‘పశ్చిమ’లో పాదం మోపనున్న ‘ప్రథమ పౌరుడు’ | december 29th president pranab mukherjee coming to west godavari | Sakshi
Sakshi News home page

‘పశ్చిమ’లో పాదం మోపనున్న ‘ప్రథమ పౌరుడు’

Published Fri, Dec 20 2013 7:08 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

december 29th president pranab mukherjee coming to west godavari

 సాక్షి, ఏలూరు :
 దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 29న మన జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఆకివీడు మండలం అయిభీమవరంలో కొత్తగా నిర్మించిన వేద పాఠశాల భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వస్తున్నారంటేనే అధికారులకు కంటిమీద కునుకు ఉండదు. అలాంటిది దేశ ప్రథమ పౌరుడు జిల్లాలో పాదం మోపుతున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఏడాదిన్నర క్రితమే అయిభీమవరంలో టీటీడీ వేద పాఠశాలను ప్రారంభించింది. ఈ ఏడాది రెండో బ్యాచ్‌లో సుమారు 70 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ప్రస్తుతానికి టీటీడీకి చెందిన కల్యాణ మండపంలోనే పాఠశాల నడుస్తోంది. శాశ్వత పాఠశాల భవనం, విద్యార్థుల వసతి గృహాల నిర్మాణానికి గతేడాది రూ.3 కోట్లు మంజూరయ్యాయి. స్థానికులు స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. పాఠశాల భవనం నిర్మాణం పూర్తికాగా వసతి భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. పాఠశాల భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
 
 కనుమూరి ఇంట్లో రాష్ట్రపతి విడిది
 రాష్ట్రపతి 29న ఉదయం 11 గంటలకు జిల్లాలో అడుగుపెట్టి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వెళతారని సమాచారం. భవనం ప్రారంభించడం ఒక్కటే ప్రస్తుతానికి ఖరారైన కార్యక్రమం. ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజు కొత్తగా నిర్మించి ఇటీవలే గృహప్రవేశం చేసిన భవంతిలో రాష్ట్రపతి విడిదికి ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. రూ. కోటి టీటీడీ నిధులతో నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని గతేడాది అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేత ప్రారంభింపచేయాలని కనుమూరి భావించారు. అయితే భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో సాధ్యపడలేదు. దీంతో ప్రస్తుత రాష్ట్రపతిని రప్పించి ప్రారంభోత్సవం చేయిస్తున్నారు.
 
 నాలుగు హెలికాప్టర్లు దిగేందుకు స్థలాన్వేషణ
 రాష్ట్రపతి ప్రత్యేక హెలికాప్టర్‌లో వస్తారు. ఆయన వెంట జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్‌ఎస్‌జీ) ఉంటారు. రాష్ట్రపతి ప్రయాణించే హెలికాఫ్టర్‌తో పాటు   మూడు హెలికాప్టర్లు వెంట వచ్చే అవకాశం ఉంది. దీంతో హెలిప్యాడ్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది అధికారులకు పెద్ద సమస్యగా మారింది. గత నెల నుంచే హెలిప్యాడ్ స్థలాన్వేషణ మొదలుపెట్టిన అధికారులు ఆకివీడు ఛూట్ మెమోరియల్ హైస్కూల్, జెడ్పీ ఉన్నత పాఠశాల, దుంపగడప ప్రభుత్వ కళాశాల, గోదాము, లయన్స్ ఆడిటోరియం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. చివరికి అయిభీమవరం రోడ్డులోని ఆదర్శ హైస్కూల్ ఎదరుగా ఉన్న ఓ ప్రైవేట్ స్థలం అనువుగా ఉంటుందని గుర్తించారు. ఇక్కడ నాలుగు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు రహదారులు నిర్మించాలని భావిస్తున్నారు. రూ.10 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement