వేదమే జీవననాదం | life of vedic students | Sakshi
Sakshi News home page

వేదమే జీవననాదం

Published Mon, Jul 28 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

వేదమే జీవననాదం

వేదమే జీవననాదం

వేదమే జీవననాదం వారికి. కాన్వెంటుల్లో చదువు ‘కొన’లేని వారు కొందరైతే, చతుర్వేదాలే చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి కలిగిస్తాయని వేద పాఠశాలలో చేరిన వారు మరికొందరు. ‘కుల వృత్తికి సాటి రావు గువ్వల చెన్న..’ అన్న పెద్దల మాటలే వేదంగా భావించి వేద పాఠశాలలో చేరినవారు మరికొందరు.  వేదమంత్రాలను సుస్వరంతో వల్లె వేస్తూనే, ఇంగ్లిష్ పదాలతోనూ కుస్తీ పడుతున్నారు. ఆధునికతను అందిపుచ్చుకుంటూ కంప్యూటర్‌తో దోస్తీ చేస్తున్నారు. కీసరగుట్టలోని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర సంస్కృత వేద పాఠశాల తమ విద్యార్థులను ఎందులోనూ తీసిపోని రీతిలో తీర్చిదిద్దుతోంది.
 
ఒకప్పుడు గురుకులాలు సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేవి. విద్యార్థులకు వేదవేదాంగాలు బోధించి ధర్మాన్ని నడిపే సారథులుగా తీర్చిదిద్దేవి. ఇప్పుడు కాలం మారింది. వేద విద్యార్థులు నేటి సమాజంలో బతకాలంటే ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అందుకే, ఈ కాలానికి తగినట్లుగా ఇక్కడి విద్యార్థులకు ప్రతిరోజూ ఇంగ్లిష్, కంప్యూటర్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటిలో పరీక్షలూ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఈ ట్రెండ్ పదేళ్ల కిందటే మొదలైంది.
 
బ్రహ్మ ముహూర్తంతోనే దినచర్య
బ్రహ్మ ముహూర్తం నుంచే వేద విద్యార్థుల దినచర్య మొదలవుతుంది. స్నానాదులు ముగించుకుని, ఉదయం ఆరు గంటలకల్లా మధుర స్వరంతో సుప్రభాతం ఆలపిస్తారు. ప్రాతఃకాల సంధ్యా వందనం ముగించుకుని అల్పాహారం తీసుకుంటారు. తొమ్మిది గంటలకు ప్రార్థనలో శ్రీ వేంకటేశ్వరుని అష్టోత్తరంతో కీర్తించి తరగతుల్లోకి వెళ్తారు. మధ్యాహ్నం వరకు గురువు చెప్పిన వేద మంత్రాలను వల్లె వేస్తారు. మాధ్యాహ్నిక సంధ్యావందనం ముగించుకుని భోజనం చేస్తారు. మధ్యాహ్నం తరగతుల్లో ఉదయం చెప్పిన మంత్రాలను ఆవృతం (పునశ్చరణ) చేసుకుంటారు. సాయం సంధ్యా వందనం.. రాత్రి సహస్రనామ అర్చనలో పాల్గొని ఆధ్యాత్మికతను సంతరించుకుంటారు.
 
అనధ్యాయాలే సెలవుదినాలు
సాధారణంగా విద్యార్థులకు ఆదివారాలు, రెండో శనివారాలు సెలవులు. వేద విద్యార్థులకు మాత్రం అనధ్యాయ దినాలైన పాఢ్యమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్యలే సెలవులు. ప్రతినెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే పాఢ్యమి, అష్టమి, పక్షానికొకటి వచ్చే అమావాస్య, పౌర్ణమి కలిపి నెలకు ఆరు రోజులు పాఠశాల ఉండదు. ఆ రోజుల్లో బట్టలు ఉతుక్కోవడం వంటి వ్యక్తిగత పనులు చూసుకుంటారు. పాత పాఠాలను కాసేపు పునశ్చరణ చేస్తారు. సెలవు రోజుల్లోనే కాదు, ప్రతిరోజూ సాయంత్రం 5-6 గంటల సమయంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలాడతారు.
 
స్మార్త, ఆగమ, వేద విభాగాల్లో కోర్సులు
ఐదో తరగతి పూర్తి చేసుకున్న వారు వేదపాఠశాలలో చేరడానికి అర్హులు. ఇక్కడి పాఠశాలలో వేద, స్మార్త, ఆగమ విభాగాలు ఉన్నాయి. స్మార్త, ఆగమ విద్యాభ్యాసానికి ఎనిమిదేళ్లు, వేదాధ్యయనానికి పదేళ్లు పడుతుంది. వేదం చదువుకున్న వారికి ఆలయాల్లో అర్చక ఉద్యోగాలు ఉంటాయి. స్మార్తంలో పట్టభద్రులైన వారు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగే షోడశ సంస్కారాలు (డోలారోహణం, కేశఖండనం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం వంటివి), వ్రతాలు, యజ్ఞ యాగాది క్రతువులు, కర్మకాండ వంటివి జరిపిస్తుంటారు. ఆగమ శాస్త్రాన్ని అభ్యసించిన వారు దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో నిష్ణాతులవుతారు. ఆలయ నిర్మాణం, వాస్తు, దేవుడికి జరిగే కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాల్లో వారి మాటే శిలాశాసనం.
 
ఆదరణకు కొదవ లేదు
వేద పాఠశాలలో చేరిన రోజునే వేద విభాగ విద్యార్థుల పేరిట రూ.3 లక్షలు, స్మార్త, ఆగమ విద్యార్థుల పేరిట రూ.లక్ష టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. విద్య పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ , టీటీడీ డాలర్ ప్రదానం చేస్తారు. డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకు ఆదరణ బాగానే ఉంటుంది. వేద పండితులు విదేశాల్లోనూ ’కొలువు‘దీరుతున్నారు. అక్కడి దేవాలయాల్లో ఇక్కడి నుంచి విద్యార్థులను తీసుకెళ్లి నియమించుకుంటున్నారు. కాలానికి తగినట్లుగా మార్పులతో విద్యార్థులు ముందుకెళ్తున్నారు.
 
వేదం గొప్పతనం తెలిసింది : సుబ్రమణ్యం
పోలీసు అవుదామనుకున్నా.. మా కుటుంబం బలవంతం మీదే వేద పాఠశాలలో చేరాను. ఇక్కడికొచ్చిన ఏడాదికే నా అభిప్రాయం తప్పని తెలిసింది. పోలీస్ ఉద్యోగంలోనైతే పరిమితమైన ప్రాంతానికే సేవ చే సే అవకాశముంటుంది. అదే వేద పండితుడిగా దైవానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే యావత్ సమాజానికి సేవ చేసినట్టే.
 
వేదాల్లో మిగిలినవి కొన్ని మాత్రమే : దత్తు, తణుకు
భాషలు, లిపులు అంతరించిపోతున్నట్లే, వేదాలు కూడా చాలావరకు అంతరించిపోతున్నాయి. అభ్యసించే వాళ్లే కాదు, బోధించేవాళ్లూ తగినంత మంది లేకపోవడమే దీనికి కారణం. రుగ్వేదంలో నిజానికి 21 శాఖలు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మిగిలినవి రెండే. యజుర్వేదంలో వంద శాఖలు ఉంటే, వాటిలోనూ రెండే మిగిలాయి. సామవేదంలో వెయ్యిశాఖలు ఉంటే, మూడే అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement