swarupanandendra swamy
-
ఏపీ కేబినెట్ తీర్మానంపై స్వరూపానందేంద్ర సరస్వతి హర్షం
-
లక్ష చండీ మహాయజ్ఞం దేశానికి గర్వకారణం
సింహాచలం: భారత వైదిక చరిత్రలోనే కనీవినీ ఎరుగని లక్ష చండీ మహాయజ్ఞం కురుక్షేత్ర వేదికగా నిర్వహిస్తుండటం దేశానికి గర్వకారణమని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. విశాఖ శ్రీశారదాపీఠం పర్యవేక్షణలో హరియాణ రాష్ట్రం కురుక్షేత్రలోని గుంతీ ఆశ్రమంలో జరుగుతున్న లక్ష చండీ మహా యజ్ఞానికి శనివారం అనురాగ్ ఠాకూర్ సతీసమేతంగా హాజరయ్యారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ శంకరాచార్య సంప్రదాయ పీఠాల్లో గుర్తింపు పొందిన విశాఖ శ్రీశారదాపీఠం లక్ష చండీ మహాయజ్ఞాన్ని పర్యవేక్షిస్తుండటం, ఆ యజ్ఞంలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆదేశం ఉంటే తప్ప ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాదన్నారు. కాగా, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యజ్ఞభూమిలో శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన విశేషంగా నిర్వహించారు. 2,200 మంది బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో రుద్రం పఠించడంతో కురుక్షేత్ర ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగింది. అలాగే యజ్ఞం నిర్వహణలో భాగంగా 6,976 చండీ పారాయణ హోమాలు పండితులు నిర్వహించారు. గుంతీమాత, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
తిరుమలలో హనుమాన్ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ
-
తిరుమలలో హనుమాన్ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ
తిరుమల: ఆకాశగంగ సమీపంలోని హనుమాన్ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, శ్రీతులసీ పీర్ సేవాన్యాస్, చిత్రకూటం పద్మభూషణ్ శ్రీ రామభద్రాచార్య మహరాజ్, ఆయోధ్య, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్‌గిరీజీ మహారాజ్, వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కప్పగంతుల కోటేశ్వరశర్మ పాల్గొన్నారు. అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి మాట్లాడుతూ.. 'తిరుమల వేంకటేశ్వరస్వామి పాదాల చెంత హనుమాన్ జన్మ స్థలానికి భూమిపూజ జరిగింది. వేదాలకు పుట్టినిళ్లు ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ ఆస్థి. వేంకటేశ్వరస్వామి అనుగ్రహం అనుమతి లేనిదే ఏదీ జరగదు. అన్నమయ్య, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్కరించారు. అంజనాద్రే హనుమాన్ జన్మస్థలం అనేది సామాన్యమైన విషయం కాదు. అనేకమంది వేదపండితులు, శాస్త్ర పండితులు పరిశోధించి నిర్థారించారు' అని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి) టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమిపూజ చెయ్యడం గొప్ప కార్యక్రమం. ఆకాశగంగ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కోర్టులో దీనిపై స్టే వచ్చిందని అడిగారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఆలయంలో ఎలాంటి మార్పులు చెయ్యడం లేదు. భక్తులకి సౌకర్యమైన వసతులు ఏర్పాటు చేస్తాము. వివాదాల జోలికి మేము వెళ్లడం లేదు. సీఎం జగన్ హిందూ ధర్మ ప్రచారం పెద్దఎత్తున చెయ్యాలని ఆదేశించాడు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో 502 ఆలయాలు నిర్మిస్తున్నాము. వెనుకబడిన, బలహీన వర్గాలున్న ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం చేస్తున్నాము. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నాము. స్వామి ఆశీస్సులు, ఆజ్ఞతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
ఉన్నతస్థితికొచ్చి అండగా ఉంటారనుకున్నాం
గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి: వేద విద్యలో ఉన్నతస్థాయికి చేరి తమకు అండగా ఉంటారనుకున్న తమ పిల్లలను.. విగతజీవులుగా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బోరున విలపించిన తీరు అక్కడి వారి హృదయాలను బరువెక్కించింది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చి అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలలో విద్యనార్జిస్తున్న విద్యార్థుల్లో సంధ్యావందనం కోసం కృష్ణానదిలో స్నానమాచరించేందుకు ఉపక్రమించిన ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన విషయం విదితమే. ఆ విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో శనివారం వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు.. ప్రత్యేక అంబులెన్స్‌ను దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నితీష్ దీక్షిత్ తండ్రి వీరేంద్రదీక్షిత్, శుభం త్రివేదీ తండ్రి అనిల్ త్రివేది, హర్షిత్శుక్లా తండ్రి రామ్‌శంకర్ శుక్లా, అన్షుమాన్ బాబాయి ఆవదేశ్ శుక్లాలు జీజీహెచ్ మార్చురీకి వచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శివకుమార్ శర్మ మృతదేహానికి తండ్రి లక్ష్మీప్రసాద్ శర్మ గుంటూరు శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు, తల్లిదండ్రుల ప్రయాణ ఖర్చుల కింద శాఖ తరఫున రూ.1.25 లక్షలు అందజేసినట్లు వెల్లడించారు. కాగా, మృతుల తల్లిదండ్రులంతా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్నకారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు, నిరుపేద బ్రాహ్మణులే. ప్రభుత్వ అండ: మంత్రి వెలంపల్లి వేద పాఠశాల విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో దేవదాయధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని తెలిపారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకుని సహాయసహకారాలు అందించాలని ఆదేశించారని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మృతదేహాలకు నివాళులర్పించారు. ఘటన దురదృష్టకరం: స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పెందుర్తి: ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం తనను తీవ్రంగా కలచివేసిందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి పీఠం తరపున రూ.50 వేల చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పీఠం ప్రతినిధులు డాక్టర్ వెంకటరమణ, సతీష్‌శర్మ నగదు అందజేశారు. -
ఉచిత దర్శనాలను పునరుద్ధరించాలి: స్వరూపానందేంద్ర స్వామి
సాక్షి,అమరావతి/పెందుర్తి/తిరుమల: కోవిడ్ కారణంగా తిరుమలలో నిలిపివేసిన ఉచిత దర్శనాలను పునరుద్ధరించాలని శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తే ఇబ్బందులు ఉండవన్నారు. రుషికేష్‌లోని శ్రీ శారదాపీఠం శాఖలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు గురువారం కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారెడ్డిని స్వామీజీ అభినందించి ఆశీస్సులు అందజేశారు. స్వరూపానంద మాట్లాడుతూ..నిర్వీర్యం అవుతోన్న హిందూ ధర్మ ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించి నూతన పంథాలో హిందూ ధర్మ ప్రచారాన్ని నిర్వహించాలని వైవీ సుబ్బారెడ్డికి సూచించారు. నూతన ఆలయాల నిర్మాణంపై టీటీడీ శ్రద్ధ చూపుతున్నట్లే పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు కూడా టీటీడీ నడుంబిగించాలని కోరారు. దేవదాయశాఖ, టీటీడీ ధర్మ ప్రచారం కోసం చైతన్య రథాలను నూతనంగా రూపొందించాలన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ హయాంలో భజన బృందాలను ప్రోత్సహించినట్లే ఈ ప్రభుత్వం కూడా హిందూ ధర్మ ప్రచారానికి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. టీటీడీ నిర్వహణలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా భజన బృందాలకు ఉచితంగా ప్రచార సామగ్రిని అందజేయాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌ను ప్రక్షాళన చేయాలని సూచించారు. దేవదాయశాఖలో లోపాలు కనిపిస్తున్నాయని వాటిని సరిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పారు. ఖాళీగా ఉన్న వేద పారాయణదారుల పోస్టులను టీటీడీ భర్తీ చేయాలని సూచన చేశారు. -
కుప్పం దెబ్బతో సహనం కోల్పోయారు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఘోర పరాభవం ఎదురవ్వడంతో టీడీపీ అధినేత చంద్రబాబు సహనం కోల్పోతున్నారని, నిజస్వరూపమేంటో బయటపడుతోందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెచ్చగొట్టేలా, వ్యక్తిగత దూషణలకు దిగుతున్న చంద్రబాబు.. జరగబోయే పరిణామాలకు తానే బాధ్యత వహించాలని, ఎవరైనా ఆవేశపడితే అది ఆయన స్వయంకృతాపరాధమే అవుతుందని హెచ్చరించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కుప్పం ప్రజలు తిరస్కరించిన తర్వాత చంద్రబాబు మాటలు, హావభావాలు భయంకరంగా ఉన్నాయని, హుందాతనం, సంస్కారం ఆయన మాటల్లో కన్పించట్లేదని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన పార్టీ పెద్దలు స్వరూపానందేంద్ర స్వామీజీని కలసి ఆశీస్సులు తీసుకున్నారని, ఇప్పుడు స్వామీజీపైనే పరుష వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని సజ్జల తప్పుపట్టారు. చంద్రబాబు అప్పుడు స్వామీజీ దగ్గరకు దేనికెళ్లారు?.. క్షుద్రపూజల కోసమా? దొంగపూజల కోసమా? చెప్పాలని నిలదీశారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. అసభ్యకరంగా మాట్లాడడం శోచనీయం.. చంద్రబాబు విధానపరమైన విమర్శలు చేస్తే హుందాగా ఉంటుంది. ఈమధ్య కుప్పం నేతలతో టీడీపీ అధినేత జరిపిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై పరుష పదజాలంతో, అసభ్యకరంగా మాట్లాడటం శోచనీయం. తనమీద తనే అదుపుతప్పి ఖబడ్దార్ అంటూ హెచ్చరించడాన్ని బట్టి చూస్తే ఆయన చిన్న మెదడు చిట్లిపోయిందని భావించాల్సి వస్తోంది. వైఎస్ జగన్‌పై దూషణలు చేయడమంటే... ఆకాశంపై ఉమ్మేయడమే. త్వరలో జరిగే పరిషత్ ఎన్నికల్లోనూ చంద్రబాబు ఇదేరీతిలో మాట్లాడతారేమో? ప్రజలకు నిజంగా మేలు చేసుంటే ఆయన్నే మళ్లీ ఎన్నుకునేవారు. ఏం చేయలేదనే జనం తరిమికొట్టారు. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన చంద్రబాబు తనకుతాను అతిగా ఊహించుకుంటున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రజలకేం సందేశమివ్వాలనుకున్నారో? చంద్రబాబు తీరు గమనిస్తే.. ఆయన ఒంటికే కాదు.. తలకూ రోగం ఉందని తెలుస్తోంది. అడ్డగోలు మాటలు మాట్లాడితే ఓట్లు రావని చంద్రబాబు గుర్తించాలి. వ్యక్తిగత దూషణలపై ఎవరైనా ఆవేశపడితే దానికి ఆయనే బాధ్యత వహించాలి. దుర్గగుడిలో అవినీతిని అరికట్టేందుకు జరుగుతున్న ఏసీబీ దాడులను అభినందించాలి. మంత్రిని నిందించడం సరికాదు. అందుకే జమిలి గోల.. చంద్రబాబు, ఆయన కొడుకు జమిలి ఎన్నికలంటూ పదేపదే చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ పతనావస్థకు చేరింది. మూడేళ్లు నడపడం కష్టమని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ పార్టీ కేడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్ల వైఎస్ జగన్ పాలనకు ప్రజలు సానుకూల తీర్పునిచ్చారు. దీంతో ప్రతీ అడుగు ఊబిలోకే అన్న భయం టీడీపీ కేడర్‌కు పట్టుకుంది. దీన్ని కప్పిపుచ్చేందుకే జమిలి ఎన్నికలంటూ తన వాళ్లకు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పిచ్చి భ్రమే. విజయవాడ కరకట్ట విస్తరణపై దుష్ప్రచారం దుర్మార్గం. చంద్రబాబు చేసిన అస్తవ్యస్థతను ఈ ప్రభుత్వం సరిచేస్తోందన్నది వాస్తవం. చదవండి: 43 గుళ్లను కూల్చేసిన ఘనుడు చంద్రబాబు -
‘రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం’
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి దేవుడి పట్ల భయం, భక్తి లేదని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాలపై దాడులు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ‘‘బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిన దుర్మార్గుడు ఆయన. చంద్రబాబును ఓడిపోయేలా చేసింది వెంకటేశ్వరస్వామియే.(చదవండి: ‘రామతీర్థం’ చైర్మన్ పదవి నుంచి గజపతిరాజు తొలగింపు) చంద్రబాబు రామతీర్థం వెళ్లి అమరావతి గురించి మాట్లాడుతున్నారు. ఘటనపై రామతీర్ధం ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు ఎందుకు స్పందించలేదు?. రామతీర్ధం ఘటనలో చంద్రబాబు హస్తం ఉంది. దేవుడు ఆస్తులను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్ల ఓడిపోయి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన వ్యక్తి లోకేష్. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. త్వరలోనే ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం ఖాయం. చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష పడే రోజు దగ్గర్లోనే ఉందని’’ మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.(చదవండి: పప్పునాయుడు సవాల్‌కు మేం రెడీ..) అసాంఘిక శక్తులను నియంత్రించాలి: స్వరూపానందేంద్ర సరస్వతి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శనివారం.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో మాట్లాడారు. అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ ప్రతిష్టతోపాటు హిందువుల మనోభావాలను దెబ్బతీసే కుట్రలను నిరోధించాలన్నారు. ఆలయాల భద్రత విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను సైతం అప్రమత్తం చేయాలని కోరారు. దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్న సంకేతాలు భక్తులకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. -
శారదా పీఠాన్ని సందర్శించిన కృష్ణంరాజు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శారద పిఠంలో ఘనంగా నిర్వహిస్తున్న శారదపీఠం వార్షిక ఉత్సవాలు చివరి రోజుకు చేరాయి. నేటితో(శనివారం) ముగియనున్న ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ సమేతంగా శారదపిఠాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆయన దంపతులు పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులను కృష్ణంరాజు అందుకున్నారు. కాగా శాస్త్ర మహాసభలతో ముగించనున్న ఈ ఉత్సవాల్లో రాజశ్యామల యాగం, నివాస చతుర్వేద హావనం యాగాలను నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ప్రముఖ భాగవతులు విఠల్దాస్, మహరాజ్ బృందంతో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. -
అప్పన్నను దర్శించుకున్న శారద పీఠాధిపతి
సాక్షి, విశాఖపట్నం : శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి , స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలు గురువారం సింహాచలంలోని వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్వర్ రావు పీఠాధిపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిలిద్దరు కలిసి అర్చకుల సమక్షంలో నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో 57 రోజుల పర్యటన చేపట్టనున్నట్లు స్మాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. అనంతరం దేవి శరన్ననవరాత్రులకు సంబంధించిన ఉత్సవాల బ్రౌచర్‌ను స్వరూపానందేంద్ర స్వామి విడుదల చేశారు. -
అట్టహాసంగా స్వాత్మానందేంద్ర పరిచయసభ
సాక్షి, హైదరాబాద్: శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పరిచయ సభ బుధవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 5 నిమిషాల ముందే సభాస్థలికి వచ్చిన సీఎం కేసీఆర్.. స్వాత్మానందేంద్ర, స్వరూపానంద స్వాములకు స్వాగతం పలికి వారిని వేదికపైకి తీసుకొచ్చారు. ఆదిశంకరాచార్యుల చిత్రపటానికి పూజ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ నూతన వస్త్రాలు, తులసిమాల, పుష్పమాలతో స్వాములిద్దరినీ సన్మానించారు. అనంతరం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం విశాఖ శారద పీఠానికి నగర శివారులోని కోకాపేటలో రెండెకరాల స్థలం కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ స్వరూపానంద స్వామికి అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రధాన దేవాలయాలకు చెందిన దేవతా శేషవస్త్రాలు, ప్రసాదాలను ఇద్దరు స్వాములకు అందించారు. కార్యక్రమం చివర్లో స్వాములిద్దరికీ కేసీఆర్ పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వరూపానంద స్వామి కేసీఆర్‌కు శేషవస్త్రాలు అందించి సన్మానించారు. కోకాపేటలో కేటాయించిన రెండెకరాల భూమి పత్రాలను స్వరూపానంద స్వామికి అందజేస్తున్న కేసీఆర్ తెలంగాణ నుంచే ధర్మప్రచారం.. తెలంగాణ నుంచే ధర్మప్రచారాన్ని ప్రారంభిస్తానని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. చాతుర్మాస దీక్షలో భాగంగా తెలంగాణ నుంచే హృశికేష్కు పయనమవుతున్నానని, కొంతకాలం తపస్సు తర్వాత మళ్లీ తెలంగాణకే వస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తన పరిచయసభ ఉన్నందున, ఇందులో పాల్గొన్న తర్వాతే హృశికేశ్కు వెళ్లాలన్న శారద పీఠాధిపతి ఆదేశంతోనే తానిక్కడికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. స్వరూపానంద స్వామి మాట్లాడుతూ ఆధ్మాత్మిక, ధర్మ ప్రచారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో శారదాపీఠం ముందుంటుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నగరంలో రెండెకరాల భూమి కేటాయించడం సంతోషమన్నారు. తమ పీఠం విశాఖలో ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌తో సుదీర్ఘ అనుబంధముందన్నారు. ఇక్కడే రెండు పర్యాయాలు చాతుర్మాస దీక్ష నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్రను నియమించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్వాత్మానందేంద్ర స్వామిని తులసిమాలతో సన్మానిస్తున్న సీఎం కేసీఆర్. పక్కన స్వరూపానంద స్వామి శారదాపీఠానికి భూమిపూజ విశాఖ శారదాపీఠానికి హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం కోకాపేటలో కేటాయించిన రెండెకరాల భూమిలో బుధవారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన భూమిని అధికారులు పీఠానికి అప్పగించడంతో బుధవారం పీఠాధిపతి శ్రీస్వరూపానందస్వామి భూమి పూజ చేశారు. పీఠం అర్చకులతో కలసి ఉదయం 10.30 గంటలకు వచ్చిన ఆయన హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండెకరాల భూమిలో ఆలయం, వేదభాషాగోష్టి మఠం, సంస్కృతి విద్యాసంస్థ, విద్యార్థుల వసతిగృహం, భోజనశాల, సమావేశమందిరం తదితరాలు నిర్మించనున్నట్లు సమాచారం. బుధవారం జరిగిన పూజాకార్యక్రమాలకు మీడియాను అనుమతించలేదు. అక్కడకు వెళ్లిన విలేకరులను ఫొటోలు తీయవద్దని మఠం స్వామీజీలు, పోలీసులు కోరారు. ఇదిలా ఉండగా, టీవీ నటుడు రచ్చరవి స్వామీజీని కలసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. నన్ను పొగడొద్దు: కేసీఆర్ విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి పరిచయ సభ అయినందున వ్యాఖ్యానంలో తనపై ప్రశంసలు కురిపించవద్దని, ప్రస్తావన తేవొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణమూర్తి.. కేసీఆర్‌ను ప్రశంసించబోగా, ఇదే విషయాన్ని సీఎం చిట్టీరాసి ఆయనకు పంపించారు. అదే విధంగా జలవిహార్ ఎండీ రామరాజు దంపతులు సన్మానించబోగా, కేసీఆర్ సున్నితంగా తిరస్కరించారు. -
నేడు విశాఖ శారద పీఠాధిపతులకు పుష్పాభిషేకం
హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్యాధికారం చేపట్టేలా రాజశ్యామల యాగం నిర్వహించిన విశాఖ పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఇటీవల విశాఖ పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిలకు ఈ నెల 26న పుష్పాభిషేకం నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. రెజిమెంటల్‌బజార్‌లోని సంతోషీమాత దేవాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో బుధవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా పుష్పాభిషేకంతో పాటు స్వాత్మానందేంద్ర స్వామి పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున కట్టు, బొట్టుతో తరలిరావాలని సూచించారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు బ్రాహ్మణులకు అత్యధిక ప్రా«ధాన్యతనిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ శారదా పీఠం ఆ«ధ్వర్యంలో సాంస్కృతిక పాఠశాల, వేద పాఠశాల, సంస్కృత పాఠశాల నిర్వహణ కోసం కోకాపేటలో రెండు ఎకరాల స్థలం కేటాయించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అర్చకులకు ప్రభుత్వం నుంచి వేతనాలు అందిస్తున్నారని అభినందించారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడిగా శేషం రఘుకిరణాచార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాహ్మణ సంఘాల ముఖ్యులు పవన్‌కుమార్, భాస్కరభట్ల రామశర్మ, కులకర్ని నరేశ్, శ్రీపాదశర్మ తదితరులు పాల్గొన్నారు. -
దైవసన్నిధానంలో మహాకుంభాభిషేకం ప్రారంభం
ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ కుంభాభిషేకం జరుగుతోంది. శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఈ అభిషేకం ఉంటుంది. ఈ ఐదు రోజులూ స్వరూపానందేంద్ర సరస్వతి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని దైవసన్నిధానం వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి, ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, దైవసన్నిధానం చైర్మన్, నటుడు మురళీమోహన్, హీరో చిరంజీవి భార్య సురేఖ తదితరులు పాల్గొన్నారు.