డార్జిలింగ్ రగులుతోంది..
డార్జిలింగ్: ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్ కావాలనే డిమాండ్‌తో ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగడంతో డార్జిలింగ్ అట్టుడుకుతోంది. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో గుర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక బంద్ శనివారం ఆరో రోజుకు చేరింది.
శుక్రవారం రాత్రి జీజేఎం ఎమ్మెల్యే అమర్ రాయ్ కుమారుడు విక్రమ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో డార్జిలింగ్‌లో జీజేఎం మద్దతుదారులు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడ్డారు. బిజోన్‌బరిలో ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కార్యాలయానికి నిప్పుపెట్టారు. జీజేఎం మద్దతుదారులు పోలీసులపై రాళ్లు, బాటిల్స్ విసరడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణలో ఆందోళనకారులతో పాటు పోలీసులు సైతం గాయపడ్డారు.
మరోవైపు జీజేఎం అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమాంగ్.. తన ఇంటిపై శుక్రవారం రాత్రి పోలీసులు, తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణకు బెంగాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు రూట్ మర్చ్‌లు నిర్వహించాయి.