మృతదేహాలను పరిశీలిస్తున్న మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యేలు విష్ణు, ముస్తాఫా, మేయర్ తదితరులు
గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి: వేద విద్యలో ఉన్నతస్థాయికి చేరి తమకు అండగా ఉంటారనుకున్న తమ పిల్లలను.. విగతజీవులుగా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బోరున విలపించిన తీరు అక్కడి వారి హృదయాలను బరువెక్కించింది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చి అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలలో విద్యనార్జిస్తున్న విద్యార్థుల్లో సంధ్యావందనం కోసం కృష్ణానదిలో స్నానమాచరించేందుకు ఉపక్రమించిన ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన విషయం విదితమే.
ఆ విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో శనివారం వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు.. ప్రత్యేక అంబులెన్స్‌ను దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నితీష్ దీక్షిత్ తండ్రి వీరేంద్రదీక్షిత్, శుభం త్రివేదీ తండ్రి అనిల్ త్రివేది, హర్షిత్‌శుక్లా తండ్రి రామ్‌శంకర్ శుక్లా, అన్షుమాన్ బాబాయి ఆవదేశ్ శుక్లాలు జీజీహెచ్ మార్చురీకి వచ్చారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన శివకుమార్ శర్మ మృతదేహానికి తండ్రి లక్ష్మీప్రసాద్ శర్మ గుంటూరు శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు, తల్లిదండ్రుల ప్రయాణ ఖర్చుల కింద శాఖ తరఫున రూ.1.25 లక్షలు అందజేసినట్లు వెల్లడించారు. కాగా, మృతుల తల్లిదండ్రులంతా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్నకారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు, నిరుపేద బ్రాహ్మణులే.
ప్రభుత్వ అండ: మంత్రి వెలంపల్లి
వేద పాఠశాల విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో దేవదాయధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని తెలిపారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకుని సహాయసహకారాలు అందించాలని ఆదేశించారని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మృతదేహాలకు నివాళులర్పించారు.
ఘటన దురదృష్టకరం: స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ
పెందుర్తి: ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం తనను తీవ్రంగా కలచివేసిందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి పీఠం తరపున రూ.50 వేల చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పీఠం ప్రతినిధులు డాక్టర్ వెంకటరమణ, సతీష్‌శర్మ నగదు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment