బెంగాల్ విభజన జరగదు: మమత
పశ్చిమ బెంగాల్ విభజన జరగబోదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. డార్జిలింగ్ కొండల్లో నిర్వహిస్తున్న నిరవధిక బంద్ను ఉపసంహరించుకోవాలని గుర్కా జనముక్తి మోర్చా(జీజేఎం)ను మరోసారి కోరారు. జీటీఏకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ను ఎన్నుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జీజేఎంకు అన్నివిధాలా సహకరిస్తామని మమత హామీయిచ్చారు.
జీటీఏకు ద్వారా భూములు పంపిణీ చేశామని, వైద్యం- విద్య అందించామని, వంద రోజుల ఉపాధి కల్పన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గుర్కాలాండ్ పేరు మీదే ఇవన్నీ చేస్తున్నామని ఇంకా ఏం కావాలని ఆమె ప్రశ్నించారు. రాష్టం విడిపోయే పరిస్థితి లేదని మమత బెనర్జీ స్పష్టం చేశారు. బంద్ పేరుతో డార్జిలింగ్లో అభివృద్ధి కార్యక్రమాలను జీజేఎం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. రోగులను తరలిస్తున్న వాహనాలకు కూడా నిప్పు పెడుతున్నారని ఆమె విమర్శించారు.