గతాన్ని గుర్తు చేస్తున్న మమత
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్ల వామపక్షాల పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ ప్రజలు వామపక్షాలను గుర్తుచేసుకునేలా చేస్తున్నారు. సుదీర్ఘకంగా రాష్ట్రాలన్ని పాలించిన వామపక్షాల హయాంలో రానురాను అభివద్ధి కుంటుపడినప్పటికీ రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండేవని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో హిందు, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగి, ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతుండగా, ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం డార్జిలింగ్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది.
ప్రత్యేక రాష్ట్రం కోసం గూర్ఖాలాండ్ ప్రజలు నిరవధిక సమ్మెను ప్రారంభించి శుక్రవారం నాటికి సరిగ్గా 30 రోజులయ్యాయి. డార్జిలింగ్ రైల్వే భద్రతా దళం కార్యాలయాన్ని, పోలీసు పోస్ట్‌ను, రాష్ట్ర ప్రభుత్వ గ్రంధాలయాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఇంటర్నెట్ సర్వీసులు మూగపోయి దాదాపు 27 రోజులు గడిచాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ముస్లింలను మెప్పించేందుకు మమతా బెనర్జీ తీసుకుంటున్న చర్యలతో మండిపడుతున్న హిందూ శక్తులు రాష్ట్రంలో మత ఘర్షణలను మరింత రెచ్చగొట్టేందుకు కాచుకు కూర్చున్నాయి. తప్పుడు వార్తలకు ప్రచారం కల్పిస్తున్నాయి.
ముస్లింలకు సాధికారికత కల్పించేందుకు కాకుండా, కేవలం వారిని మెప్పించేందుకే మమతా బెనర్జీ చర్యలు తీసుకుంటుడాన్ని ఇప్పటికే కలకత్తా హైకోర్టు మూడుసార్లు మందలించినప్పటికీ ఆమె వైఖరిలో మార్పు రావడం లేదు. సమాజంలో వెనకబడిన ముస్లింలకు సాధికారికత కల్పించాలంటే విద్యా, ఉద్యోగావకాశాల్లో వారికి రిజర్వేషన్ల లాంటివి కల్పించాలి. కానీ మసీదుల్లో పనిచేసే ముల్లాలకు జీతభత్యాలు ఇవ్వడమంటే ముస్లింలను మంచి చేసుకోవడానికి మాత్రమేనని సామాజిక శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎదగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో 1990 నాటికి చల్లబడిన గూర్ఖాలాండ్ ఉద్యమాన్ని మమతా బెనర్జీ అనవసరంగా తట్టిలేపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే భాషా విధానం ఉండాలంటూ సర్క్యులర్ జారీ చేయడం ద్వారా నేపాల్ భాష మాట్లాడే గూర్ఖాలను రెచ్చగొట్టారు. 29 శాతం ముస్లింలతో కలిపి 40 శాతం ఓటర్లు తనపక్కనున్నారని భావిస్తున్న మమతా బెనర్జీ పది శాతం కూడా లేని గూర్ఖాలను (12 లక్షల మంది) పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లున్నారు.
గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను సానుభూతితో పరిశీలిస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ మొత్తం బెంగాల్ రాష్ట్రం మీదకన్నేసి గూర్ఖాలాండ్‌పై శీతకన్నేసింది.