రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు కేంద్ర మంత్రులు అతి కష్టం మీద ఏరు దాటారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ స్థానికంగా తమకున్న పలుకుబడితో ఒడ్డున పడ్డారు. గుల్బర్గ నుంచి గెలుపొందిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే 1972 నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగలేదు. ఈసారి ఆయన గెలుపు నల్లేరుపై నడక కాదని అందరూ భావించారు. స్థానికంగా ఆయన చేపట్టిన పనులే శ్రీరామ రక్షగా నిలిచాయి. కాంగ్రెస్‌కు ఇంతగా ప్రతికూల పవనాలు వీచినప్పటికీ 74 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.
ఏడోసారి గెలుపొందిన మునియప్ప
కేంద్ర సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కేహెచ్. మునియప్ప వరుసగా ఏడో సారి గెలుపు సాధించారు. ఈసారి ఆయనకూ చుక్కెదురవుతుందని వినవచ్చినా, తన చాణక్యంతో ప్రత్యర్థిని మట్టి కరిపించారు. సుమారు 48 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపును సొంతం చేసుకున్నారు. చిక్కబళ్లాపురం నుంచి పోటీ చేసిన పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్వల్ప ఆధిక్యతతో బయట పడగలిగారు.
ప్రారంభ రౌండ్లలో వెనుకంజలో ఉన్నప్పటికీ, చివరకు పుంజుకుని గెలుపు సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గెలుపు అంచనాలతో ఆఖరి నిముషంలో ఈ నియోజక వర్గం నుంచి బరిలో దిగినప్పటికీ, మూడో స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఈయన బరిలో ఉండబట్టే మొయిలీకి గెలుపు సాధ్యమైందనే మాటలూ వినిపిస్తున్నాయి.
ఏరుదాటిన కేంద్ర మంత్రులు
Published Sat, May 17 2014 3:07 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement