ఎన్నికల సంఘం(ఈసీ) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ ఆరోపించారు. ఈసీ ఇంతపక్షపాత ధోరణితో పనిచేయడం ఎన్నడూ చూడలేదని వాపోయారు. పోలింగ్ జరుగుతుండగా ప్రెస్ మీట్ పెట్టొద్దని ఈసీ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం పట్ల ఆయన మండిపడ్డారు. 'ప్రెస్ మీట్ పెట్టొదని నాకు ఈసీ ఎందుకు అధికారికంగా లేఖ ఇవ్వలేదు? నేను లాయర్ని. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే నన్ను అరెస్ట్ చేయండి. నేనేమీ బాధపడను. ఈసీ 100 శాతం పక్షపాతంతో వ్యవహరిస్తోంది. 55 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత పక్షపాతంగా వ్యవహరించిన ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేద'ని గొగొయ్ అన్నారు. రాష్ట్రంలోని మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ఈసీ పనితీరుపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు వెస్ట్ మిడ్నాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ నాయకుడు మనాస్ భునియా కూడా ఈసీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోగస్ మేనేజ్ మెంట్ అధ్వర్యంలో ఎన్నికల సంఘం నడుస్తోందని మండిపడ్డారు. మమతా బెనర్జీ సర్కారు ఒడిలో పసిపాపలా నిద్రపోతోందని ఈసీపై విరుచుకుపడ్డారు. -
'బీజేపీ నిరసన.. తీవ్రవాదుల హింస కంటే దారుణం'
గువహాటి: అసోంలో సోమవారం బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చరిత్రలో అసాధారణమైనది, ఉల్ఫా తీవ్రవాదుల హింసాత్మక చర్యల కంటే భయకరంగా ఉందని బీజేపీ కార్యకర్తల తీరును మంగళవారం గొగోయ్ విమర్శించారు. నిన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అసోం పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నలోమని ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కేంద్రమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మహిళా మంత్రిపై అసభ్యపదజాలం వాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా, నిరసన తెలిపిన 50 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని బీజేపీ నేతలు గొగోయ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే బీజేపీ కార్యకర్తలు ముందస్తు ప్రణాళికతోనే దాడి చేశారని, గువహాటిలోని కాంగ్రెస్ కార్యాలయం గేట్లను బద్దలు కొట్టారని గొగోయ్ చెప్పారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీతో సంబంధం లేదని అసోం పీసీసీ పేర్కొంది. -
'విద్వేషాలు రెచ్చగొట్టడమే మోదీ రాజకీయాలు'
గువహటి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం అసోంలో పర్యటించారు. ఇప్పటివరకు ఉన్న సంప్రదాయాన్ని రాహుల్ పక్కనబెట్టినట్లు కనిపిస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తరుణ్ గొగోయ్‌ని ప్రకటించారు. రెండు పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ రోడ్ షోలు నిర్వహించారు. సీనియర్ జర్నిలిస్టులు, స్థానిక న్యూస్ పేపర్ల ఎడిటర్లతో సమావేశమయ్యారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే బర్పేటా జిల్లాలో పర్యటించిన రాహుల్.. అభివృద్ధి, శాంతిని కోరుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు. తొమ్మిది కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. 2001 నుంచి వరుసగా మూడుసార్లు పార్టీ పగ్గాలు చేపట్టి విజయాలు సాధిస్తోన్న తరుణ్ గొగోయ్‌ని మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు పరోక్షంగా హెచ్చరికలు పంపించారు. గతేడాది అసోంకి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మీకు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కేవలం ద్వేషం, హింసను మాత్రమే బీజేపీ వ్యాపింప చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. వాటిపై రాజకీయాలు చేయడం వచ్చంటూ రాహుల్ మండిపడ్డారు. -
సూట్‌కేసులు తీసుకోకుండానే గెలిచారా?
