రణరంగంగా డార్జిలింగ్
► ఆందోళనల్లో ఒకరి మృతి...
► బెంగాల్ సమైక్యత కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం: మమత
డార్జిలింగ్/కోల్‌కతా: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో 10 రోజులుగా జరుగుతున్న గొడవలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. డార్జిలింగ్‌లోని సింగమారిలో పోలీసులు, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించారు.జూన్ 8న ఘర్షణలు మొదలైన తర్వాత నమోదైన తొలి మరణం ఇది. లెబోంగ్‌కార్ట్ రోడ్, చౌక్ బజార్, ఘుమ్ ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. 35 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
ఇండియా రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్‌బీ)కి చెందిన అధికారి కిరణ్ తమంగ్ సహా మొత్తం 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఏడుగురు జీజేఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆందోళనలపై మమత కోల్‌కతాలో మాట్లాడుతూ ‘ఇది ఎన్నో రోజుల క్రితమే పన్నిన కుట్ర. ఒక్క రోజులో ఇన్ని బాంబులు, ఆయుధాలను ఆందోళనకారులు సమకూర్చుకోలేరు. వారి వెనుక ఈశాన్య ప్రాంతంలోని కొన్ని తిరుగుబాటు వర్గాలు, విదేశాలు ఉన్నాయి. నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం కానీ బెంగాల్‌ను విడదీయనివ్వను’ అని అన్నారు.
పోలీసులపైకి పెట్రోల్ బాంబులు, రాళ్లు
ఉద్యమం కారణంగా సింగమారిసహా డార్జిలింగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. సింగమారిలో శనివారం జీజేఎం కార్యకర్తలు త్రివర్ణపతాకం, వారి పార్టీ జెండాలను పట్టుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని వెళ్లిపోవాలని కోరారు. అందుకు నిరాకరించిన జీజేఎం కార్యకర్తలు.. సిబ్బందిపై పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి, లాఠీ చార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.