పురాణ కథలు, వేదాలు సరళమైన భాషలో..
వేదిక్ సైన్స్, హెర్బాలజీలు పుస్తకాలుగా..
బొమ్మరిల్లు సైతం కొత్త రూపంలో తెస్తున్న వేదిక్ స్కూల్..
సాక్షి, సిటీబ్యూరో: నిద్రలేమి నుంచి నిలకడ లేమి దాకా ఆధునిక సమస్యలన్నింటికీ సనాతనం సమాధానం చెప్పింది అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్ వేదిక్ స్కూల్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. విక్రమ్‌రాజు.. కఠినమైన గణితం నుంచీ సంక్లిష్ట మానవ సంబంధాల దాకా విడమరిచి చెప్పాయనే పురాణాలను, శాస్త్రాలను స్తుతిస్తారు. ఆధునికులకు వాటిని అందించడం అంటే సమస్యల నుంచి విముక్తి కల్పించడమే అంటున్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా తాను 2017లో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి కృషి చేసి సులభంగా అర్థమయ్యే రీతిలో వందలాది పుస్తకాలను, మెటీరియల్‌ను రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూపొందిన ఈ పుస్తకాలు వచ్చే నెల్లో పాఠశాలలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచుకున్నారిలా...
దశావతారాన్ని మించిన మానవ పరిణామక్రమ సిద్ధాంతం లేదు. దీని ఆధారంగా మానవ పరిణామ క్రమానికి సంబంధించి 50 థియరీల పుస్తకంతో సహా విభిన్న కేటగిరీల్లో 150 బుక్స్ రూపొందించాం. ఆన్‌లైన్‌లో ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్‌లో 25 రకాల ప్రీ రికార్డెడ్ కోర్సులు తెలుగులో ఉండగా, కొన్ని ఇంగ్లిష్‌లో ఉన్నాయి. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు.
‘చిరు’నవ్వుల యోగం..
ఆరేళ్ల చిన్నారికి ఎలాంటి యోగా నేర్పాలి? ఎవరికీ తెలియని పరిస్థితిలో 1 నుంచి 10వ తరగతి దాకా ఉపయోగపడేలా యోగా, చక్రాస్, ముద్రాస్, ధ్యాన విశేషాలతో బుక్స్ తయారు చేశాం.
వేదం.. నిత్యజీవన నాదం..
వేదాలు, పురాణాలను సరిగా అర్థం చేసుకుంటే నిత్య జీవితంలో ఎన్నో చిక్కుముళ్లు విడిపోతాయి. అయితే నేటి చిన్నారులకు ఇవేవీ అందుబాటులో లేవు. అందుకే రుగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం వంటివన్నీ అర్థమయ్యే రీతిలో అందిస్తున్నాం.
మన గణితం.. ఘన చరితం..
ప్రస్తుత ఇంగ్లిష్, మ్యాథ్స్ రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళితే.. వేదిక్ మ్యాథ్స్‌లో లెఫ్ట్ నుంచి రైట్‌కి చేస్తాం. ఒక నిమిషం çపట్టే గణిత సమస్యను, వేదిక్ మ్యాథ్స్ వల్ల ఒక సెకనులోనే చేసేయవచ్చు. అందుకే క్లాస్–1 నుంచి క్లాస్–8 వరకూ ఈ కోర్సు మెటీరియల్ తయారు చేయించాం.
పురాణం.. ఆభరణం..
మొత్తం 18 పురాణాలు క్లుప్తీకరించి ఒక్కొక్కటి 100 పేజీల చొప్పున చేయించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహాభారతం కథ దశరథుడితో ప్రారంభమైతే, మేం అంతకన్నా ముందున్న బ్రహ్మ నుంచి స్టార్ట్ చేశాం. అలాగే రాముడు 81వ రాజు ఆయన కన్నా ముందున్న గొప్ప రాజుల గురించి కూడా ఇచ్చాం. మహాభారతంలో కౌరవ పాండవుల భాగం కన్నా ముందున్న కథని కూడా కలిపి అందిస్తున్నాం
మెటీ‘రియల్’ వర్క్ మొదలైంది..
పలు ప్రైవేటు పాఠశాలలతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ ఈ మెటీరియల్ అందుబాటులోకి తేవాలని ప్రయతి్నస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చాం. ఇవి చదివిన వారికి పరీక్ష నిర్వహించి పొట్టి శ్రీరాములు వర్సిటీ వారి సర్టిఫికెట్ అందిస్తున్నాం. చిన్నారులకు యోగా నేర్పేందుకు సెట్విన్‌తో కూడా ఒప్పందం చేసుకున్నాం.
సహకరిస్తే.. సాధిస్తాం..
ప్రభుత్వం స్పందించి సహకారం అందిస్తే దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో భారీగా వేదిక్ స్కూల్ క్యాంపస్ పెడదాం అనుకుంటున్నాం. సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు ప్రతి రోజూ 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకూ యోగా, వేదిక్ మ్యాథ్స్, వేదిక్ సైన్సెస్.. భారతీయ సంప్రదాయ నృత్యాలు, క్రీడలు, వేదాలు ఒకే క్యాంపస్‌లో నేర్చుకుంటే భావితరం దృక్పథం చాలావరకూ మారిపోతుంది. కనీసం 100 మంది నిరుపేద చిన్నారులకు ఉచిత ఆశ్రయమిచ్చి ఆ తర్వాత వారినే అక్కడ టీచర్లుగా తయారు చేయాలి.. ఇలాంటి ఆలోచనలతో మా ఫౌండేషన్ పనిచేస్తోంది.
బొమ్మరిల్లు.. కొత్తగా..
మన చిన్నప్పుడు బొమ్మరిల్లు ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. మేం గత 2012లో బొమ్మరిల్లు పబ్లికేషన్స్‌ను సొంతం చేసుకున్నాం. ఆ కథల రీతిలో నైతిక విలువలు జొప్పించిన పురాణేతిహాసాల్లోని కథలను సంక్షిప్తంగా అందిస్తున్నాం. అలాగే ముఖ్యమైన దేవతలు 50 మంది గురించి సింప్లిఫై చేసి 100 పేజీల్లో రాయించాం.
Comments
Please login to add a commentAdd a comment