Gorkha Janmukti Morcha
-
గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా
డార్జిలింగ్/కోల్‌కతా: ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర సాధన కోసం దాదాపు 15 ఏళ్లుగా పోరాడుతున్న గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఎట్టకేలకు తన ప్రధాన డిమాండ్‌ను విరమించుకుంది. నేపాలీ మాట్లాడే గూర్ఖాలు అధికంగా నివసించే పశ్చిమబెంగాల్లోని పర్వత ప్రాంత సమ్మిళిత అభివృద్ది కోసం ‘రాజకీయ’ పరిష్కారం చూపాలని జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి డిమాండ్‌చేశారు. ‘ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను వదులుకుంటున్నాం. బెంగాల్ రాష్ట్రంలో గూర్ఖాలు ఇకపై మమేకం అవుతారు. పర్వత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారు’ అని రోషన్ చెప్పారు. ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న సీఎం మమతా బెనర్జీతో హమ్రో పార్టీ సభ్యులతో కూడిన జీజేఎం ప్రతినిధి బృందం భేటీ అయింది. జీజేఎం నిర్ణయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్వాగతించాయి. ప్రజా మద్దతు కోల్పోయే జీజేఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రత్యేక డార్జిలింగ్ రాష్ట్ర సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని కుర్సేంగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ప్రసాద్ శర్మ అన్నారు. జీజేఎంకు ఆయువుపట్టు లాంటి డార్జిలింగ్ ప్రాంతంలో హమ్రో పార్టీ హవా పెరిగిందని, ముఖ్యంగా డార్జిలింగ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో జీజేఎం పంథా మారిందని శర్మ వ్యాఖ్యానించారు. -
డార్జిలింగ్‌లో చెలరేగిన హింస
► పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి! ► పోలీస్ అవుట్‌పోస్టు, రైల్వే స్టేషన్‌కు నిప్పు డార్జిలింగ్/కోల్‌కతాæ: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో గత 24 రోజులుగా జరుగుతున్న బంద్ శనివారం హింసాత్మకంగా మారింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఆర్మీ బలగాలను వీధుల్లో మోహరించింది. పోలీసులు శుక్రవారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఇద్దరు జీజేఎం కార్యకర్తలు మరణించారని పార్టీ నేతలు ఆరోపించారు. అందుకు ప్రతీకారంగా కార్యకర్తలు శనివారం ఓ పోలీస్ ఔట్‌పోస్ట్, టాయ్ ట్రైన్ స్టేషన్‌ను తగులబెట్టడంతోపాటు పోలీసులతో ఘర్షణలకు దిగారు. ఉద్యమ పార్టీలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనీ, ముందు వారు హింసను విడనాడాలని సీఎం మమతా బెనర్జీ అన్నారు.అయితే ఇక మమతతో తాము మాట్లాడేదేమీ ఉండదనీ, కేంద్రం చర్చలకు పిలిస్తే వెళ్తామని జీజేఎం ఒక ప్రకటనలో తెలిపింది. గతనెలలోనూ పోలీసుల కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు చనిపోవడం తెలిసిందే. ముగ్గురు కార్యకర్తలు చనిపోతే ఒక్కరే అని చెబుతున్నారని అప్పట్లో జీజేఎం ఆరోపించింది. బదురియా అల్లర్లపై న్యాయ విచారణ బదురియా, బసీర్హాట్లో మత ఘర్షణలపై న్యాయ విచారణకు ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీజేపీ మహిళా ఎంపీ రూపా గంగూలీ మహమ్మద్ ప్రవక్తపై పెట్టిన వివాదాస్పద ఫేస్బుక్ పోస్టు కారణంగా ఈ అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ పోస్టుతో ఆగ్రహించిన కొందరు ముస్లింలు బసీర్హాట్లో హిందువుల ఇళ్లపై దాడి చేసి నిప్పుపెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై జ్యుడీషియల్ కమిషన్ పూర్తిగా విచారణ చేపడుతుందని, నిష్పాక్షిక నివేదికను అందజేస్తుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఘటనలకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అలాగే తప్పుడు వీడియోలు ప్రసారం చేసినందుకు రెండు టీవీ చానళ్లపైనా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రశాంతను దెబ్బతీయాలని బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. -
గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టం: జీజేఎం
డార్జిలింగ్: చర్చల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నా, గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టబోమని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) అధ్యక్షుడు బిమల్ గురుంగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సర్కారు సంతకం చేసిన గూర్ఖా ప్రాంతీయ ప్రాధికార సంస్థ చట్టంలో గూర్ఖాలాండ్ డిమాండ్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయన ఆదివారంలో తన వ్యాఖ్యలను ‘ఫేస్బుక్’లో పోస్ట్ చేశారు. కేంద్రం తెలంగాణ డిమాండ్‌ను ఆమోదించినప్పుడు, తామెందుకు తమ డిమాండ్‌ను వదులుకోవాలని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై కేంద్రంతో చర్చలు జరిపేందుకు తమ పార్టీ ప్రతినిధులు డిసెంబర్ 21న ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోను, తెరాయి, దూవార్ ప్రాంతా ల్లో ఎలాంటి బంద్‌లు ఉండబోవన్నారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో శాంతి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునివ్వడంపై స్పందిస్తూ, ఈ ప్రాంతంలో తానేమీ హింసాకాండను కోరుకోవడం లేదన్నారు. -
బెంగాల్ విభజన జరగదు: మమత
పశ్చిమ బెంగాల్ విభజన జరగబోదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. డార్జిలింగ్ కొండల్లో నిర్వహిస్తున్న నిరవధిక బంద్‌ను ఉపసంహరించుకోవాలని గుర్కా జనముక్తి మోర్చా(జీజేఎం)ను మరోసారి కోరారు. జీటీఏకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జీజేఎంకు అన్నివిధాలా సహకరిస్తామని మమత హామీయిచ్చారు. జీటీఏకు ద్వారా భూములు పంపిణీ చేశామని, వైద్యం- విద్య అందించామని, వంద రోజుల ఉపాధి కల్పన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గుర్కాలాండ్ పేరు మీదే ఇవన్నీ చేస్తున్నామని ఇంకా ఏం కావాలని ఆమె ప్రశ్నించారు. రాష్టం విడిపోయే పరిస్థితి లేదని మమత బెనర్జీ స్పష్టం చేశారు. బంద్ పేరుతో డార్జిలింగ్‌లో అభివృద్ధి కార్యక్రమాలను జీజేఎం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. రోగులను తరలిస్తున్న వాహనాలకు కూడా నిప్పు పెడుతున్నారని ఆమె విమర్శించారు. -
జీజేఎం అగ్రనేత అరెస్ట్
గూర్ఖా జనమూక్తి మోర్చా (జీజేఎం) అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమంగ్‌ను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతధికారులు గురువారం డార్జిలీంగ్లో వెల్లడించారు. అతనితోపాటు మరో అరుగురు అనుచరులను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. పశ్చిమ బెంగాల్- సిక్కిం రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జీజేఎం అధినేత బిమల్ గురుంగ్‌కు బియన్ తమంగ్ ముఖ్య అనుచరుడని పోలీసులు పేర్కొన్నారు. గతంలో గృహదహానాలతోపాటు పలు కేసులు బిమల్ పై నమోదు అయిన సంగతిని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీజేఎం ఉద్యమిస్తుంది. అయితే జులై 30న యూపీఏ సర్కార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలం అని ప్రకటించింది. దాంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట ఉద్యమం ఊపందుకుంది. అందులోభాగంగా పశ్చిమ బెంగాల్లో గూర్ఖాలాండ్ ప్రాంతాన్ని కూడా ఓ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జీజేఎం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దాంతో నిత్యం ఉద్యమాలతో ఆ ప్రాంతం నిరసన సెగలు కక్కుతుంది. అయితే ఇప్పటికే జీజేఎం నేత బిమల్ గురుంగ్‌ను మమత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జులై 30 నుంచి నేటి వరకు 710 మంది జీజేఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
కేంద్రంతో మాత్రమే చర్చిస్తాం: జీజేఎం
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై తాము కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరుపుతామని, పశ్చిమ బెంగాల్ సర్కారుతో ఈ అంశంపై మాట్లాడే ప్రసక్తే లేదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కరాఖండిగా తేల్చి చెప్పింది. జీజేఎం చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా డార్జిలింగ్ పర్వతప్రాంతంలో ఆదివారం తొమ్మిది రోజూ బంద్ కొనసాగింది. ‘ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం మా న్యాయమైన డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు సాగిస్తాం. ఈ అంశంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో మాట్లాడే ప్రసక్తే లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈ అంశంతో ఎలాంటి సంబంధం లేదు’ అని జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ ఆదివారం మీడియాతో అన్నారు. డార్జిలింగ్ ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా పొందేందుకు కేంద్రంతో జీజేఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బంద్‌కు ఒకరోజు విరామం ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 13-14 నుంచి ‘జనతా కర్ఫ్యూ’ ప్రారంభించనున్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధించిన 72 గంటల గడువు ఆమె ఆదేశం కాదని, కోర్టు ఆదేశమని అన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండానే ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగిస్తామని, ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతారని చెప్పారు. ఒకవైపు డార్జిలింగ్‌లో నిరవధిక బంద్ కొనసాగుతుండగా, మరోవైపు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. జీజేఎం కోర్ కమిటీ సభ్యుడు శేఖర్ శర్మను శనివారం రాత్రి కుర్సియాంగ్లో పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌లు ఆపకుంటే కఠిన చర్యలు: గొగోయ్ గువాహటి: ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లతో అస్సాంలో బంద్‌లు కొనసాగిస్తున్న నిరసనకారులు బంద్ ఆపాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ హెచ్చరించారు. త్రిపురలోనూ ‘ప్రత్యేక’ డిమాండ్: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తెరపైకి వచ్చింది. గిరిజన ప్రాంతాలను కలుపుతూ త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలిని (టీటీఏఏడీసీ) ఏర్పాటు చేయాలని ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీటీఎఫ్) డిమాండ్ చేసింది. అయితే, త్రిపురలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. -
డార్జిలింగ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
డార్జిలింగ్/గువాహటి/న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించిన దరిమిలా గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్ పర్వతప్రాంతంలో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) పిలుపు మేరకు కొనసాగుతున్న నిరవధిక బంద్ బుధవారం ఐదోరోజుకు చేరుకుంది. డార్జిలింగ్, కలింపాంగ్, మిరిక్, సుఖిపొక్రీ, కుర్సియాంగ్ తదితర పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. కేంద్రం నుంచి చేరుకున్న ఐదు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు ఈ ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఒకవైపు బంద్ కొనసాగుతుండగా, మరోవైపు పోలీసులు పాత కేసులకు సంబంధించి అరెస్టులు సాగిస్తున్నారు. జీజేఎంలోని గూర్ఖాలాండ్ పర్సనల్ (జీఎల్పీ) విభాగానికి చెందిన 32 మందిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 143కు చేరుకుంది. డార్జిలింగ్ ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్ హోంశాఖ కార్యదర్శి బాసుదేవ్ బెనర్జీకి ఉద్యమకారుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ఉద్యమకారులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన సమీపంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆయన కాలినడకనే వెళ్లాల్సి వచ్చింది. కర్బీ-ఆంగ్లాంగ్‌లో కర్ఫ్యూ సడలింపు అస్సాంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లాలో బుధవారం కర్ఫ్యూను సడలించారు. కర్బీ-ఆంగ్లాంగ్, బోడోలాండ్, కామ్తాపూర్ రా ష్ట్రాల డిమాండుతో అస్సాంలో వివిధ సంస్థ లు, పార్టీల నేతృత్వంలో రెండు రోజులు కొనసాగిన బంద్‌లు బుధవారం ముగిశా యి. మరోవైపు బోడో నాయకులు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌ను కలుసుకుని, తమ డిమాండ్‌ను వినిపించారు. తమ డిమాండు పై ఉన్నతస్థాయిలో చర్చించనున్నట్లు ప్ర ధాని హామీఇచ్చారని చెప్పారు. ఈ అంశం పై బాధ్యతలను హోంమంత్రి షిండేకు అప్పగించనున్నట్లు చెప్పారన్నారు.