బాధితురాలిపై మంత్రి కామెంట్.. తీవ్ర విమర్శలు!
గువాహటి: 'చీకటి పడుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నా వద్దకు వచ్చారు. బైకుపై వచ్చిన వాళ్లు హెల్మెట్ ధరించి ఉన్నారు. నేను అక్కడినుంచి వెళ్లిపోతున్నాను. ఇంతలో ఒకడు నన్ను అడ్డగించగా.. రెండో వ్యక్తి చెప్పరాని విధంగా నన్ను తాకాడు. దీంతో నిస్సహాయంగా ఉండిపోయాను'.. ఇది అస్సాం రాజధాని గువాహటికి 330 కి.మీ దూరంలోని జోర్హాత్ గ్రామానికి చెందిన ఓ యువతి ఫేస్ బుక్ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాతో ఈ పోస్ట్ విపరీతంగా షేర్ కావడంతో పార్లమెంటరీ వ్యవహరాలశాఖ మంత్రి చంద్ర మోహన్ పఠ్వారీ ఈ ఘటనపై స్పందించి తీవ్ర విమర్శలపాలయ్యారు.
గతేడాది అసోం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏజీపీ నేత అయిన చంద్ర మోహన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన జోర్హాత్ గ్రామ యువతి పోస్ట్ పై స్పందిస్తూ.. ఆ యువతి లెఫ్ట్ వింగ్ కు చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి అని అందుకే పోలీసుల వద్దకు వెళ్లకుండా, అందర్నీ తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలపై కూడా రాజకీయం చేయడంతో మంత్రి చంద్ర మోహన్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ జోర్హాత్, గోలఘాట్, సోనిత్ పూర్, గువాహటిలో ఆందోళన చేపట్టారు.
చట్టాలు కేవలం బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ లకు మాత్రమే అనుకున్నావా అంటూ అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ మంత్రి చంద్ర మోహన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్ర మోహన్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి హిమంతా బిస్వా శర్మ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని గొగోయ్ డిమాండ్ చేశారు.