మరో ముఖ్యమంత్రికి ఎసరు
వరుసపెట్టి ముఖ్యమంత్రులను మార్చిపారేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ను మార్చాలని ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస పెద్దలు.. ఇప్పుడు అసోం సీఎం తరుణ్ గొగోయ్ పదవికి కూడా ఎసరు పెడుతున్నారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గొగోయ్ మీద ప్రజల్లో వ్యతిరేకత మాట ఎలా ఉన్నా.. అంతర్గతంగా ఆయన మంత్రివర్గంలోనే వ్యతిరేకత రావడంతో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా రాష్ట్ర విద్య, ఆరోగ్యశాఖల మంత్రి హిమంత విశ్వశర్మ నాయకత్వంలో గొగోయ్ వ్యతిరేక శిబిరం ఇటీవలి కాలంలో బాగా చురుగ్గా వ్యవహరిస్తోంది. పదమూడేళ్లుగా సీఎంగా ఉన్న గొగోయ్.. ఈసారి తమ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సొంత పార్టీని పెద్దగా గెలిపించుకోలేకపోయారు. మొత్తం 13 లోక్సభ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు మాత్రమే వచ్చాయి. దాంతో ఆయన మీద వ్యతిరేకత మరింత పెరిగింది. 2016 సంవత్సరంలో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందువల్ల ఈ రెండేళ్ల పాటు కొత్త ముఖాన్ని తీసుకొస్తే ఫలితం ఏమైనా ఉండచ్చేమోనని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.