పరాజయ భారంతో.. నేడు రాజీనామా!
ఈశాన్య రాష్ట్రమైన అసోంను ఏకఛత్రాధిపత్యంగా పదమూడేళ్లుగా అప్రతిహతంగా పాలిస్తున్న తరుణ్ గొగోయ్.. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని, ఇకమీదట ముఖ్యమంత్రి పదవి వద్దని చెబుతూ గురువారం నాడే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే అసోంలో ఈసారి బీజేపీ పాగా వేసింది. అక్కడ మొత్తం 14 లోక్సభ స్థానాలుండగా.. ఏడింటిని బీజేపీ సొంతం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి మూడంటే మూడే స్థానాలు దక్కాయి. మరో మూడు స్థానాలను అస్సాం యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏయూడీఎఫ్) గెలుచుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ మాత్రం ఎలాగోలా తమ కుటుంబ ప్రతిష్ఠను కాపాడుతూ కలియాబార్ పార్లమెటరీ నియోజకవర్గంలో 94వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు.
2001 నుంచి అసోంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. గొగోయ్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే క్రమశిక్షణ రాహిత్యం, ముఠాతత్వం లాంటివి ఇటీవల అక్కడ ఎక్కువైపోయాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుందని తెలుస్తోంది. 2009లో ఏడు సీట్లను సాధించిన కాంగ్రెస్, ఈసారి వాటిలో నాలుగింటిని కోల్పోయింది. ఆరు స్థానాల కంటే తక్కువ వస్తే రాజీనామా చేస్తానని ముందే చెప్పినందున అలా చేస్తున్నట్లు గొగోయ్ చెప్పారు.