Manas Bhuniya
-
'100 శాతం పక్షపాతంతో పనిచేస్తోంది'
గువాహటి/కోల్ కతా: ఎన్నికల సంఘం(ఈసీ) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ ఆరోపించారు. ఈసీ ఇంతపక్షపాత ధోరణితో పనిచేయడం ఎన్నడూ చూడలేదని వాపోయారు. పోలింగ్ జరుగుతుండగా ప్రెస్ మీట్ పెట్టొద్దని ఈసీ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం పట్ల ఆయన మండిపడ్డారు. 'ప్రెస్ మీట్ పెట్టొదని నాకు ఈసీ ఎందుకు అధికారికంగా లేఖ ఇవ్వలేదు? నేను లాయర్ని. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే నన్ను అరెస్ట్ చేయండి. నేనేమీ బాధపడను. ఈసీ 100 శాతం పక్షపాతంతో వ్యవహరిస్తోంది. 55 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత పక్షపాతంగా వ్యవహరించిన ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేద'ని గొగొయ్ అన్నారు. రాష్ట్రంలోని మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ఈసీ పనితీరుపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు వెస్ట్ మిడ్నాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ నాయకుడు మనాస్ భునియా కూడా ఈసీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోగస్ మేనేజ్ మెంట్ అధ్వర్యంలో ఎన్నికల సంఘం నడుస్తోందని మండిపడ్డారు. మమతా బెనర్జీ సర్కారు ఒడిలో పసిపాపలా నిద్రపోతోందని ఈసీపై విరుచుకుపడ్డారు. -
'సీఈవో హత్యపై ఉన్నతస్థాయి విచారణ'
కోల్కతా: నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హత్య కేసుపై ఉన్నతస్థాయిలో నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ కేసులో నిజానిజాలు వెల్లడికావాలంటే ఉన్నతస్థాయిలో నిష్పక్షపాత విచారణ జరపాలని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మనాస్ భునియా డిమాండ్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. హుగ్లీ జిల్లాలో భద్రేశ్వర్ వద్దనున్న నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హెచ్ కే మహేశ్వరిని కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా కొట్టడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.