స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దంపతులు
సింహాచలం: భారత వైదిక చరిత్రలోనే కనీవినీ ఎరుగని లక్ష చండీ మహాయజ్ఞం కురుక్షేత్ర వేదికగా నిర్వహిస్తుండటం దేశానికి గర్వకారణమని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. విశాఖ శ్రీశారదాపీఠం పర్యవేక్షణలో హరియాణ రాష్ట్రం కురుక్షేత్రలోని గుంతీ ఆశ్రమంలో జరుగుతున్న లక్ష చండీ మహా యజ్ఞానికి శనివారం అనురాగ్ ఠాకూర్ సతీసమేతంగా హాజరయ్యారు.
మహాశివరాత్రిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ శంకరాచార్య సంప్రదాయ పీఠాల్లో గుర్తింపు పొందిన విశాఖ శ్రీశారదాపీఠం లక్ష చండీ మహాయజ్ఞాన్ని పర్యవేక్షిస్తుండటం, ఆ యజ్ఞంలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
అమ్మవారి ఆదేశం ఉంటే తప్ప ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాదన్నారు. కాగా, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యజ్ఞభూమిలో శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన విశేషంగా నిర్వహించారు.
2,200 మంది బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో రుద్రం పఠించడంతో కురుక్షేత్ర ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగింది. అలాగే యజ్ఞం నిర్వహణలో భాగంగా 6,976 చండీ పారాయణ హోమాలు పండితులు నిర్వహించారు. గుంతీమాత, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment