Vedic School
-
ఉన్నతస్థితికొచ్చి అండగా ఉంటారనుకున్నాం
గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి: వేద విద్యలో ఉన్నతస్థాయికి చేరి తమకు అండగా ఉంటారనుకున్న తమ పిల్లలను.. విగతజీవులుగా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బోరున విలపించిన తీరు అక్కడి వారి హృదయాలను బరువెక్కించింది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చి అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలలో విద్యనార్జిస్తున్న విద్యార్థుల్లో సంధ్యావందనం కోసం కృష్ణానదిలో స్నానమాచరించేందుకు ఉపక్రమించిన ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన విషయం విదితమే. ఆ విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో శనివారం వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు.. ప్రత్యేక అంబులెన్స్‌ను దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నితీష్ దీక్షిత్ తండ్రి వీరేంద్రదీక్షిత్, శుభం త్రివేదీ తండ్రి అనిల్ త్రివేది, హర్షిత్శుక్లా తండ్రి రామ్‌శంకర్ శుక్లా, అన్షుమాన్ బాబాయి ఆవదేశ్ శుక్లాలు జీజీహెచ్ మార్చురీకి వచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శివకుమార్ శర్మ మృతదేహానికి తండ్రి లక్ష్మీప్రసాద్ శర్మ గుంటూరు శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు, తల్లిదండ్రుల ప్రయాణ ఖర్చుల కింద శాఖ తరఫున రూ.1.25 లక్షలు అందజేసినట్లు వెల్లడించారు. కాగా, మృతుల తల్లిదండ్రులంతా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్నకారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు, నిరుపేద బ్రాహ్మణులే. ప్రభుత్వ అండ: మంత్రి వెలంపల్లి వేద పాఠశాల విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో దేవదాయధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని తెలిపారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకుని సహాయసహకారాలు అందించాలని ఆదేశించారని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మృతదేహాలకు నివాళులర్పించారు. ఘటన దురదృష్టకరం: స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పెందుర్తి: ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం తనను తీవ్రంగా కలచివేసిందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి పీఠం తరపున రూ.50 వేల చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పీఠం ప్రతినిధులు డాక్టర్ వెంకటరమణ, సతీష్‌శర్మ నగదు అందజేశారు. -
తిరుపతిలో అత్యాధునిక చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
తిరుమల/తిరుపతి ఎడ్యుకేషన్(చిత్తూరు జిల్లా): తిరుపతిలో అత్యాధునిక వసతులతో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ముంబైకి చెందిన దాత, ఉద్వేగ్ ఇన్¯Œఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రయివేట్ లిమిటెడ్(యూ.ఐ.సీ) సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె.సింగ్ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో దీనిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, సంజయ్ కె.సింగ్‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ చిన్న పిల్లలకు అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో చిన్న పిల్లల ఆస్పత్రులు నిర్మించాలని సీఎం వైఎస్ జగ¯న్మోహన్రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించిందన్నారు. ఈవో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న ఈ ఆస్పత్రి స్విమ్స్‌కు అనుబంధంగా పని చేస్తుందని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం కరోనా సోకిన వేద పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ లేదని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలను ఆయన తనిఖీ చేయడంతో పాటు, స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమల వేద పాఠశాల విద్యార్థులు, అధ్యాపకుడిని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలిసి ఆయన పరామర్శించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
నమస్కార సంస్కారం నేర్పిన కరోనా
షేక్ హ్యాండ్ ఇవ్వడం రాకపోతే చిన్నచూపు చూసిన ఆధునిక లోకం.. అదే షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఛీ కొట్టే స్థితికి వచ్చింది. కషాయం అంటే కడుపులో తిప్పుతుందన్న నోటితోనే వాటిని ఇష్టంగా తాగేలా చేసింది. కరోనా కారణంగా మన ఆచార వ్యవహారాలు, ఆరోగ్యమార్గాల విలువ నవతరానికి మాత్రమే కాదు ప్రపంచానికీ తెలిసింది. ఈ నేపథ్యంలో నగరవాసి వీటిని భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అమెరికాలో ఉద్యోగం వదులుకుని వచ్చి వాటిని పాఠ్యాంశాలుగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి, హైదరాబాద్: ‘మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ఒక మతానికి పరిమితం చేయడం సరైంది కాదు. అవెంత అవసరమో.. వాటిని పాటించడం అంటే మానవాళికి ఎంత మేలు కలుగుతుందో కరోనా తెలియజెప్పింది. ఇప్పుడు వాటిని భావితరాలకు అందించడమే నా లక్ష్యం’ అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్ వేదిక్ ఫౌండేషన్ నిర్వాహకులు విక్రమ్ రాజు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, అక్కడే చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదులుకుని నగరానికి వచ్చిన ఆయనకు భారతీయ ఆచార వ్యవహారాలంటే చాలా మక్కువ. వేదాలు, ఉపనిషత్తులు, యోగా, ఆయుర్వేదం గురించి తెలుసుకున్నారు. వాటిని పాఠ్యాంశాలుగా మారుస్తున్నారు. ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే. సరళీకరణ ఓ నిర్విరామ ప్రక్రియ.. మనవైన వేదాలు రోజురోజుకూ మనకి దూరమవకుండా ఉండేందుకు మనకన్నా మన ముందు తరం వారే తగిన శ్రద్ధ వహించారు. కాలానుగుణంగా వాటిని సింప్లిఫై చేస్తూ వచ్చారు. తొలిదశలో వేదాలు అందరూ చదివగలిగేవారు. తర్వాత ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, తర్వాత దశలో పండుగలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు సంప్రదాయంగా పండుగలు ఆచరించేవారు కూడా లేరు కాబట్టి.. వాటిని భావితరాలకు ఉపకరించేలా మరింత సింప్లిఫై చేసి పాఠాల రూపంలో అందించాల్సి ఉంది. నాటి బాటే.. నేటి పాఠమై.. వేద పాఠశాలు చాలా ఉన్నా.. యోగా, ముద్ర, చక్రాస్, మెడిటేషన్‌లపై దేశంలో ఎవరి దగ్గరా సరైన విద్యా మెటీరియల్ లేదని నాకు అవగతమైంది. లాక్డౌన్ సమయంలో లభించిన వెసులుబాటుతో దాదాపు 25ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నవారితో కలిసి ఒక కర్రిక్యులం తయారు చేశా. అలాగే దాదాపు 2వేల పేజీలు ఉండే గరుణ పురాణంలోని ముఖ్యమైనదంతా కలిపి 100 పేజీల్లో కుదించి.. 18 పురాణాలూ చేయిస్తున్నాను. మనకు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఒక్కో దేవత గురించి 2 పేజీల్లో పొందుపరచి పుస్తకాలు తెస్తున్నాం. ఈ కర్రిక్యులంని రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు, కళాశాలలకు అందుబాటులోకి తేవాలనేది ప్రయత్నం. ఆయుర్వేదం సహా 150 నుంచి 200 పేజీలలో వేదాల పుస్తకాలు తెస్తున్నాం. వేదగణితం.. కాల్క్యులేటర్కి సమానం.. మన వేదిక్ మ్యాథ్స్ చాలా సింప్లిఫైడ్.. ఈ వేద గణితం నేర్చుకున్నవారు కాల్క్యులేటర్తో సమానంగా లెక్కించగలరు అంటే నమ్మాలి. క్లాస్ 1 నుంచి క్లాస్ 10దాకా వేదిక్ సైన్స్‌తో పాటు వేదాలు, నాలుగు వేదాలు ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలపై కూడా పూర్తిస్థాయి సబ్జెక్టు తయారు చేశా. ఇవన్నీ రెగ్యులర్ సిలబస్‌తో పాటు అందించాలంటే.. వ్యక్తిగతంగా ఆసక్తి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే సరిపడా స్థలం ఇస్తే ఇండియన్ వేదిక్ స్కూల్ నెలకొల్పాలని ఉంది. చిన్ననాటి నుంచే నేర్పాలి... డార్విన్ ఎవల్యూషన్ థియరీ చదువుతాం. కానీ అది ఎప్పుడో మనం దశావతారాల పేరిట మన పెద్దవాళ్లు చెప్పారనేది పిల్లలకి తెలియాలి. అలాగే మొత్తం సోలార్ సిస్టమ్ గురించి, గెలాక్సీ గురించి పురుష సూక్తంలోని నాసదీయసూక్తంలో ఉందని తెలియజెప్పాలి. అవన్నీ ఎప్పుడో కాదు ప్రతి పిల్లాడికీ వేదాలు, ఉపనిషత్తు 5వ ఏట నుంచే ఇవి పాఠ్యాంశాలు కావాలి. ఆ ఉద్ధేశ్యంతోనే మొత్తం 50 థియరీల మీద కలిపి బుక్స్ చేయిస్తున్నాను. – విక్రమ్ రాజు, వేదిక్ ఫౌండేషన్ -
విద్యుదాఘాతంతో బిహార్ విద్యార్థి మృతి
శామీర్‌పేట: రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ షాక్‌తో ఓ విద్యార్థి మృతిచెందగా..మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలో ఉన్న గురుకుల వేద పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో ఉన్న ఓ సంపులో ఆదివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు స్నానానికి దిగారు. వీరిద్దరికి ప్రమాదవశాత్తూ కరెంటుషాక్ తగలడంతో నవీన్ (15) అనే విద్యార్థి మరణించగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. సంపునకు కరెంటు ఎలా సరఫరా అయిందనే విషయం తెలియరాలేదు. ప్రమాదానికి గురైన ఇద్దరు విద్యార్థులు బిహార్‌కు చెందినవారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేదమే జీవననాదం
వేదమే జీవననాదం వారికి. కాన్వెంటుల్లో చదువు ‘కొన’లేని వారు కొందరైతే, చతుర్వేదాలే చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి కలిగిస్తాయని వేద పాఠశాలలో చేరిన వారు మరికొందరు. ‘కుల వృత్తికి సాటి రావు గువ్వల చెన్న..’ అన్న పెద్దల మాటలే వేదంగా భావించి వేద పాఠశాలలో చేరినవారు మరికొందరు. వేదమంత్రాలను సుస్వరంతో వల్లె వేస్తూనే, ఇంగ్లిష్ పదాలతోనూ కుస్తీ పడుతున్నారు. ఆధునికతను అందిపుచ్చుకుంటూ కంప్యూటర్‌తో దోస్తీ చేస్తున్నారు. కీసరగుట్టలోని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర సంస్కృత వేద పాఠశాల తమ విద్యార్థులను ఎందులోనూ తీసిపోని రీతిలో తీర్చిదిద్దుతోంది. ఒకప్పుడు గురుకులాలు సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేవి. విద్యార్థులకు వేదవేదాంగాలు బోధించి ధర్మాన్ని నడిపే సారథులుగా తీర్చిదిద్దేవి. ఇప్పుడు కాలం మారింది. వేద విద్యార్థులు నేటి సమాజంలో బతకాలంటే ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అందుకే, ఈ కాలానికి తగినట్లుగా ఇక్కడి విద్యార్థులకు ప్రతిరోజూ ఇంగ్లిష్, కంప్యూటర్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటిలో పరీక్షలూ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఈ ట్రెండ్ పదేళ్ల కిందటే మొదలైంది. బ్రహ్మ ముహూర్తంతోనే దినచర్య బ్రహ్మ ముహూర్తం నుంచే వేద విద్యార్థుల దినచర్య మొదలవుతుంది. స్నానాదులు ముగించుకుని, ఉదయం ఆరు గంటలకల్లా మధుర స్వరంతో సుప్రభాతం ఆలపిస్తారు. ప్రాతఃకాల సంధ్యా వందనం ముగించుకుని అల్పాహారం తీసుకుంటారు. తొమ్మిది గంటలకు ప్రార్థనలో శ్రీ వేంకటేశ్వరుని అష్టోత్తరంతో కీర్తించి తరగతుల్లోకి వెళ్తారు. మధ్యాహ్నం వరకు గురువు చెప్పిన వేద మంత్రాలను వల్లె వేస్తారు. మాధ్యాహ్నిక సంధ్యావందనం ముగించుకుని భోజనం చేస్తారు. మధ్యాహ్నం తరగతుల్లో ఉదయం చెప్పిన మంత్రాలను ఆవృతం (పునశ్చరణ) చేసుకుంటారు. సాయం సంధ్యా వందనం.. రాత్రి సహస్రనామ అర్చనలో పాల్గొని ఆధ్యాత్మికతను సంతరించుకుంటారు. అనధ్యాయాలే సెలవుదినాలు సాధారణంగా విద్యార్థులకు ఆదివారాలు, రెండో శనివారాలు సెలవులు. వేద విద్యార్థులకు మాత్రం అనధ్యాయ దినాలైన పాఢ్యమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్యలే సెలవులు. ప్రతినెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే పాఢ్యమి, అష్టమి, పక్షానికొకటి వచ్చే అమావాస్య, పౌర్ణమి కలిపి నెలకు ఆరు రోజులు పాఠశాల ఉండదు. ఆ రోజుల్లో బట్టలు ఉతుక్కోవడం వంటి వ్యక్తిగత పనులు చూసుకుంటారు. పాత పాఠాలను కాసేపు పునశ్చరణ చేస్తారు. సెలవు రోజుల్లోనే కాదు, ప్రతిరోజూ సాయంత్రం 5-6 గంటల సమయంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలాడతారు. స్మార్త, ఆగమ, వేద విభాగాల్లో కోర్సులు ఐదో తరగతి పూర్తి చేసుకున్న వారు వేదపాఠశాలలో చేరడానికి అర్హులు. ఇక్కడి పాఠశాలలో వేద, స్మార్త, ఆగమ విభాగాలు ఉన్నాయి. స్మార్త, ఆగమ విద్యాభ్యాసానికి ఎనిమిదేళ్లు, వేదాధ్యయనానికి పదేళ్లు పడుతుంది. వేదం చదువుకున్న వారికి ఆలయాల్లో అర్చక ఉద్యోగాలు ఉంటాయి. స్మార్తంలో పట్టభద్రులైన వారు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగే షోడశ సంస్కారాలు (డోలారోహణం, కేశఖండనం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం వంటివి), వ్రతాలు, యజ్ఞ యాగాది క్రతువులు, కర్మకాండ వంటివి జరిపిస్తుంటారు. ఆగమ శాస్త్రాన్ని అభ్యసించిన వారు దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో నిష్ణాతులవుతారు. ఆలయ నిర్మాణం, వాస్తు, దేవుడికి జరిగే కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాల్లో వారి మాటే శిలాశాసనం. ఆదరణకు కొదవ లేదు వేద పాఠశాలలో చేరిన రోజునే వేద విభాగ విద్యార్థుల పేరిట రూ.3 లక్షలు, స్మార్త, ఆగమ విద్యార్థుల పేరిట రూ.లక్ష టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. విద్య పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ , టీటీడీ డాలర్ ప్రదానం చేస్తారు. డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకు ఆదరణ బాగానే ఉంటుంది. వేద పండితులు విదేశాల్లోనూ ’కొలువు‘దీరుతున్నారు. అక్కడి దేవాలయాల్లో ఇక్కడి నుంచి విద్యార్థులను తీసుకెళ్లి నియమించుకుంటున్నారు. కాలానికి తగినట్లుగా మార్పులతో విద్యార్థులు ముందుకెళ్తున్నారు. వేదం గొప్పతనం తెలిసింది : సుబ్రమణ్యం పోలీసు అవుదామనుకున్నా.. మా కుటుంబం బలవంతం మీదే వేద పాఠశాలలో చేరాను. ఇక్కడికొచ్చిన ఏడాదికే నా అభిప్రాయం తప్పని తెలిసింది. పోలీస్ ఉద్యోగంలోనైతే పరిమితమైన ప్రాంతానికే సేవ చే సే అవకాశముంటుంది. అదే వేద పండితుడిగా దైవానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే యావత్ సమాజానికి సేవ చేసినట్టే. వేదాల్లో మిగిలినవి కొన్ని మాత్రమే : దత్తు, తణుకు భాషలు, లిపులు అంతరించిపోతున్నట్లే, వేదాలు కూడా చాలావరకు అంతరించిపోతున్నాయి. అభ్యసించే వాళ్లే కాదు, బోధించేవాళ్లూ తగినంత మంది లేకపోవడమే దీనికి కారణం. రుగ్వేదంలో నిజానికి 21 శాఖలు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మిగిలినవి రెండే. యజుర్వేదంలో వంద శాఖలు ఉంటే, వాటిలోనూ రెండే మిగిలాయి. సామవేదంలో వెయ్యిశాఖలు ఉంటే, మూడే అందుబాటులో ఉన్నాయి. -
బ్రాహ్మణులకు మాత్రమే .....
నాగోలు: ‘బ్రాహ్మణులకు మాత్రమే ప్లాట్లు అమ్ముతాం. వృద్ధాశ్రమం, వేదపాఠశాల, గోశాల, ఆలయం కట్టిస్తాం. అందరూ బ్రాహ్మణులు ఉండే అగ్రహారం’ అని నమ్మించి లక్షలాదిరూపాయల డబ్బులు కట్టించుకుని ప్లాట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడో ఓ రియల్ వ్యాపారి. దీంతో బాధితులు శుక్రవారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం...ఎల్లాప్రగడ ప్రభాకర్‌శర్మ వేదగాయత్రి అగ్రహారం (రాఘవేంద్ర రియల్ఎస్టేట్) కార్యాలయాన్ని న్యూనాగోలుకాలనీ రోడ్‌నెం.2లో ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరి గ్రామం సర్వేనెం.698 నుంచి 713 వరకు సుమారు 30 ఎకరాల్లో ప్లాట్లను విక్రయించేందుకు వివిధ ఛానళ్లు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. ప్రభాకర్‌శర్మ మాటలు నమ్మిన పలువురు రూ.లక్షల్లో చెల్లించి వేదగాయత్రిలో స్థలాలను కొనుగోలు చేశారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఇళ్లను నిర్మించేందుకు సిద్ధం కావడంతో స్థానికులు వచ్చి ఆపేశారు. దాదాపు 30 ఎకరాల్లో 1700 మందికి ప్లాట్లు చేసి అమ్మాడు. ఇళ్లు కట్టించి రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదేమనడిగితే ప్రభాకర్‌శర్మ బెదిరిస్తున్నాడంటూ పలువురు బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.10లక్షల వరకు చెల్లించినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘పశ్చిమ’లో పాదం మోపనున్న ‘ప్రథమ పౌరుడు’
సాక్షి, ఏలూరు : దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 29న మన జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఆకివీడు మండలం అయిభీమవరంలో కొత్తగా నిర్మించిన వేద పాఠశాల భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వస్తున్నారంటేనే అధికారులకు కంటిమీద కునుకు ఉండదు. అలాంటిది దేశ ప్రథమ పౌరుడు జిల్లాలో పాదం మోపుతున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఏడాదిన్నర క్రితమే అయిభీమవరంలో టీటీడీ వేద పాఠశాలను ప్రారంభించింది. ఈ ఏడాది రెండో బ్యాచ్‌లో సుమారు 70 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ప్రస్తుతానికి టీటీడీకి చెందిన కల్యాణ మండపంలోనే పాఠశాల నడుస్తోంది. శాశ్వత పాఠశాల భవనం, విద్యార్థుల వసతి గృహాల నిర్మాణానికి గతేడాది రూ.3 కోట్లు మంజూరయ్యాయి. స్థానికులు స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. పాఠశాల భవనం నిర్మాణం పూర్తికాగా వసతి భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. పాఠశాల భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. కనుమూరి ఇంట్లో రాష్ట్రపతి విడిది రాష్ట్రపతి 29న ఉదయం 11 గంటలకు జిల్లాలో అడుగుపెట్టి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వెళతారని సమాచారం. భవనం ప్రారంభించడం ఒక్కటే ప్రస్తుతానికి ఖరారైన కార్యక్రమం. ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజు కొత్తగా నిర్మించి ఇటీవలే గృహప్రవేశం చేసిన భవంతిలో రాష్ట్రపతి విడిదికి ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. రూ. కోటి టీటీడీ నిధులతో నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని గతేడాది అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేత ప్రారంభింపచేయాలని కనుమూరి భావించారు. అయితే భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో సాధ్యపడలేదు. దీంతో ప్రస్తుత రాష్ట్రపతిని రప్పించి ప్రారంభోత్సవం చేయిస్తున్నారు. నాలుగు హెలికాప్టర్లు దిగేందుకు స్థలాన్వేషణ రాష్ట్రపతి ప్రత్యేక హెలికాప్టర్లో వస్తారు. ఆయన వెంట జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ) ఉంటారు. రాష్ట్రపతి ప్రయాణించే హెలికాఫ్టర్‌తో పాటు మూడు హెలికాప్టర్లు వెంట వచ్చే అవకాశం ఉంది. దీంతో హెలిప్యాడ్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది అధికారులకు పెద్ద సమస్యగా మారింది. గత నెల నుంచే హెలిప్యాడ్ స్థలాన్వేషణ మొదలుపెట్టిన అధికారులు ఆకివీడు ఛూట్ మెమోరియల్ హైస్కూల్, జెడ్పీ ఉన్నత పాఠశాల, దుంపగడప ప్రభుత్వ కళాశాల, గోదాము, లయన్స్ ఆడిటోరియం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. చివరికి అయిభీమవరం రోడ్డులోని ఆదర్శ హైస్కూల్ ఎదరుగా ఉన్న ఓ ప్రైవేట్ స్థలం అనువుగా ఉంటుందని గుర్తించారు. ఇక్కడ నాలుగు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయడంతో పాటు రహదారులు నిర్మించాలని భావిస్తున్నారు. రూ.10 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.