వైవీ సుబ్బారెడ్డి దంపతులకు ఆశీస్సులు అందిస్తున్న స్వామీజీ
సాక్షి,అమరావతి/పెందుర్తి/తిరుమల: కోవిడ్ కారణంగా తిరుమలలో నిలిపివేసిన ఉచిత దర్శనాలను పునరుద్ధరించాలని శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తే ఇబ్బందులు ఉండవన్నారు. రుషికేష్‌లోని శ్రీ శారదాపీఠం శాఖలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు గురువారం కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారెడ్డిని స్వామీజీ అభినందించి ఆశీస్సులు అందజేశారు.
స్వరూపానంద మాట్లాడుతూ..నిర్వీర్యం అవుతోన్న హిందూ ధర్మ ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించి నూతన పంథాలో హిందూ ధర్మ ప్రచారాన్ని నిర్వహించాలని వైవీ సుబ్బారెడ్డికి సూచించారు. నూతన ఆలయాల నిర్మాణంపై టీటీడీ శ్రద్ధ చూపుతున్నట్లే పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు కూడా టీటీడీ నడుంబిగించాలని కోరారు. దేవదాయశాఖ, టీటీడీ ధర్మ ప్రచారం కోసం చైతన్య రథాలను నూతనంగా రూపొందించాలన్నారు.
దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ హయాంలో భజన బృందాలను ప్రోత్సహించినట్లే ఈ ప్రభుత్వం కూడా హిందూ ధర్మ ప్రచారానికి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. టీటీడీ నిర్వహణలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా భజన బృందాలకు ఉచితంగా ప్రచార సామగ్రిని అందజేయాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌ను ప్రక్షాళన చేయాలని సూచించారు. దేవదాయశాఖలో లోపాలు కనిపిస్తున్నాయని వాటిని సరిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పారు. ఖాళీగా ఉన్న వేద పారాయణదారుల పోస్టులను టీటీడీ భర్తీ చేయాలని సూచన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment