'100 శాతం పక్షపాతంతో పనిచేస్తోంది'
గువాహటి/కోల్ కతా: ఎన్నికల సంఘం(ఈసీ) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ ఆరోపించారు. ఈసీ ఇంతపక్షపాత ధోరణితో పనిచేయడం ఎన్నడూ చూడలేదని వాపోయారు. పోలింగ్ జరుగుతుండగా ప్రెస్ మీట్ పెట్టొద్దని ఈసీ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం పట్ల ఆయన మండిపడ్డారు. 'ప్రెస్ మీట్ పెట్టొదని నాకు ఈసీ ఎందుకు అధికారికంగా లేఖ ఇవ్వలేదు? నేను లాయర్ని. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే నన్ను అరెస్ట్ చేయండి. నేనేమీ బాధపడను. ఈసీ 100 శాతం పక్షపాతంతో వ్యవహరిస్తోంది. 55 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత పక్షపాతంగా వ్యవహరించిన ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేద'ని గొగొయ్ అన్నారు. రాష్ట్రంలోని మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ఈసీ పనితీరుపై ఆరోపణలు గుప్పించారు.
మరోవైపు వెస్ట్ మిడ్నాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ నాయకుడు మనాస్ భునియా కూడా ఈసీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోగస్ మేనేజ్ మెంట్ అధ్వర్యంలో ఎన్నికల సంఘం నడుస్తోందని మండిపడ్డారు. మమతా బెనర్జీ సర్కారు ఒడిలో పసిపాపలా నిద్రపోతోందని ఈసీపై విరుచుకుపడ్డారు.