కేంద్రంతో మాత్రమే చర్చిస్తాం: జీజేఎం
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై తాము కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరుపుతామని, పశ్చిమ బెంగాల్ సర్కారుతో ఈ అంశంపై మాట్లాడే ప్రసక్తే లేదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కరాఖండిగా తేల్చి చెప్పింది. జీజేఎం చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా డార్జిలింగ్ పర్వతప్రాంతంలో ఆదివారం తొమ్మిది రోజూ బంద్ కొనసాగింది. ‘ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం మా న్యాయమైన డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు సాగిస్తాం. ఈ అంశంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో మాట్లాడే ప్రసక్తే లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈ అంశంతో ఎలాంటి సంబంధం లేదు’ అని జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ ఆదివారం మీడియాతో అన్నారు.
డార్జిలింగ్ ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా పొందేందుకు కేంద్రంతో జీజేఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బంద్‌కు ఒకరోజు విరామం ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 13-14 నుంచి ‘జనతా కర్ఫ్యూ’ ప్రారంభించనున్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధించిన 72 గంటల గడువు ఆమె ఆదేశం కాదని, కోర్టు ఆదేశమని అన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండానే ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగిస్తామని, ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతారని చెప్పారు. ఒకవైపు డార్జిలింగ్‌లో నిరవధిక బంద్ కొనసాగుతుండగా, మరోవైపు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. జీజేఎం కోర్ కమిటీ సభ్యుడు శేఖర్ శర్మను శనివారం రాత్రి కుర్సియాంగ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
బంద్‌లు ఆపకుంటే కఠిన చర్యలు: గొగోయ్
గువాహటి: ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లతో అస్సాంలో బంద్‌లు కొనసాగిస్తున్న నిరసనకారులు బంద్ ఆపాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ హెచ్చరించారు. త్రిపురలోనూ ‘ప్రత్యేక’ డిమాండ్: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తెరపైకి వచ్చింది. గిరిజన ప్రాంతాలను కలుపుతూ త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలిని (టీటీఏఏడీసీ) ఏర్పాటు చేయాలని ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీటీఎఫ్) డిమాండ్ చేసింది. అయితే, త్రిపురలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాయి.