
గువాహటి : ప్రధాని నరేంద్ర మోదీ అవలంభిస్తున్న విధానాలపై అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గగోయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాలను, నిపుణులను సంప్రదించడకుండా కరోనా లాక్‌డౌన్‌ను ప్రకటించడం మోదీ చేసిన మూడో అతిపెద్ద తప్పిదమని వ్యాఖ్యానించారు. మోదీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన గగోయ్ ఈ విధంగా స్పందించారు.
నోట్ల రద్దు మోదీ చేసిన మొదటి తప్పని, ఎటువంటి ప్రణాళిక లేకుండా జీఎస్టీ తీసుకురావడం రెండో తప్పని, ఇప్పుడు ఎటువంటి కార్యాచరణ లేకుండా లాక్‌డౌన్ విధించడం మూడో తప్పని విమర్శించారు. మోదీ నిర్ణయం ఒక ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపదని.. ఇది చాలా మంది పేదలను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా వలస కార్మికులు పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో లాక్‌డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన వలస కార్మికుల ప్రస్తావనే లేదని ఆరోపించారు. (చదవండి : ఉపాధికి మరో 40 వేల కోట్లు)
‘ఎటువంటి ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్ ప్రకటించిన మోదీ.. ఆయన దూరదృష్టి గల నాయకుడు కాదని నిరూపించుకున్నాడు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీలో కేవలం రుణాలు మాత్రమే ఇవ్వనున్నారు. కరోనా వల్ల నష్టపోయిన వారికి కొద్దిమేర సబ్సిడీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ నాకు ఇందులో అది కనిపించలేదు. మోదీ ఆయనను ఒక నిపుణుడు అని అనుకుంటారు. ప్రతిది ఆయనకే తెలుసని భావిస్తారు.. అందుకే ఎవరినీ సంప్రదించడానికి ఇష్టపడరు.. ఇదంతా ఒక నియంత ధోరణి. కరోనా వైరస్ భారత్‌లోని ప్రవేశించకముందే భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కేంద్రం ఆర్థిక ప్యాకేజీని చాలా రోజుల క్రితమే ప్రకటించి ఉంటే బాగుండేంది’ అని గగోయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment