ముంబై: మహారాష్ట్ర సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ షేరింగ్ చేసిన వ్యవహారంలో నటికి ఊరట దొరకడం లేదు. బెయిల్ దొరికినా.. మరాఠీ నటి కేతకి చిటలే(29) ఇంకా జైల్లోనే ఉన్నారు. అందుకు కారణం.. ఆమెపై ఏకంగా 20 దాకా కేసులు నమోదు కావడం.
మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే.. పవార్‌ను కించపరిచేలా ఉన్న పోస్ట్ ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్‌ను నటి కేతకి షేర్ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న థానే పోలీసులు.. మే 14వ తేదీన ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మధ్యలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించింది కోర్టు. ఇది జరిగి నెల కావొస్తోంది.
అయితే.. థానే కోర్టు తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆమె ఇంకా జైల్లోనే ఉంది. అనుచిత పోస్ట్ షేరింగ్ విషయంలో ఆమెపై 20 కేసులు నమోదు అయ్యాయని, అందుకే ఆమె రిలీజ్ కుదరదని జైళ్ల శాఖ తెలిపింది. మరోవైపు బెయిల్ కోసం ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వచ్చే వారం పిటిషన్ విచారణకు రానుంది. అదే విధంగా ఆయా కేసుల్లో విచారణపై స్టే విధించాలంటూ మరో పిటిషన్‌ను వేయగా.. ఆ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంది.
మరోవైపు.. కేతకి చిటలేతో పాటు పవార్ వ్యతిరేక పోస్టును ట్విటర్‌లో షేర్ చేసిన నిఖిల్ భర్మే(23) అనే ఫార్మసీ స్టూడెంట్ సైతం అరెస్ట్ అయ్యాడు. నిఖిల్‌పై సైతం ఆరు కేసులు నమోదుకాగా, నెలపైనే జైల్లో ఉన్నాడు.
మరాఠీలో ఉన్న సదరు పోస్ట్‌లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్‌ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు.
Comments
Please login to add a commentAdd a comment