యూపీఏ హయాం అంతా 'సూట్‌కేసుల ప్రభుత్వం' అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ విమర్శలకు సమాధానం ఇచ్చే సమయంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఎన్నికల సమయంలో చేసిన భారీ ప్రచార పటాటోపం అంతా సూట్ కేసులు తీసుకోకుండానే సాధ్యమైందా.. అసలు సూట్‌కేసులు తీసుకోకుండానే గెలిచారా అంటూ గొగోయ్ తాజాగా విమర్శించారు. మోదీ నేతృత్వంలో సాగిన ప్రచారపర్వం మొత్తం చాలా ఖరీదైనదని, అలాంటి ప్రచారపర్వాన్ని సూట్‌కేసులు తీసుకోకుండా నిర్వహించడం సాధ్యమేనా అని గొగోయ్ ట్వీట్ చేశారు. -
'1950 నుంచి నిర్లక్ష్యం చేశారు'
గౌహతి: ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులకు కాంగ్రెస్ నిర్లక్ష్యపు విధానాలే కారణమని అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్లా కుమార్ మహంతా మండిపడ్డారు. ఈ విధానం 1950 నుంచి కొనసాగుతుండటం వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. అస్సోం గణపరిషత్ (ఏజీపీ) 30 వ వార్షికోత్సవంలో భాగంగా ఆరంభ వేడుకలకు విచ్చేసిన మహంతా.. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో నేటి పరిస్ధితులకు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కారణమన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అంధఃపాతాళానికి నెట్టేశాయని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు కేంద్ర ఏమి అడిగినా ఇస్తుందన్న ముఖ్యమంత్రి తరుణ్ గోగయ్.. వరదల సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అస్సాంలో శాంతి యుత వాతావరణంతో పాటు అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీలు ఆసక్తి కనబరచలేదని ఆయన స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ సీఎంకు మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నందుకు అసోం సీఎం తరుణ్ గొగొయ్ ను ఆయన అభినందించారు. క్లీన్ ఇండియాలో కార్యక్రమంలో పాల్గొని అసోం ప్రజలకు గొగొయ్ స్ఫూర్తిగా నిలిచారని మోదీ ట్వీట్ చేశారు. ముంబైలో స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేసిన సచిన్ టెండూల్కర్ ను కూడా మోదీ మెచ్చుకున్నారు. అందరం కలిసి 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని విజయం చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. -
అస్సాంలో ప్రవేశానికి అల్‌కాయిదా యత్నాలు
ఉల్ఫాతో అవగాహన: సీఎం గొగోయ్ గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ప్రవేశించేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం తరుణ్ గొగోయ్ వెల్లడించారు. రాష్ట్రంలో స్థావరం ఏర్పాటుకు అల్‌కాయిదా ప్రయత్నాలు చేస్తోందని, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉల్ఫాతో ఓ రహస్య అవగాహనకు వచ్చిందని శనివారమిక్కడ విలేకర్లతో అన్నారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేస్తామని కొద్దిరోజుల క్రితం అల్‌కాయిదా పేరిట ఒక వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గొగోయ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అల్ కాయిదా ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. -
శాంతి కోసం ఉమ్మడి యంత్రాంగం
అస్సాం-నాగాలాండ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కేంద్ర హోం శాఖ చొరవతో ఉన్నతస్థాయి కమిటీ గువాహటి: అస్సాం, నాగాలాండ్ సరిహద్దుల మధ్య తలెత్తిన వివాదం పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. సమస్యలు పరిష్కరించుకోవటానికి రెండు రాష్ట్రాలూ ఉమ్మడిగా ఒక ఉన్నతస్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అంగీకరించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జీలంగ్‌లతో గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమావేశమవుతూ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద సరిహద్దుల్లో తటస్థ బలగాలను మోహరించేందుకు యోచిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రులు ఎప్పుడు కోరినా కేంద్రం నుంచి తగిన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉరియమ్‌ఘాట్ దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలు తగిన విధంగా విధులు నిర్వర్తించలేదన్న గొగోయ్ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, నిర్దిష్ట విధి విధానాలను కేంద్ర బలగాలు ఉల్లంఘించినట్లయితే తగిన చర్య తీసుకుంటామన్నారు. మౌలిక వసతులే సమస్య సరిహద్దుల్లో వివాదానికి ప్రధాన కారణం ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవటమేనని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్తు వంటి కీలకమైన సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేకపోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తి కావటానికి తగిన నిధులు అవసరమని ఆయన చెప్పారు. ఇందుకోసం తాము కేంద్ర సహాయాన్ని అర్థిస్తున్నామని గొగోయ్ అన్నారు. మరోవైపు.. అస్సాం, నాగాలాండ్ సమస్య ప్రభావం ఈశాన్య రాష్ట్రాలన్నింటిపైనా పడుతోందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. కర్ఫ్యూ సడలింపు గోల్ఘాట్(అస్సాం): సరిహద్దుల వివాదాలతో ఉద్రిక్తతలు నెలకొన్న గోల్‌ఘాట్‌లో గురువారం సాయంత్రం కొన్ని గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తున్నట్టు ప్రకటించారు. సరిహద్దుల దగ్గర ఆందోళన చేస్తున్న 7 సంస్థలు తమ నిరవధిక ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, గురువారం పూర్తి కర్ఫ్యూ ఉన్నప్పటికీ నుమాలీఘర్ దగ్గర 39వ నెంబరు జాతీయరహదారి పై నిరసన కారులు బైఠాయించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. -
ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై దాడి
సరుపతార్(అస్సాం): నాగాలాండ్-అస్సాం సరిహద్దులలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వాహనశ్రేణి(కాన్వాయ్)పై నిరసనకారులు దాడి చేశారు. తరుణ్ గొగోయ్ ఈరోజు నాగాలాండ్ సరిహద్దులలోని గోల్ఘాట్ జిల్లాలోని యురియంఘాట్ సందర్శనకు వెళ్లారు. సీఎం వాహనశ్రేణిపై నిరసనకారులు దాడి చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లరిమూకలు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని, రెండు వాహనాలు దెబ్బతిన్నాయని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపి రూట్ చెప్పారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాలిలోకి కాల్పులు జరిపారు. -
మరో ముఖ్యమంత్రికి ఎసరు
వరుసపెట్టి ముఖ్యమంత్రులను మార్చిపారేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చాలని ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస పెద్దలు.. ఇప్పుడు అసోం సీఎం తరుణ్ గొగోయ్ పదవికి కూడా ఎసరు పెడుతున్నారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గొగోయ్ మీద ప్రజల్లో వ్యతిరేకత మాట ఎలా ఉన్నా.. అంతర్గతంగా ఆయన మంత్రివర్గంలోనే వ్యతిరేకత రావడంతో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర విద్య, ఆరోగ్యశాఖల మంత్రి హిమంత విశ్వశర్మ నాయకత్వంలో గొగోయ్ వ్యతిరేక శిబిరం ఇటీవలి కాలంలో బాగా చురుగ్గా వ్యవహరిస్తోంది. పదమూడేళ్లుగా సీఎంగా ఉన్న గొగోయ్.. ఈసారి తమ రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సొంత పార్టీని పెద్దగా గెలిపించుకోలేకపోయారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు మాత్రమే వచ్చాయి. దాంతో ఆయన మీద వ్యతిరేకత మరింత పెరిగింది. 2016 సంవత్సరంలో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందువల్ల ఈ రెండేళ్ల పాటు కొత్త ముఖాన్ని తీసుకొస్తే ఫలితం ఏమైనా ఉండచ్చేమోనని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. -
గొగోయ్ రాజీనామాను తిరస్కరించిన సోనియా
న్యూఢిల్లీ: అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామాను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తిరస్కరించారని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిలోమని సేన్ దేకా తెలిపారు. దేశ రాజధానికి చేరుకున్న తరుణ్ గొగోయ్ ఈ మధ్యాహ్నం సోనియా, రాహుల్ గాంధీలను కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని భావించారు. తన నిర్ణయాన్ని అధినేత్రి ముందుంచారు. అయితే పదవికి రాజీనామా చేయొద్దని గొగోయ్‌కు సోనియా సూచించారు. -
పరాజయ భారంతో.. నేడు రాజీనామా!
ఈశాన్య రాష్ట్రమైన అసోంను ఏకఛత్రాధిపత్యంగా పదమూడేళ్లుగా అప్రతిహతంగా పాలిస్తున్న తరుణ్ గొగోయ్.. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని, ఇకమీదట ముఖ్యమంత్రి పదవి వద్దని చెబుతూ గురువారం నాడే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే అసోంలో ఈసారి బీజేపీ పాగా వేసింది. అక్కడ మొత్తం 14 లోక్‌సభ స్థానాలుండగా.. ఏడింటిని బీజేపీ సొంతం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి మూడంటే మూడే స్థానాలు దక్కాయి. మరో మూడు స్థానాలను అస్సాం యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏయూడీఎఫ్) గెలుచుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ మాత్రం ఎలాగోలా తమ కుటుంబ ప్రతిష్ఠను కాపాడుతూ కలియాబార్ పార్లమెటరీ నియోజకవర్గంలో 94వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. 2001 నుంచి అసోంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. గొగోయ్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే క్రమశిక్షణ రాహిత్యం, ముఠాతత్వం లాంటివి ఇటీవల అక్కడ ఎక్కువైపోయాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుందని తెలుస్తోంది. 2009లో ఏడు సీట్లను సాధించిన కాంగ్రెస్, ఈసారి వాటిలో నాలుగింటిని కోల్పోయింది. ఆరు స్థానాల కంటే తక్కువ వస్తే రాజీనామా చేస్తానని ముందే చెప్పినందున అలా చేస్తున్నట్లు గొగోయ్ చెప్పారు. -
వారంలో సీఎం పదవికి రాజీనామా: గొగోయ్
గువాహటి: తనలో, కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన ఒకింత అహంకార, ఉదాశీన వైఖరి వల్లే రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో తమకు పేలవ ఫలితాలు వచ్చాయని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తెలిపారు. మొత్తం 14 ఎంపీ సీట్లకుగానూ 3 సీట్లలోనే తాము గెలిచామని...ఇందుకు నైతిక బాధ్యత వహించి వారం రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని శనివారం గువాహటిలో చెప్పారు. కానీ రాజకీయాల నుంచి మాత్రం తప్పుకోనని...పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ‘‘మూడుసార్లు సీఎంగా గెలిచాక ఎవరిలోనైనా ఎంతో కొంత అహంకారం, ఉదాశీన వైఖరి వచ్చి చేరతాయి. నాలో, పార్టీలోనూ ఇదే కనిపించింది. మమ్మల్ని ఎవరూ ఓడించలేరనుకున్నాం. ప్రజా వ్యతిరేకతను గుర్తించలేకపోయాం’’ అని గోగోయ్ పేర్కొన్నారు. -
ఏరుదాటిన కేంద్ర మంత్రులు
రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు కేంద్ర మంత్రులు అతి కష్టం మీద ఏరు దాటారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ స్థానికంగా తమకున్న పలుకుబడితో ఒడ్డున పడ్డారు. గుల్బర్గ నుంచి గెలుపొందిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే 1972 నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగలేదు. ఈసారి ఆయన గెలుపు నల్లేరుపై నడక కాదని అందరూ భావించారు. స్థానికంగా ఆయన చేపట్టిన పనులే శ్రీరామ రక్షగా నిలిచాయి. కాంగ్రెస్‌కు ఇంతగా ప్రతికూల పవనాలు వీచినప్పటికీ 74 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. ఏడోసారి గెలుపొందిన మునియప్ప కేంద్ర సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కేహెచ్. మునియప్ప వరుసగా ఏడో సారి గెలుపు సాధించారు. ఈసారి ఆయనకూ చుక్కెదురవుతుందని వినవచ్చినా, తన చాణక్యంతో ప్రత్యర్థిని మట్టి కరిపించారు. సుమారు 48 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపును సొంతం చేసుకున్నారు. చిక్కబళ్లాపురం నుంచి పోటీ చేసిన పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్వల్ప ఆధిక్యతతో బయట పడగలిగారు. ప్రారంభ రౌండ్లలో వెనుకంజలో ఉన్నప్పటికీ, చివరకు పుంజుకుని గెలుపు సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గెలుపు అంచనాలతో ఆఖరి నిముషంలో ఈ నియోజక వర్గం నుంచి బరిలో దిగినప్పటికీ, మూడో స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఈయన బరిలో ఉండబట్టే మొయిలీకి గెలుపు సాధ్యమైందనే మాటలూ వినిపిస్తున్నాయి. -
అస్సాంలో పేట్రేగిన మిలిటెంట్లు... 23 మంది మృతి
* ఏకే 47 తుపాకులతో విరుచుకుపడ్డ ముష్కరులు * చివురుటాకుల్లా వణికిన కోక్రాఝర్, బక్సా జిల్లాలు * కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశం.. గువాహటి: అస్సాంలో బోడోలాండ్ తీవ్రవాదులు పేట్రేగిపోయారు. బోడోలాండ్ ప్రాంతం పరిధిలోని రెండు అత్యంత సున్నితమైన జిల్లాల్లో భీకర దాడులకు తెగబడ్డారు. గురువారం అర్ధరాత్రి నుంచి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో మొత్తం 23 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు, 11మంది మహిళలు ఉన్నారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో ఉలిక్కిపడ్డ అస్సాం సర్కారు ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. వివరాలు.. ఎన్డీఎఫ్బీ-ఎస్(నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్-సొంగ్‌బిజిత్)కు చెందిన 40 మంది మిలిటెంట్లు శుక్రవారం తెల్లవారుజామున కోక్రాఝర్ జిల్లాలోని బలపరా-1 గ్రామంలోని మూడు ఇళ్లలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వీరిలో మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. పొరుగున ఉన్న బక్సా జిల్లాలో గురువారం అర్ధరాత్రే తొలుత దాడులకు దిగిన మిలిటెం ట్లు.. జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఇదే జిల్లాలో మరో వ్యక్తిని కూడా మిలిటెంట్లు కాల్చి చంపారు. బక్సా జిల్లాలోని నాంకేఖాద్రాబరి, నయాంగురి గ్రామాల్లో బుల్లెట్ల ధాటికి ప్రాణాలు కోల్పోయిన 12 మంది మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారన్నారు. ఇదే జిల్లాలోని మానస్ జాతీయ పార్కు సమీపంలో బేకి నదీ ఒడ్డున ఉన్న మైనార్టీ వర్గాలకు చెందిన 70 ఇళ్లను మిలిటెంట్లు తగలబెట్టారు. ఈ ఘటనలతో ఉలిక్కిపడ్డ అస్సాం సర్కారు కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా చిరాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే బక్సా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 నుంచి తెల్లవారు జామున 4గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో ఫోన్లో మాట్లాడి అదనపు బలగాలను పంపాలని కోరారు. రాష్ట్రానికి అన్నిరకాలుగా సాయం చేస్తామని షిండే చెప్పారు. దాడులకు పాల్పడిన ఎన్డీఎఫ్బీ మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం ఆదేశించింది. -
పతి గెలుపే సతి లక్ష్యం
భర్త గెలుపు కోసం వీర తిలకం దిద్ది ప్రచారానికి సాగనంపి ఊరుకోలేదీ సతీమణి. దేశం, భాష కాకపోయినా.. పతిదేవుడి విజయం కోసం ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొడుకు గౌతమ్ గొగోయ్ అస్సాంలోని కాలియాబర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ బరిలోఉన్నారు. ఐదు నెలల క్రితమే బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్ క్లైర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. భర్త విజయం కోసం తనవంతు సాయం చేయాలనుకున్న ఎలిజబెత్ భర్తతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అస్సామీ భాష రాకపోవడం ఇబ్బందిగా మారడంతో పట్టుబట్టి కొద్ది రోజుల్లోనే అస్సామీ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు సభల్లో తన భర్తకు ఓటేయమంటూ అస్సామీలోనే ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ‘ఎలిజబెత్ చాలా తొందరగా అస్సామీ నేర్చుకుంది. తన ప్రసంగాలకు మంచి స్పందన వస్తోంది’ అంటూ గౌరవ్ గర్వంగా చెబుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన గౌరవ్ ప్రస్తుతం రెండు స్వచ్చంధ సంస్థలను నడుపుతున్నారు. ఎలిజబెత్ కూడా ‘లీడ్ ఇండియా’ అనే ఎన్జీఓలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.