Visakha sri sarada peetham
-
వైభవంగా రాజశ్యామల యాగం
పెందుర్తి: విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం వైభవోపేతంగా జరిగింది. యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలుపంచుకున్నారు. అంతకుముందు శారదా పీఠానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలను కలిసి సీఎం జగన్ ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం జగన్ సంప్రదాయ వస్త్రధారణతో స్వామీజీలతో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం స్వర్ణ మండపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దీక్ష పీఠం వద్ద విశేష పూజలు చేశారు. ప్రముఖ పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్వామీజీల సమక్షంలో దాదాపు 30 నిమిషాలు అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేసి స్వహస్తాలతో హారతులిచ్చారు. పీఠంలోని స్వయంజ్యోతి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామిలను దర్శించుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. వేద పండితులను సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం నిర్వహించిన రాజశ్యామల యాగాన్ని దర్శించుకుని, పూర్ణాహుతిలో పాలుపంచుకున్నారు. యాగ భస్మా న్ని స్వరూపానందేంద్ర సరస్వతి సీఎం నుదిటిన దిద్దారు. 2 గంటలకు పైగా సీఎం వైఎస్ జగన్ యా గం, పూజా క్రతువుల్లో పాల్గొన్నారు. పీఠంలోని వేద విద్యార్థులతో ముచ్చటించారు. సీఎం వెంట వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీలు డాక్టర్ బీశెట్టి సత్యవతి, ఎం.వి.వి.సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేష్, విశాఖ మేయర్ హరివెంకటకుమారి ఉన్నారు. రాజశ్యామల యాగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించే ఏకైక పీఠం ఇదే: స్వామీజీ దేశంలో రాజశ్యామల యాగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠమని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల సీఎంలు సైతం ఇక్కడ రాజశ్యామల యాగంలో పాల్గొన్న వారే అని తెలిపారు. శ్రీ శారదా పీఠంలో కొలువుదీరిన రాజశ్యామల మాత అత్యంత శక్తివంతమైన దేవత అని స్వామీజీ తెలిపారు. సీఎం జగన్ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనడం, రాజశ్యామల యాగాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. మేం ‘సిద్ధం’జగనన్నా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విశాఖ ప్రజల ఘన స్వాగతం గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల యాగానికి వచ్చిన సీఎం జగన్‌కు విశాఖ ప్రజలు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీ శారదా పీఠం వరకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ‘నిన్ను మరోసారి గెలిపించడానికి మేం సిద్ధం జగనన్నా’అంటూ స్వాగతం పలికారు. ప్రజలు, మహిళలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుకు ఇరువైపులా నిల్చొని జెండాలు, సిద్ధం ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక అభిమాని కాన్వాయ్ వెంట ప్లకార్డు ప్రదర్శిస్తూ పరుగులు తీశాడు. సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ, అక్క చెల్లెమ్మలను పలకరిస్తూ శ్రీ శారదా పీఠానికి వెళ్లారు. -
లక్ష చండీ మహాయజ్ఞం దేశానికి గర్వకారణం
సింహాచలం: భారత వైదిక చరిత్రలోనే కనీవినీ ఎరుగని లక్ష చండీ మహాయజ్ఞం కురుక్షేత్ర వేదికగా నిర్వహిస్తుండటం దేశానికి గర్వకారణమని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. విశాఖ శ్రీశారదాపీఠం పర్యవేక్షణలో హరియాణ రాష్ట్రం కురుక్షేత్రలోని గుంతీ ఆశ్రమంలో జరుగుతున్న లక్ష చండీ మహా యజ్ఞానికి శనివారం అనురాగ్ ఠాకూర్ సతీసమేతంగా హాజరయ్యారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ శంకరాచార్య సంప్రదాయ పీఠాల్లో గుర్తింపు పొందిన విశాఖ శ్రీశారదాపీఠం లక్ష చండీ మహాయజ్ఞాన్ని పర్యవేక్షిస్తుండటం, ఆ యజ్ఞంలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆదేశం ఉంటే తప్ప ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాదన్నారు. కాగా, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యజ్ఞభూమిలో శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన విశేషంగా నిర్వహించారు. 2,200 మంది బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో రుద్రం పఠించడంతో కురుక్షేత్ర ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగింది. అలాగే యజ్ఞం నిర్వహణలో భాగంగా 6,976 చండీ పారాయణ హోమాలు పండితులు నిర్వహించారు. గుంతీమాత, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం ప్రారంభం..!
-
ద్రాక్షారామంలో దధి నివేదన శుభపరిణామం
సింహాచలం (పెందుర్తి)/శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా): పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో భీమేశ్వరస్వామికి దధి (పెరుగు) నివేదనను సమర్పించడం శుభపరిణామమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల మూడోరోజు ఆదివారం వైభవంగా జరిగాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పీఠం అధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనంలో పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నివేదనకు వినియోగించిన దధిని అన్నదానంలో వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు. త్వరలో వైష్ణవ ఆగమ పాఠశాల ఏర్పాటు మరోవైపు.. శారదాపీఠంలో త్వరలో వైష్ణవ ఆగమ పాఠశాలను ఏర్పాటుచేస్తున్నట్లు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా గడిచిన మూడ్రోజులుగా నిర్వహించిన చాత్తాద వైష్ణవ ఆగమ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి సంకల్పం మేరకు త్వరలోనే వైష్ణవ ఆగమ సదస్సుని కూడా ఏర్పాటుచేయదలచామని తెలిపారు. అర్చక అకాడమీ ఆధ్వర్యంలో వేదాంతం రాజగోపాల చక్రవర్తి నిర్వహించిన ఈ సదస్సులో చిర్రావూరి శ్రీరామశర్మ, విభీషణ శర్మ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ సతీసమేతంగా రాజశ్యామల అమ్మవారి యాగంలో పాల్గొని స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే, వీరిద్దరికీ శ్రీకాళహస్తీశ్వరాలయ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను దేవస్థానం ఈఓ సాగర్‌బాబు అందజేశారు. -
గిరిజనులకు సేవచేస్తే దేవుణ్ణి పూజించినట్లే
అరకులోయ రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సింహాచలం: గిరిజనులకు సేవ చేయడం భగవంతుని ఆరాధించడంతో సమానమని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. అరకులోయలోని ఎన్టీఆర్ మైదానంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం శంకరాచార్య గిరి సందర్శన మహోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామీజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో కలిసి ఉచిత మెగా వైద్యశిబిరం ప్రారంభించారు. 500 మంది పేద వృద్ధులకు దుప్పట్లు, 500మంది భక్తులకు భగవద్గీత గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు కల్మషం లేనివారని, వారికి సేవచేయాలని ఉద్బోధించారు. అందరూ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో భగవంతుని కొలుస్తారు కానీ ఇక్కడ గిరిజన ప్రజలు ప్రకృతిని, చెట్లను దైవంగా ఆరాధిస్తారన్నారు. ఆంజనేయస్వామి గిరిజనుడే అని, అడవి బిడ్డలంతా అంజనీపుత్రుని వారసులేనని తెలిపారు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మతమార్పిడులు చేస్తున్నారని, వారిని కట్టడి చేసేందుకే క్రిస్మస్ రోజున భగవద్గీతలను పంపిణీ చేశామన్నారు. గిరిజన ప్రాంతంలో దేవాలయల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామన్నారు. పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్య అందించేందుకు త్వరలోనే పాఠశాలలు ఏర్పాటుచేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాలు ఏర్పడటం ఆనందంగా ఉందని, ఏపీలో మాత్రమే ఇలా గిరిజనులకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటయ్యాయని స్వామీజీ అన్నారు. చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ప్రజలను దైవ మార్గంలో నడిపించేందుకు కృషిచేయడంతోపాటు విద్య, వైద్య రంగాల్లో సేవలందిస్తున్న విశాఖ శారద పీఠానికి రుణపడి ఉంటామన్నారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి జగదీష్‌బాబు, ఎంపీపీ ఉషారాణి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విశాఖ శారదా పీఠంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
-
విశాఖ శ్రీశారదా పీఠానిది జ్ఞాన పరంపర
పెందుర్తి: పరంపర అంటే వంశ పారంపర్యం కాదని, జ్ఞానంతో కూడినదై ఉండాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. పురాతన పీఠాల కన్నా ముఖ్యమైన జ్ఞాన పరంపర విశాఖ శ్రీశారదాపీఠం సొంతమన్నారు. కర్ణాటక పర్యటనలో భాగంగా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి హోళె నర్సిపూర్‌లోని గురుస్థానాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి సందర్శించారు. పరమ గురువు సచ్చిదానందేంద్ర స్వామి శివైక్యమైన ప్రాంతంలోని గురు సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక ప్రకాశ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ముద్రించిన గ్రంథాలను పరిశీలించారు. ప్రముఖ వేదాంతి ప్రకాశానందేంద్రతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సచ్చిదానందేంద్ర పాద రేణువే విశాఖ శ్రీశారదాపీఠమన్నారు. ఆయన శిష్యునిగా ఎంతో గర్వపడుతున్నానని.. తన పరమ గురువుల శిష్యరికం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దైర్యంగా ధర్మపోరాటాలు చేస్తున్నామంటే అది సచ్చిదానందేంద్ర సరస్వతి అనుగ్రహమే అన్నారు. సంస్కృతంలో ఉన్న తైత్తిరీయోపనిషత్తును తెలుగులోకి అనువదించి వేద విద్యార్థులకు పాఠంగా బోధించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గణపతి సచ్చిదానంద జన్మదినోత్సవానికి హాజరు మైసూర్‌లోని దత్త పీఠాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి సందర్శించారు. గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. సచ్చిదానందకు జ్ఞాపిక బహూకరించారు. అనంతరం స్వామీజీలను సచ్చిదానంద ఘనంగా సత్కరించారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు. -
విశాఖ పర్యటనలో ట్రాఫిక్ జామ్‌పై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి
-
ట్రాఫిక్ జామ్ ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం పర్యటనలో ట్రాఫిక్ జామ్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ శారదా పీఠం సందర్శనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం పర్యటన సందర్భంగా.. నగరంలో గంటల తరబడి అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. దీనిపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెంటనే విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపేశారని అధికారులను ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు ) -
విశాఖ: శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
CM YS Jagan: విశాఖ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న విశాఖపట్నం రానున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆహ్వానం మేరకు.. చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఆ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా శ్రీ శారదా పీఠానికి రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. వార్షికోత్సవంలో భాగంగా పీఠంలో నిర్వహించే రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ, రుద్రయాగంలో పాల్గొననున్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. చదవండి: (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ) -
విశాఖ శారదాపీఠంలో భోగి వేడుకలు
-
ధర్మ ప్రచార నిధి ఏర్పాటు చేయాలి
పెందుర్తి: రాష్ట్రంలో దేవదాయ శాఖ ప్రత్యేకంగా ధర్మ ప్రచార నిధిని ఏర్పాటు చేసుకోవాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. తద్వారా వాడవాడలా హిందూ ధర్మ ప్రచారం సాగేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదాపీఠాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, చీఫ్ సెక్రటరీ వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్ మంగళవారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ఆలయాల భద్రత కోసం నియమించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీస్ శాఖ ద్వారా శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ వ్యవస్థలో పరిపాలనపరమైన లోపాలను సరిదిద్దుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు. ప్రధాన దేవాలయాల ప్రచార రథాలకు మరమ్మతులు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని సూచించారు. ధర్మ ప్రచారం కోసం శ్రీశారదా పీఠం పెద్ద ఎత్తున కసరత్తులు చేసి కులాలకు అతీతంగా ప్రచారం ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. దేవాలయ సాహిత్యం, కవీశ్వరుల రచనలను వెలుగులోకి తీసుకురావాలని స్వామీజీ చెప్పారు. పురాణ సభలను ఏర్పాటు చేసి.. ఎంపిక చేసిన పండితుల ద్వారా ఆలయాల చరిత్ర, స్థల పురాణం పుస్తకరూపంలో తీసుకురావాలన్నారు. -
బాలాత్రిపుర సుందరిగా రాజశ్యామల అమ్మవారు
పెందుర్తి: విశాఖ శ్రీశారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ఆరంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల చేతుల మీదుగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గణపతి పూజతో అంకురార్పణ, అనంతరం శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. తొలిరోజు బాలాత్రిపుర సుందరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లోక కల్యాణార్థం పీఠంలో చండీ హోమాన్ని చేపట్టారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షతో శ్రీమత్ దేవి భాగవత పారాయణం నిర్వహించారు. సాయంత్రం శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, చంద్రమౌళీశ్వరులకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పీఠార్చన చేశారు. కాగా, శుక్రవారం అమ్మవారు మహేశ్వరి అవతారంలో దర్శనమివ్వనున్నారు. -
రేపటి నుంచి నవరాత్రి మహోత్సవాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి (గురువారం) నుంచి ఈనెల 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల్లో కనకదుర్గ అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రోజుకు 10 వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఆన్లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం దర్శనం టిక్కెట్లు ఇస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, తరువాత అన్ని రోజులు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనం లభించనుంది. మూలానక్షత్రం రోజు 12వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. 15వ తేదీ విజయదశమి పర్వదినాన సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంస వాహనంపై దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో జలవిహారం చేస్తారు. ఊరేగింపులను ఆలయ ప్రాంగణం, పరిసరాలకే పరిమితం చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన కనకదుర్గ అమ్మవారి ఆలయం 5 క్యూలైన్ల ఏర్పాటు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మొత్తం ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వినాయకగుడి నుంచి టోల్‌గేటు ద్వారా కొండపైన ఓం టర్నింగ్ వరకు మూడు క్యూలైన్లు, అక్కడి నుంచి అదనంగా ఉచిత దర్శనం లైను ఒకటి, వీఐపీ లైను ఒకటి సిద్ధం చేశారు. దర్శనానంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దర్శనానంతరం కొండ దిగువన మహామండపం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాట్లు చేశారు. 13 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి, 10 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కొండపైన, దిగువన సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. పున్నమి, భవాని ఘాట్లలో భక్తులు నదిలో స్నానం చేసే అవకాశం ఉన్నందున ఆ మార్గాలను మూసివేశారు. ఉత్సవాలకు 3 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 7 నుంచి శారదాపీఠంలో పెందుర్తి: శరన్నవరాత్రి ఉత్సవాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ముస్తాబైంది. ఈ నెల 7న పీఠంలో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 15 వరకు పీఠం అధిష్టాన దేవత శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు రోజుకో అవతారంలో పూజలందుకుంటారు. తొలిరోజు గురువారం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు. లోకకల్యాణం కోసం పీఠంలో శ్రీమత్ దేవి భాగవత పారాయణం చేపట్టనున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి నిజరూపాన్ని వీక్షించే అవకాశం ఉంటుందని పీఠం ప్రతినిధులు వెల్లడించారు. అమ్మవారి అవతారాలు.. ఉత్సవాల్లో అమ్మవారు గురువారం బాలత్రిపుర సుందరిదేవిగా, శుక్రవారం మహేశ్వరిగా, శనివారం వైష్ణవిదేవిగా, ఆదివారం అన్నపూర్ణ దేవిగా, సోమవారం లలితా త్రిపురసుందరిదేవిగా, మంగళవారం మహాసరస్వతిదేవిగా, బుధవారం మహాలక్ష్మిగా, గురువారం మహిషాసుర మర్ధినిగా, శుక్రవారం విజయదుర్గగా దర్శనమిస్తారు. -
విశాఖ శారద పీఠంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
సాక్షి, అమరావతి: శ్రీ విశాఖ శారద పీఠంపై గోవిందానంద స్వామి అనుచిత వ్యాఖ్యలు తాము ఖండిస్తున్నట్లు ఏపీ అర్చక సమాఖ్య నేతలు ఆత్రేయ బాబు, పెద్దింటి రాంబాబు పేర్కొన్నారు. ఆయన తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హనుమ జన్మస్థలంపై టీటీడీ నిర్ణయం సముచితమన్నారు. భారతీయ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న శ్రీ విశాఖ శారద పీఠంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ అన్నారు. -
ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటం శుభసూచకం
పెందుర్తి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ జాతకాలు బాగుండటం వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలకు ప్లవనామ సంవత్సరంలో మేలు జరుగుతుందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే రోజుల్లో నిరంతరాయంగా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో ఉగాదిని పురస్కరించుకుని ఉగాది ఆస్థానం నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేసూ్త.. సేనాధిపతి కుజుడు కావడంతో ఈ ఏడాది దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పారు. చాలా పెద్ద నాయకుడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఆర్థికంగా తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందులు ఉండవని.. ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వివరించారు. నేతల మధ్య ఏర్పడే సమన్వయ లోపం కారణంగా విభేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదన్నారు. దేశానికి ఇది మంచిది కాదన్నారు. దేశంలో కుట్ర పూరిత యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. కుటుంబాల మధ్య కూడా అనిశ్చితి ఏర్పడుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. శ్రీప్లవనామ సంవత్సరంలో చతుగ్రహ కూటమి తరచూ ఏర్పడుతుందని దీనివలన కాలసర్ప దోషాలు సంభవిస్తాయని.. ఈ పరిణామాల వలన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా కొన్ని విపత్కర పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత భయంకరంగా ఉంటుందని, వర్షాలు బాగా పడి పంటలు పండుతాయని చెప్పారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు. కరోనా మహమ్మారి జూలై వరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందని..ఆ తర్వాత ఎంతవరకు ప్రబలుతుందో ఆ తర్వాత గానీ నిర్ణయించలేమని స్పష్టం చేశారు. ప్రజలు తిరుమల శ్రీవారిని, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్నస్వామి, బెజవాడ కనకదుర్గమ్మను, యాదాద్రి నరసింహస్వామిని, వేములవాడ రాజరాజేశ్వరస్వామిని, బాసర సరస్వతీదేవిని కొలవాలని సూచించారు. స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ ప్లవ అంటే వెలుగునిచ్చేదని అని అర్థాన్ని వివరించారు. వికారి, శార్వరి నామ సంవత్సరాల్లో కమ్ముకున్న చీకట్లను తొలగించి ప్లవ నామ నూతన సంవత్సరం వెలుగులివ్వాలని కోరుతూ అంతా రాజశ్యామల అమ్మవారిని ప్రార్థించాలని అన్నారు. గంటల పంచాంగం ఆవిష్కరణ పీఠంలో ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పఠనంతో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. స్వామీజీల చేతుల మీదుగా శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. స్వర్ణ కవచధారిణిగా దర్శనమిచ్చిన అమ్మవారు విశేష అర్చనలు అందుకున్నారు. పీఠాధిపతి, ఉత్తరాధికారి చేతుల మీదుగా గంటల పంచాంగం ఆవిష్కరణ జరిగింది. పీఠం ఆస్థాన సిద్ధాంతి పంతుల రామలింగ స్వామి పంచాంగ శ్రవణం వినిపించారు. భక్తులకు స్వామీజీ చేతుల మీదుగా ఉగాది పచ్చడి ప్రసాదం వితరణ చేశారు. -
విశాఖ శారదా పీఠాధిపతుల పుణ్య స్నానం
రిషికేశ్: విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ వద్ద గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచే రిషికేశ్‌లో శారదాపీఠం ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న గంగానదీ తీరానికి చేరుకున్నారు. తన పరివారంతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. పీఠాధిపతులు ఇద్దరూ దండ తర్పణం నిర్వహించారు. అనంతరం వేద విద్యార్ధులతో కలిసి చండీ పారాయణ చేసారు. స్వామి స్వాత్మానందేంద్ర గ్రహణ సమయాన్ని మొత్తం నదీ తీరంలోనే గడిపారు. నదీ జలాల్లో మునిగి ప్రత్యేక జపమాచరించారు. గ్రహణ కాలంలో విశాఖ శారదాపీఠం ఆవరణలోని సకల దేవతా మూర్తుల ఆలయాలను కూడా మూసివేశారు. సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడల్లా ఈ తరహా నియమాలను పాటించడం విశాఖ శారదా పీఠానికి ఆనవాయితీగా వస్తోంది. -
దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్
సాక్షి, విజయవాడ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుండి రోడ్డు మార్గంలో విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆహ్వాన పత్రికను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనాంతరం అమ్మవారి చిత్రపటంతో పాటు శేషవస్త్రంతో కేసీఆర్‌ను దుర్గగుడి అధికారులు సత్కరించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగింత కార్యక్రమం సోమవారంతో ముగియనుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం కృష్ణాతీరంలో జరిగే సన్యాసాశ్రమ దీక్షల ముగింపు కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. విభజన వివాదాలపై నేడు జగన్, కేసీఆర్ చర్చలు! రాష్ట్ర విభజన వివాదాల పరిష్కారం దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సోమవారం మరోసారి సమావేశమై చర్చలు జరిపే అవకాశముంది. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చించనున్నారు. ఈ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన వివాదాల స్థితిగతులపై సంబంధిత శాఖలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఏపీ, తెలంగాణ మధ్య సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలు రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో ఇద్దరు సీఎంలు సహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీ కార్యాలయాల కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఇప్పటి వరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాల పరిష్కరించుకోవాల్సి ఉంది. సోమవారం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో వీటిలో కొన్నింటికి పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. కేసీఆర్ పర్యటన ఇలా... కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 1.25కు గేట్‌వే హోటల్‌కు చేరుకొని అక్కడి నుంచి 1.45కు దుర్గామల్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.15 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు వైఎస్ జగన్ నివాసానికి చేరుకొని ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందించనున్నారు. అక్కడే భోజనం చేసి సాయత్రం 4.15కు గేట్‌వే హోటల్‌కు చేరుకొని తిరిగి సాయంత్రం 5 గంటలకు కృష్ణా తీరంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జరిగే శారదాపీఠం ఉత్తరాదికారి ఆశ్రమ దీక్షా స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంటారు. తర్వాత గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు. -
విభజన వివాదాలపై నేడు జగన్, కేసీఆర్ చర్చలు!
-
నేడు విజయవాడకు కేసీఆర్
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సోమవారం విజయవాడకు రానున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగింత కార్యక్రమం సోమవారంతో ముగియనుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ పాల్గొంటారు. నరసింహన్ సోమవారం ఉదయం విజయవాడకు చేరుకుంటారు. గేట్‌వే హోటల్లో బస చేస్తారు. సాయంత్రం కృష్ణాతీరంలో జరిగే సన్యాసాశ్రమ దీక్షల ముగింపు కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. విభజన వివాదాలపై నేడు జగన్, కేసీఆర్ చర్చలు! రాష్ట్ర విభజన వివాదాల పరిష్కారం దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సోమవారం మరోసారి సమావేశమై చర్చలు జరిపే అవకాశముంది. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చించనున్నారు. ఈ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన వివాదాల స్థితిగతులపై సంబంధిత శాఖలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఏపీ, తెలంగాణ మధ్య సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలు రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో ఇద్దరు సీఎంలు సహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీ కార్యాలయాల కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఇప్పటి వరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాల పరిష్కరించుకోవాల్సి ఉంది. సోమవారం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో వీటిలో కొన్నింటికి పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. కేసీఆర్ పర్యటన ఇలా... తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 11.45కు హైదరాబాద్ హైదర్‌గూడలో నూతన ఎమ్మెల్యే క్వార్టర్లను ప్రారంభించాక బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు పయనమవుతారు. మధ్యాహ్నం 1.25కు గేట్‌వే హోటల్‌కు చేరుకొని అక్కడి నుంచి 1.45కు దుర్గామల్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.15 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు వైఎస్ జగన్ నివాసానికి చేరుకొని ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందించనున్నారు. అక్కడే భోజనం చేసి సాయత్రం 4.15కు గేట్‌వే హోటల్‌కు చేరుకొని తిరిగి సాయంత్రం 5 గంటలకు కృష్ణా తీరంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జరిగే శారదాపీఠం ఉత్తరాదికారి ఆశ్రమ దీక్షా స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంటారు. తర్వాత గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు. -
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ బాలస్వామి
సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగించనున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడ కృష్ణా తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కిరణ్ బాలస్వామి సన్యాసాశ్రమ దీక్ష కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారమే నగరానికి చేరుకున్న స్వరూపానందేంద్ర స్వామీజీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దీక్ష కార్యక్రమాలు సాగేదిలా.... శారదాపీఠం ఉత్తరాధికారి కిరణ్ బాలస్వామి దీక్షా క్రతువు మూడు రోజుల పాటు జరుగుతుంది. తొలిరోజు శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, కూష్మాండ, పురుషసూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు, శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు నిర్వహిస్తారు. సోమవారం మూడో రోజున ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్ర సభ, అహితాగ్ని సభ, అనంతరం శ్రీప్రాచీన, నవీన గురువందనాలు, తర్వాత జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగపట్టా అనుగ్రహం జరుగుతాయి. చివరగా జగద్గురు శ్రీ చరణులు, బాలస్వామివార్ల అనుగ్రహ భాషణం ఉంటుందని, విద్వత్సన్మానం నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. దుర్గమ్మ సేవలో స్వరూపానందేంద్ర ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కమిషనర్ ఎం.పద్మ, ఆలయ ఈవో ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మహా గణపతి ప్రాంగణంలో స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు రిషికేష్, కాశీ, తమిళనాడులో శాఖోపశాఖలుగా విస్తరించిన విశాఖ శారదా పీఠం ఎన్నో ధర్మ పోరాటాలతోపాటు దేవాలయ భూములు, వ్యవస్థ పరిరక్షణకు కృషి చేసిందని చెప్పారు. ఆలయాల్లో ధూప దీపనైవేద్యాలు సక్రమంగా అమలు జరిగేలా చూడటంతోపాటు టీటీడీలో జరిగిన ఆగడాలపై పోరాటం చేసింది శారదా పీఠం మాత్రమేనన్నారు. రాజధానిలో పవిత్ర కృష్ణానది తీరాన పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాలలో చివరి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లతోపాటు గవర్నర్ నరసింహన్ పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని లోక కళ్యాణార్థం మూడు రోజులపాటు దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. స్వామీజీతోపాటు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులున్నారు. పీఠాధిపతులు, మఠాధిపతుల రాక బాలస్వామి సన్యాసాశ్రమ దీక్షా కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు, సంతులు విచ్చేస్తున్నారు. శారదా పీఠం నిర్వాహకులు వారికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. -
ముగిసిన వైఎస్ జగన్ విశాఖ పర్యటన
విశాఖ : విశాఖ పర్యటన ముగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఆయన ఇవాళ విశాఖలో బిజీ బిజీగా గడిపారు. ముందుగా వైఎస్ జగన్ ఇటీవల వివాహం జరిగిన ఐఎన్టీయుసీ నేత మంత్రి రాజశేఖర్ కుమార్తె మౌనిక, శివ కళ్యాణ్ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠానికి వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పెందుర్తిలోని పార్టీ ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లి, ఇటీవలే వివాహం చేసుకున్న ఆయన కుమార్తె మాధవి-నితీష్ కుమార్ జంటను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలు అన్నీ ముగించుకుని వైఎస్ జగన్ హైదరాబాద్ బయల్దేరారు. -
మహా కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్ జగన్
విశాఖ : విశాఖ పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో జరుగుతున్న మహా కుంభాభిషేకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. పవిత్ర స్నానానంతరం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు ధరించి కుంభాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ...వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. కుంభాభిషేకం అనంతరం స్వరూపానందేంద్ర స్వామి కొద్దిసేపు వైఎస్ జగన్ తో ముచ్చటించారు. కాగా గత ఏడాది జనవరి 27న కూడా శారదా పీఠం వార్షికోత్సవాల్లో వైఎస్ జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లి, ఇటీవలే వివాహం చేసుకున్న ఆయన కుమార్తె మాధవి-నితీష్ కుమార్ జంటను ఆశీర్వదిస్తారు. -
నూతన దంపతులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఐఎన్టీయూసీ నేత మంత్రి రాజశేఖర్ కుమార్తె దంపతులను ఆశీర్వదించారు. సిరిపురం వీఐపీ రోడ్లో ఉన్న రాజశేఖర్ నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు....ఆయన కుటుంబసభ్యులు,అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నూతన వధువరులు మౌనిక, శివ కళ్యాణ్‌ను ఆశీర్వదించారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొత్త దంపతులు...వైఎస్ జగన్ తమను ఆశీర్వదించేందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.