GJM
-
నా రాజకీయ అనుభవమంత లేదు నీ వయసు.. నాపైనే నిఘా పెడతాడా..?
‘‘నా రాజకీయ అనుభవమంత లేదు ఇతని వయసు.. అలాంటిది నాపైనే నిఘా పెడతాడా..? నేను ఎవరితో మాట్లాడుతున్నా.. ఏం చేస్తున్నా..? అని ఆరాలు తీస్తాడా..?’’ ఓ టీడీపీ నాయకుడి ఆగ్రహం. ‘‘అన్నా.. నీ ఒక్కడిపైనే కాదు.. నేనేదో ఆయన నుంచి డబ్బులు ఆశిస్తున్నట్లు నన్నూ అనుమానిస్తున్నాడు..! నన్ను జనం ఎప్పుడో మర్చిపోయారని నా వాళ్లతోనే వ్యాఖ్యానిస్తున్నాడు..! ఇక గమ్ముగా ఉంటే లాభం లేదు. మనమేంటో చూపిస్తే కానీ, అతడికి అసలు సంగతి అర్థం కాదు’’ మరో నేత మనో వేదన.. ఇవి చిత్తూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు (జీజేఎం)పై సొంత పార్టీకి చెందిన వారు ఓ నాయకుడి ఇంట్లో నిర్వహించిన రహస్య సమావేశంలో మాట్లాడుకున్న మాటలు అని ప్రచారం సాగుతోంది..? పార్టీలోని సీనియర్లను, మాజీలను జీజేఎం నమ్మడం లేదా..? ఇది గ్రహించిన అసమ్మతీయులు ఇటీవల ఓ సీనియర్ నాయకుడి ఇంట్లో సమావేశమయ్యారా..? తమను లెక్కచేయని వ్యక్తికి తగిన గుణపాఠం నేర్పాలని కంకణం కట్టుకున్నారా..? ఈ ప్రశ్నలకు జీజేఎం అనుచరులు అవుననే సమాధానం చెబుతున్నారు. రాజకీయాలకు దూరమై ఏళ్లు గడిచిపోయిన మాజీ నేతలను జీజేఎం పక్కకు పెట్టేసినట్టు తెలుస్తోంది. వీళ్ల పనితీరుపై తాను తెప్పించుకున్న సర్వే నివేదికలే ఇందుకు కారణమని సమాచారం. ఈ విషయం పసిగట్టిన అసమ్మతివర్గం పక్కనే నమ్మకంగా ఉంటూ నట్టేట్లో ముంచాలని తీర్మానించినట్లు తెలిసింది. చిత్తూరు అర్బన్ : చిత్తూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రజల కోసం సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధైర్యంగా ఉన్నారు. కానీ టీడీపీలో పరిస్థితి అలాకాదు. ఎవరో, ఏమిటో తెలియకుండా ఎవరెవరినో తీసుకొచ్చి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదే దారిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు కప్పుకుంటే.. ఈ పార్టీ పొత్తుపెట్టుకున్న జనసేనలో సిట్టింగ్ ఎమ్మెల్యే చేరిపోయారు. పైగా ఎమ్మెల్సీ, మేయర్‌తో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులు అనుభవించిన సీనియర్లు తన వెంటే ఉంటూ గెలుపునకు కృషి చేస్తారని ఇన్నాళ్లు జీజేఎం వీళ్లపై నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు తన నీడను తప్ప ఎవ్వరినీ నమ్మే పరిస్థితిలో లేడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు, పార్టీలోకి వచ్చే ప్రతీ ఒక్కరికీ పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పాలని తనపై ఒత్తిడి తెస్తున్నట్లు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తనతో పాటు ఉన్న నేతల సత్తా ఏమిటో తెలుసుకోవాలని వాళ్లను చూసి ఓట్లేసేవాళ్లు ఎంత మంది ఉన్నారు..? ఎన్నిచోట్ల ప్రభావితం చేస్తారు..? అసలు ఆ నేతలతో పాటు వచ్చే అనుచరగణం ఎంత..? లాంటి విషయాలు తెలుసుకోవడానికి కూడానే ఉంటున్న పలువురి నుంచి విషయాలు రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. జనసైనికుల లొల్లి ఇదికాదన్నట్లు జనసేన పార్టీ నేతలు సైతం చిత్తూరులో తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జీజేఎంకు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. జనసేనలోని ఓ వ్యక్తిని రెబల్‌గా నామినేషన్ వేయించనున్నట్లు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ నాయకులు పోస్టులు పెడుతున్నారు. ఇది కూడా చిల్లర కోసమేనంటూ జీజేఎం గుర్తించాడు. వీళ్లతో పాటు కమలంలోని వ్యక్తులతో పెద్దగా ఉపయోగంలేదని తన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కేలవం తన నుంచి వచ్చినకాడికి నోట్లు రాల్చుకుందామనే ప్రతీ ఒక్కరూ క్యూ కడుతున్నారని టీడీపీ అభ్యర్థి నిర్దారణకు వచ్చినట్లు సమాచారం. పక్కనే ఉంటూ.. రైలు.. పట్టాలు ఎక్కకున్నా, రాజకీయ నాయకుడు జనం మధ్య లేకుండా గ్యాప్ తీసుకున్నా మరచిపోవడం మామూలే. ఒక్కసారి మరచిపోయిన వ్యక్తిని మళ్లీ జనం నమ్మే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం జీజేఎం తన సొంత పార్టీ నేతలపై నిఘా ఉంచి తెప్పించుకున్న సారాంశం ఇదేనని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీలోని పలువురు సీనియర్లు చిత్తూరు నగరంలోని ఓ ప్రధాన నాయకుడి ఇంట్లో రెండు రోజుల క్రితం సమావేశమయినట్లు తెలిసింది. ఈ మీటింగ్‌కు తన అనుచరులను పంపిన జీజేఎం పూర్తి సమాచారం తెలుసుకున్నట్లు సదరు నేతలు కనిపెట్టేశారు. తమపైనే నిఘా పెట్టడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. టికెట్ కోసం చివరి నిముషం వరకు ప్రయత్నించి, పార్టీ అధిష్టానం మొండిచేయి చూపినా భరించి అభ్యర్థి వెంట నడుస్తుంటే తమపైనే నిఘా పెట్టడం ఎంత వరకు న్యాయమని ఆవేదన వెళ్లగక్కినట్లు సమాచారం. ఇలా ప్రతి ఒక్కరినీ అనుమానించే వ్యక్తికి వెనకే ఉంటూ వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో చూపించాలని పచ్చ పెద్దలంతా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఓ ఆసక్తికర అంశం ఏంటంటే.. అసమ్మతి నేతల రహస్య సమావేశంలో చర్చించిన పలు విషయాలను సైతం జీజేఎం తెప్పించుకున్నట్లు తెలిసింది. తనతోనే ఉంటూ వెన్నుపోటు పొడవాలని చూస్తున్న సొంత పార్టీ నేతలను గుర్తించి, వారిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు జీజేఎం ఎన్నికల ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొంటున్న నేతలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు..? ఎవర్ని కలుస్తున్నారో తెలుసుకోవడానికి జీతాలు ఇచ్చి మరి ఓ బృందాన్ని నియమించినట్లు తెలుస్తోంది. చిత్తూరులో పార్టీ ఏమైనా పర్లేదు.. తమ ఉనికికి ప్రమాదం రాకుండా చూసుకోవడానికి ఎవ్వరికై నా వెన్నుపోటు పొడవడానికి అలవాట్టు పడ్డ పెద్దల కత్తులు ఈసారి జీజేఎంను లక్ష్యంగా చేసుకున్నాయి. విషయం తెలిసి కూడా సొంతపార్టీలోని అనుకూల శత్రువులతో వేదికలు పంచుకుంటున్న అభ్యర్థి పైకి నవ్వుతూ కనిపిస్తున్నా.. తాను నమ్మే ఓ యువ నాయకుడి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం
సాక్షి, డార్జిలింగ్ : ప్రత్యేక గూర్ఖాలాండ్ పోరాటంలో ఇకపై ఉద్యమాలు, సమ్మెలు, హర్తాల్ వంటివి చేయమని గూర్ఖా జనముక్తి మోర్చా ఆదివారం ప్రకటించింది. మూడు నెలలుగా డార్జిలింగ్‌లో నిర్వహిస్తున్న సమ్మె, బంద్‌ల వల్ల ఎటువంటి ఫలితం రాకపోవడంతో.. ఇకపై పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించినట్లు జీజేఎం నేత బిన్నీ తమాంగ్ ప్రకటించారు. బంద్‌ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం మినహా సాధించేదేమీ లేదని చెప్పారు. దీపావళి తరువాత ఆరు ప్రాంతాల్లో ప్రజా సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమానికి ఇతర రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు. -
రగులుతున్న గూర్ఖాలాండ్
డార్జిలింగ్: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నినాదంతో డార్జిలింగ్‌లో చెలరేగిన హింస కలింపోంగ్కు పాకింది. డార్జి లింగ్లో ఆదివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు. కలిం పోంగ్లో ఆందోళనకారులు ఓ గ్రంథా లయం, రెండు పంచాయతీ కార్యాలయాలు, ఓ పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. అయితే ఇది తమ పని కాదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) పేర్కొంది. డార్జిలింగ్‌లోని సింగమారిలో ఘర్షణల్లో శనివారం చనిపోయిన ఇద్దరు కార్యకర్తల మృతదేహాలతో జీజేఎం ఆది వారం నిరసన ర్యాలీ చేపట్టింది. సమస్య ను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళనకారులకు సూచించారు. -
రణరంగంగా డార్జిలింగ్
► ఆందోళనల్లో ఒకరి మృతి... ► బెంగాల్ సమైక్యత కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం: మమత డార్జిలింగ్/కోల్‌కతా: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో 10 రోజులుగా జరుగుతున్న గొడవలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. డార్జిలింగ్‌లోని సింగమారిలో పోలీసులు, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించారు.జూన్ 8న ఘర్షణలు మొదలైన తర్వాత నమోదైన తొలి మరణం ఇది. లెబోంగ్కార్ట్ రోడ్, చౌక్ బజార్, ఘుమ్ ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. 35 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇండియా రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బీ)కి చెందిన అధికారి కిరణ్ తమంగ్ సహా మొత్తం 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఏడుగురు జీజేఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆందోళనలపై మమత కోల్‌కతాలో మాట్లాడుతూ ‘ఇది ఎన్నో రోజుల క్రితమే పన్నిన కుట్ర. ఒక్క రోజులో ఇన్ని బాంబులు, ఆయుధాలను ఆందోళనకారులు సమకూర్చుకోలేరు. వారి వెనుక ఈశాన్య ప్రాంతంలోని కొన్ని తిరుగుబాటు వర్గాలు, విదేశాలు ఉన్నాయి. నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం కానీ బెంగాల్‌ను విడదీయనివ్వను’ అని అన్నారు. పోలీసులపైకి పెట్రోల్ బాంబులు, రాళ్లు ఉద్యమం కారణంగా సింగమారిసహా డార్జిలింగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. సింగమారిలో శనివారం జీజేఎం కార్యకర్తలు త్రివర్ణపతాకం, వారి పార్టీ జెండాలను పట్టుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని వెళ్లిపోవాలని కోరారు. అందుకు నిరాకరించిన జీజేఎం కార్యకర్తలు.. సిబ్బందిపై పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి, లాఠీ చార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. -
డార్జిలింగ్ రగులుతోంది..
డార్జిలింగ్: ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్ కావాలనే డిమాండ్‌తో ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగడంతో డార్జిలింగ్ అట్టుడుకుతోంది. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో గుర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక బంద్ శనివారం ఆరో రోజుకు చేరింది. శుక్రవారం రాత్రి జీజేఎం ఎమ్మెల్యే అమర్ రాయ్ కుమారుడు విక్రమ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో డార్జిలింగ్‌లో జీజేఎం మద్దతుదారులు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడ్డారు. బిజోన్బరిలో ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి నిప్పుపెట్టారు. జీజేఎం మద్దతుదారులు పోలీసులపై రాళ్లు, బాటిల్స్ విసరడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణలో ఆందోళనకారులతో పాటు పోలీసులు సైతం గాయపడ్డారు. మరోవైపు జీజేఎం అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమాంగ్.. తన ఇంటిపై శుక్రవారం రాత్రి పోలీసులు, తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణకు బెంగాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు రూట్ మర్చ్లు నిర్వహించాయి. -
బంద్ హింసాత్మకం
డార్జిలింగ్‌లో పోలీసులపైకి పెట్రోల్ బాంబులు విసిరిన ఆందోళనకారులు డార్జిలింగ్/కోల్‌కతా: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాల బంద్ నాలుగోరోజైన గురువారం హింసాత్మకంగా మారింది. ఓ మీడియా సంస్థకు చెందిన కారును ఆందోళనకారులు తగులబెట్టారు. పోలీసులపైకి పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు. కాల్పులు కూడా జరిపారని ఐజీ చెప్పారు. ప్రతిగా పోలీసులు కూడా రాళ్లు రువ్వారు. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. బాష్పవాయువును ప్రయోగించారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు బిమల్ గురుంగ్‌కు చెందిన ప్రదేశాల్లో సోదాలు చేసిన పోలీసులు దాదాపు 300 దాకా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విల్లులు, బాణాలు, పేలుడు పదార్థాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం మరో 400 మంది పారామిలిటరీ సిబ్బందిని డార్జిలింగ్‌కు పంపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్) పార్టీ మంగళవారం పొత్తును తెంచుకుని జీజేఎంతో చేతులు కలపడం తెలిసిందే. డార్జిలింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ అహ్లూవాలియాతోపాటుగా జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతిని కాపాడాలని రాజ్‌నాథ్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. ‘డార్జిలింగ్‌లోని ప్రస్తుత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. భారీ సంఖ్యలో పోలీసు దళాలను ఉపయోగించి మమ్మల్ని అణచివేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఆయుధాలన్నీ సంప్రదాయంగా మేం వాడుతున్నవి. ’ అని రోషన్ గిరి అన్నారు. హింసను అడ్డుకుంటాం: మమత డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో ఉద్యమం పేరుతో చెలరేగుతున్న హింసను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో అన్నారు. డార్జిలింగ్‌లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందనీ, ప్రజల పనులకు ఆటంకం కలిగించి రాజకీయాలు చేయాలని చూస్తే ఉపేక్షించబోమని జీజేఎంను ఉద్దేశించి ఆమె హెచ్చరించారు. మమత మాట్లాడుతూ ‘పర్వతాల్లో ఒకప్పుడు శాంతి నెలకొని ఉండేది. కొందరు నాయకులు గూండాగిరీ చేస్తున్నారు. బాంబులు, తుపాకులతో ఎవరూ రాజకీయాలు చేయలేరు’ అని అన్నారు. -
గూర్ఖాల్యాండ్ ఉద్యమం ఉధృతం
డార్జిలింగ్: గూర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చేపట్టిన ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వ, గూర్ఖాల్యాండ్ ప్రాదేశిక పరిపాలనా కార్యలయాలను నిరవధికంగా మూసివేయిస్తూ జూన్ 12 నుంచి జీజేఎం డార్జి్జలింగ్లో బంద్ చేపట్టింది. తాజాగా అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్) ఆ పార్టీతో సంబంధాలను తెంచుకుని జీజేఎంతో చేతులు కలిపింది. పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 600 మంది పారామిలిటరీ సిబ్బందిని మంగళవారమే డార్జి్జలింగ్కు పంపింది. -
గూర్ఖాలాండ్ కూడా ఏర్పాటు చేయండి : జీజేఎం
తెలంగాణ ప్రజలకు అభినందనలు కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ఏకపక్ష నిర్ణయంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లే పశ్చిమ బెంగాల్‌ను విడదీసి గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని జీజేఎం (గూర్ఖా జన్ముక్తి మోర్చా) అధినేత బిమల్ గురుంగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం గడిచిన కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నామని, దేశంలో అత్యంత పురాతన ఉద్యమం తమదేనని చెప్పారు. విభజన కోసం రాష్ట్రాల అంగీకారం అక్కర్లేదనే విషయం మంగళవారం నాటి తెలంగాణ బిల్లు ఆమోదం ద్వారా స్పష్టమైందని, ఈ విషయాన్ని తాము కొన్నేళ్లుగా అనేక వేదికలపై నొక్కి చెప్పామన్నారు. కాబట్టి బెంగాల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కన పెట్టి గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ఫేస్బుక్లో విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. -
గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టం: జీజేఎం
డార్జిలింగ్: చర్చల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నా, గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టబోమని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) అధ్యక్షుడు బిమల్ గురుంగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సర్కారు సంతకం చేసిన గూర్ఖా ప్రాంతీయ ప్రాధికార సంస్థ చట్టంలో గూర్ఖాలాండ్ డిమాండ్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయన ఆదివారంలో తన వ్యాఖ్యలను ‘ఫేస్బుక్’లో పోస్ట్ చేశారు. కేంద్రం తెలంగాణ డిమాండ్‌ను ఆమోదించినప్పుడు, తామెందుకు తమ డిమాండ్‌ను వదులుకోవాలని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై కేంద్రంతో చర్చలు జరిపేందుకు తమ పార్టీ ప్రతినిధులు డిసెంబర్ 21న ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోను, తెరాయి, దూవార్ ప్రాంతా ల్లో ఎలాంటి బంద్‌లు ఉండబోవన్నారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో శాంతి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునివ్వడంపై స్పందిస్తూ, ఈ ప్రాంతంలో తానేమీ హింసాకాండను కోరుకోవడం లేదన్నారు. -
ప్రత్యేక గూర్ఖాలాండ్నూ ఏర్పాటు చేయాలి: జీజేఎం
డార్జిలింగ్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో, ప్రత్యేక గుర్ఖాలాండ్ను కూడా ఏర్పాటు చేయాలని గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) అధినేత బిమల్ గురుంగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్లో స్పందించారు. గూర్ఖాలాండ్ ఏర్పాటు దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఢిల్లీలో ఈ నెల 23న జరగనున్న త్రైపాక్షిక చర్చల్లో సానుకూల నిర్ణయం వెలువడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని, అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు.