Vedic Education
-
Dr Vikram Raju: సనాతనమే.. సమాధానం!
సాక్షి, సిటీబ్యూరో: నిద్రలేమి నుంచి నిలకడ లేమి దాకా ఆధునిక సమస్యలన్నింటికీ సనాతనం సమాధానం చెప్పింది అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్ వేదిక్ స్కూల్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. విక్రమ్‌రాజు.. కఠినమైన గణితం నుంచీ సంక్లిష్ట మానవ సంబంధాల దాకా విడమరిచి చెప్పాయనే పురాణాలను, శాస్త్రాలను స్తుతిస్తారు. ఆధునికులకు వాటిని అందించడం అంటే సమస్యల నుంచి విముక్తి కల్పించడమే అంటున్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా తాను 2017లో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి కృషి చేసి సులభంగా అర్థమయ్యే రీతిలో వందలాది పుస్తకాలను, మెటీరియల్‌ను రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూపొందిన ఈ పుస్తకాలు వచ్చే నెల్లో పాఠశాలలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచుకున్నారిలా...దశావతారాన్ని మించిన మానవ పరిణామక్రమ సిద్ధాంతం లేదు. దీని ఆధారంగా మానవ పరిణామ క్రమానికి సంబంధించి 50 థియరీల పుస్తకంతో సహా విభిన్న కేటగిరీల్లో 150 బుక్స్ రూపొందించాం. ఆన్లైన్లో ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్‌లో 25 రకాల ప్రీ రికార్డెడ్ కోర్సులు తెలుగులో ఉండగా, కొన్ని ఇంగ్లిష్‌లో ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు.‘చిరు’నవ్వుల యోగం..ఆరేళ్ల చిన్నారికి ఎలాంటి యోగా నేర్పాలి? ఎవరికీ తెలియని పరిస్థితిలో 1 నుంచి 10వ తరగతి దాకా ఉపయోగపడేలా యోగా, చక్రాస్, ముద్రాస్, ధ్యాన విశేషాలతో బుక్స్ తయారు చేశాం.వేదం.. నిత్యజీవన నాదం..వేదాలు, పురాణాలను సరిగా అర్థం చేసుకుంటే నిత్య జీవితంలో ఎన్నో చిక్కుముళ్లు విడిపోతాయి. అయితే నేటి చిన్నారులకు ఇవేవీ అందుబాటులో లేవు. అందుకే రుగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం వంటివన్నీ అర్థమయ్యే రీతిలో అందిస్తున్నాం.మన గణితం.. ఘన చరితం..ప్రస్తుత ఇంగ్లిష్, మ్యాథ్స్ రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళితే.. వేదిక్ మ్యాథ్స్‌లో లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తాం. ఒక నిమిషం çపట్టే గణిత సమస్యను, వేదిక్ మ్యాథ్స్ వల్ల ఒక సెకనులోనే చేసేయవచ్చు. అందుకే క్లాస్–1 నుంచి క్లాస్–8 వరకూ ఈ కోర్సు మెటీరియల్ తయారు చేయించాం.పురాణం.. ఆభరణం.. మొత్తం 18 పురాణాలు క్లుప్తీకరించి ఒక్కొక్కటి 100 పేజీల చొప్పున చేయించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహాభారతం కథ దశరథుడితో ప్రారంభమైతే, మేం అంతకన్నా ముందున్న బ్రహ్మ నుంచి స్టార్ట్ చేశాం. అలాగే రాముడు 81వ రాజు ఆయన కన్నా ముందున్న గొప్ప రాజుల గురించి కూడా ఇచ్చాం. మహాభారతంలో కౌరవ పాండవుల భాగం కన్నా ముందున్న కథని కూడా కలిపి అందిస్తున్నాంమెటీ‘రియల్’ వర్క్ మొదలైంది..పలు ప్రైవేటు పాఠశాలలతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ ఈ మెటీరియల్ అందుబాటులోకి తేవాలని ప్రయతి్నస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చాం. ఇవి చదివిన వారికి పరీక్ష నిర్వహించి పొట్టి శ్రీరాములు వర్సిటీ వారి సర్టిఫికెట్ అందిస్తున్నాం. చిన్నారులకు యోగా నేర్పేందుకు సెట్విన్‌తో కూడా ఒప్పందం చేసుకున్నాం.సహకరిస్తే.. సాధిస్తాం.. ప్రభుత్వం స్పందించి సహకారం అందిస్తే దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో భారీగా వేదిక్ స్కూల్ క్యాంపస్ పెడదాం అనుకుంటున్నాం. సీబీఎస్ఈ సిలబస్‌తో పాటు ప్రతి రోజూ 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకూ యోగా, వేదిక్ మ్యాథ్స్, వేదిక్ సైన్సెస్.. భారతీయ సంప్రదాయ నృత్యాలు, క్రీడలు, వేదాలు ఒకే క్యాంపస్‌లో నేర్చుకుంటే భావితరం దృక్పథం చాలావరకూ మారిపోతుంది. కనీసం 100 మంది నిరుపేద చిన్నారులకు ఉచిత ఆశ్రయమిచ్చి ఆ తర్వాత వారినే అక్కడ టీచర్లుగా తయారు చేయాలి.. ఇలాంటి ఆలోచనలతో మా ఫౌండేషన్ పనిచేస్తోంది.బొమ్మరిల్లు.. కొత్తగా..మన చిన్నప్పుడు బొమ్మరిల్లు ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. మేం గత 2012లో బొమ్మరిల్లు పబ్లికేషన్స్‌ను సొంతం చేసుకున్నాం. ఆ కథల రీతిలో నైతిక విలువలు జొప్పించిన పురాణేతిహాసాల్లోని కథలను సంక్షిప్తంగా అందిస్తున్నాం. అలాగే ముఖ్యమైన దేవతలు 50 మంది గురించి సింప్లిఫై చేసి 100 పేజీల్లో రాయించాం. -
రాందేవ్ బాబా సేవలు ప్రశంసనీయం: అమిత్ షా
హరిద్వార్: భారతీయ వేద విద్య, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించేందుకు రాందేవ్ బాబా చేస్తున్న కృషి ప్రశంసనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొనియాడారు. హరిద్వార్‌లోని యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ సన్యాస్ దీక్షా మహోత్సవం సందర్భంగా ఆయన పతంజలి యూనివర్సిటీ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ‘‘గడిచిన పాతికేళ్లలో యోగ, ఆయుర్వేద, స్వదేశీ పరిశ్రమకు రాందేవ్ బాబా గణనీయమైన సేవలు అందించారు. ఇప్పుడు అదే స్పూర్తితో విద్యా రంగంపై దృష్టి సారించారు. రానున్న రోజుల్లో పతంజలి గ్రూప్ దేశాభివృద్ధికి ఎంతోగానూ తోడ్పడుతుంది’’ అని అన్నారు. పతంజలి యూనివర్సిటీ, భారతీయ శిక్షా బోర్డు ద్వారా ప్రాచీన విద్యను నేటి తరానికి అందించి ఉత్తమ సమాజ స్థాపనకు తమ వంతు కృషి చేస్తామని రాందేవ్ బాబా తెలిపారు. -
ఉన్నతస్థితికొచ్చి అండగా ఉంటారనుకున్నాం
గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి: వేద విద్యలో ఉన్నతస్థాయికి చేరి తమకు అండగా ఉంటారనుకున్న తమ పిల్లలను.. విగతజీవులుగా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బోరున విలపించిన తీరు అక్కడి వారి హృదయాలను బరువెక్కించింది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చి అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలలో విద్యనార్జిస్తున్న విద్యార్థుల్లో సంధ్యావందనం కోసం కృష్ణానదిలో స్నానమాచరించేందుకు ఉపక్రమించిన ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన విషయం విదితమే. ఆ విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో శనివారం వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు.. ప్రత్యేక అంబులెన్స్‌ను దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నితీష్ దీక్షిత్ తండ్రి వీరేంద్రదీక్షిత్, శుభం త్రివేదీ తండ్రి అనిల్ త్రివేది, హర్షిత్శుక్లా తండ్రి రామ్‌శంకర్ శుక్లా, అన్షుమాన్ బాబాయి ఆవదేశ్ శుక్లాలు జీజీహెచ్ మార్చురీకి వచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శివకుమార్ శర్మ మృతదేహానికి తండ్రి లక్ష్మీప్రసాద్ శర్మ గుంటూరు శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు, తల్లిదండ్రుల ప్రయాణ ఖర్చుల కింద శాఖ తరఫున రూ.1.25 లక్షలు అందజేసినట్లు వెల్లడించారు. కాగా, మృతుల తల్లిదండ్రులంతా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్నకారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు, నిరుపేద బ్రాహ్మణులే. ప్రభుత్వ అండ: మంత్రి వెలంపల్లి వేద పాఠశాల విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో దేవదాయధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని తెలిపారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకుని సహాయసహకారాలు అందించాలని ఆదేశించారని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మృతదేహాలకు నివాళులర్పించారు. ఘటన దురదృష్టకరం: స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పెందుర్తి: ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం తనను తీవ్రంగా కలచివేసిందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి పీఠం తరపున రూ.50 వేల చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పీఠం ప్రతినిధులు డాక్టర్ వెంకటరమణ, సతీష్‌శర్మ నగదు అందజేశారు. -
శారదాపీఠంలో ఉచిత వేద విద్య
పెందుర్తి: దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థికభారంతో, పోషణకు ఇబ్బందులు పడుతున్న వేద పాఠశాలల్లోని విద్యార్థులు, గురువులను విశాఖ శ్రీ శారదాపీఠం దత్తత తీసుకోనున్నట్లు ఉత్తర పీఠాధిపతి బాలస్వామి తెలిపారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిజీ ఆశీస్సులతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న వారిని చినముషిడివాడలోని పీఠానికి తరలించి ఇక్కడి వేద పాఠశాలలో శిక్షణతో పాటు వసతి కల్పిస్తామన్నారు. వీరికి వేద విద్య (రుగ్వేదం, యజుర్వేదం)తో పాటు స్మార్థము, ధర్మశాస్త్రాలు, ఆగమశాస్త్రాలు, సంస్కృత పరిజ్ఞానం అందించాలని సంకల్పించామన్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శారదాపీఠం తరపున ఉత్తీర్ణత ధ్రువపత్రం, రూ.లక్ష ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించారు. శారదాపీఠంలో పదేళ్ల క్రితం జగద్గురువులు శంకరాచార్య వేద పాఠశాలను స్థాపించి ఎందరికో విద్యాబుద్ధులు చెప్పారన్నారు. వేద పాఠశాలలో చేరే ఆసక్తి గలవారు విశాఖ శ్రీశారదాపీఠం, చినముషిడివాడ, విశాఖపట్నం–530051 అడ్రస్‌కు, లేదా 94403 93333, 93485 55595, 99666 69658 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
వేద సంరక్షణ
మానవజాతికి వేదాలు వెలలేని నిధి. అవి మానవజాతి కర్తవ్య పాలనను మాత్రమే కాదు మోక్షసాధన మార్గాలను కూడా సూచించాయి. ఈనాటికీ మానవజాతికి సకల విధాల ఉపయోగపడగల వేదాలను సంరక్షించడం మన కర్తవ్యం, బాధ్యత. నిరంతర శిక్షణ, సాధన, బోధనవంటి మార్గాల్లో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒకప్పుడు వేదాలు గురుకులాల్లో బోధించేవారు. నేర్చుకునేవారి లోనూ, నేర్పేవారిలోనూ కూడా అంకితభావం ఉం డేది. అక్కడ ఉండే గురుశిష్య సంబంధం అలాంటి అంకితభావాన్ని కలగజేసేది. ఈనాటికీ ఆ తరహా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ వారి సంఖ్య అరుదుగా ఉంటున్నది. చక్కని వేద విద్య అధ్యయనం చేసిన అధ్యాపకుల లేమి వలన వేద విద్యా విధానమే కుంటినడక నడుస్తున్నది. ఇది ఇలాగే మరికొంత కాలం కొనసాగితే మన వేదాలనూ, వాటి బోధనలనూ, సాధన లనూ మనం శాశ్వతంగా కోల్పోయే ప్రమా దం ఉన్నది. వేదాలను ఇలా చేజేతులా నాశనం చేసుకుంటే మానవజాతికి మిగి లేది వినాశనమే. దూరమైపోతున్న వేదాలను మనందరి దగ్గరకు చేర్చి, వాటిని సంరక్షించే మహత్తర కార్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో వేద పాఠశాలలు నెలకొల్పుతు న్నది. ముఖ్యంగా ధర్మగిరిలో వేద పాఠశాల ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో నిర్మించారు. అక్కడ 650మంది విద్యార్థులతో, 20 మంది అధ్యాప కులతో వేద విద్యాబోధన చక్కగా సాగుతున్నది. నాలుగు వేదాలు, వేదాంగాలు, ఆగమాలు బోధిస్తు న్నారు. ఇది దేశంలోనే పెద్ద పాఠశాల. బహుశా మొదటి స్థానంలోనో, రెండో స్థానంలోనో ఉంటుంది. వేద పాఠశాలల అభివృద్ధికి భవిష్య త్తులో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ధార్మిక విధివిధానాలు, ప్రస్తుత సాధనా విధానాలు, వేదాల సంరక్షణకు తీసుకునే చర్యల్లో ఏర్పడే అడ్డంకులు, వాటిని అధిగమించే మార్గాలు వగైరా అంశాలను ఈ కమిటీ పరిశీలించింది. మన రాష్ట్రంలోనూ, పొరుగునున్న కర్ణాటకలోనూ సమర్థవంతంగా నడుస్తున్న శృంగేరీ వేదపాఠశాల, శ్రీశ్రీ రవిశంకర్ గురుకులం, పరాశర గురుకులం, హైదరాబాద్ లోని వేద భవనం వగైరాలను ఈ కమిటీలో భాగస్వామిగా నేను కూడా పరిశీలించాను. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇ-లైబ్రరీ, దూరవిద్యవంటి పద్ధతుల ద్వారా వేద విద్యను వ్యాపింపజేయడానికి అవసరమైన మార్గా లను ఇండియా హెరిటేజ్ గ్రూపువారి సమావేశంలో చర్చించాము. అందులో అనేక విలువైన సూచనలు కూడా వచ్చాయి. వేదాధ్యయనంపై ఆసక్తి ఉన్నవారె వరైనా తాము ఉన్నచోటునుంచే ఇలాంటి మాధ్య మాల ద్వారా వేద విద్యను అధ్యయనం చేయవచ్చు. ఈ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కివచ్చి భారతీయ సంస్కృతి వైభవం మళ్లీ వెలుగులీనేలా చేయడానికి తోడ్పడితే అంతకన్నా కావలసిందేముంటుంది? టీటీడీ పాఠశాలల నుంచి వెలుపలకు వచ్చే విద్యార్థు లు అత్యున్నత మానవ విలువలను, మత పరమైన విలువలను పాటించి ధార్మిక మార్గంలో నడు స్తారు. ఈ పాఠశాలలు అందుకవసరమైన మార్గద ర్శకత్వాన్ని అందిస్తున్నాయి. దేశానికి చక్కటి వర్తమానాన్ని, ఉజ్వల భవిష్యత్తును అందజేసే ఈ మహత్తర కార్యం విజయవంతం కావాలని కోరుకుందాం. - సౌందర్‌రాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు