
సాక్షి, డార్జిలింగ్ : ప్రత్యేక గూర్ఖాలాండ్ పోరాటంలో ఇకపై ఉద్యమాలు, సమ్మెలు, హర్తాల్ వంటివి చేయమని గూర్ఖా జనముక్తి మోర్చా ఆదివారం ప్రకటించింది. మూడు నెలలుగా డార్జిలింగ్‌లో నిర్వహిస్తున్న సమ్మె, బంద్‌ల వల్ల ఎటువంటి ఫలితం రాకపోవడంతో.. ఇకపై పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించినట్లు జీజేఎం నేత బిన్నీ తమాంగ్ ప్రకటించారు. బంద్‌ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం మినహా సాధించేదేమీ లేదని చెప్పారు. దీపావళి తరువాత ఆరు ప్రాంతాల్లో ప్రజా సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమానికి ఇతర రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు.