బంద్ హింసాత్మకం
డార్జిలింగ్‌లో పోలీసులపైకి పెట్రోల్ బాంబులు విసిరిన ఆందోళనకారులు
డార్జిలింగ్/కోల్‌కతా: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాల బంద్ నాలుగోరోజైన గురువారం హింసాత్మకంగా మారింది. ఓ మీడియా సంస్థకు చెందిన కారును ఆందోళనకారులు తగులబెట్టారు. పోలీసులపైకి పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు. కాల్పులు కూడా జరిపారని ఐజీ చెప్పారు. ప్రతిగా పోలీసులు కూడా రాళ్లు రువ్వారు. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. బాష్పవాయువును ప్రయోగించారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు బిమల్ గురుంగ్‌కు చెందిన ప్రదేశాల్లో సోదాలు చేసిన పోలీసులు దాదాపు 300 దాకా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
విల్లులు, బాణాలు, పేలుడు పదార్థాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం మరో 400 మంది పారామిలిటరీ సిబ్బందిని డార్జిలింగ్‌కు పంపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్‌ఎల్‌ఎఫ్) పార్టీ మంగళవారం పొత్తును తెంచుకుని జీజేఎంతో చేతులు కలపడం తెలిసిందే. డార్జిలింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ అహ్లూవాలియాతోపాటుగా జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతిని కాపాడాలని రాజ్‌నాథ్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. ‘డార్జిలింగ్‌లోని ప్రస్తుత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. భారీ సంఖ్యలో పోలీసు దళాలను ఉపయోగించి మమ్మల్ని అణచివేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఆయుధాలన్నీ సంప్రదాయంగా మేం వాడుతున్నవి. ’ అని రోషన్ గిరి అన్నారు.
హింసను అడ్డుకుంటాం: మమత
డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో ఉద్యమం పేరుతో చెలరేగుతున్న హింసను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో అన్నారు. డార్జిలింగ్‌లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందనీ, ప్రజల పనులకు ఆటంకం కలిగించి రాజకీయాలు చేయాలని చూస్తే ఉపేక్షించబోమని జీజేఎంను ఉద్దేశించి ఆమె హెచ్చరించారు. మమత మాట్లాడుతూ ‘పర్వతాల్లో ఒకప్పుడు శాంతి నెలకొని ఉండేది. కొందరు నాయకులు గూండాగిరీ చేస్తున్నారు. బాంబులు, తుపాకులతో ఎవరూ రాజకీయాలు చేయలేరు’ అని అన్నారు.