విశాఖ శారదాపీఠంలో సంప్రదాయ దుస్తుల్లో రాజశ్యామల అమ్మవారి పూజల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. అమ్మవారికి హారతి ఇస్తున్న పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. చిత్రంలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి
పెందుర్తి: విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం వైభవోపేతంగా జరిగింది. యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలుపంచుకున్నారు. అంతకుముందు శారదా పీఠానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలను కలిసి సీఎం జగన్ ఆశీస్సులు తీసుకున్నారు.
సీఎం జగన్ సంప్రదాయ వస్త్రధారణతో స్వామీజీలతో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం స్వర్ణ మండపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దీక్ష పీఠం వద్ద విశేష పూజలు చేశారు. ప్రముఖ పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్వామీజీల సమక్షంలో దాదాపు 30 నిమిషాలు అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేసి స్వహస్తాలతో హారతులిచ్చారు. పీఠంలోని స్వయంజ్యోతి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామిలను దర్శించుకున్నారు.
జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. వేద పండితులను సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం నిర్వహించిన రాజశ్యామల యాగాన్ని దర్శించుకుని, పూర్ణాహుతిలో పాలుపంచుకున్నారు. యాగ భస్మా న్ని స్వరూపానందేంద్ర సరస్వతి సీఎం నుదిటిన దిద్దారు. 2 గంటలకు పైగా సీఎం వైఎస్ జగన్ యా గం, పూజా క్రతువుల్లో పాల్గొన్నారు. పీఠంలోని వేద విద్యార్థులతో ముచ్చటించారు.
సీఎం వెంట వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, విడదల రజిని, గుడివాడ అమర్‌నాథ్, సీదిరి అప్పలరాజు, శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీలు డాక్టర్ బీశెట్టి సత్యవతి, ఎం.వి.వి.సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేష్, విశాఖ మేయర్ హరివెంకటకుమారి ఉన్నారు.
రాజశ్యామల యాగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించే ఏకైక పీఠం ఇదే: స్వామీజీ
దేశంలో రాజశ్యామల యాగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠమని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల సీఎంలు సైతం ఇక్కడ రాజశ్యామల యాగంలో పాల్గొన్న వారే అని తెలిపారు. శ్రీ శారదా పీఠంలో కొలువుదీరిన రాజశ్యామల మాత అత్యంత శక్తివంతమైన దేవత అని స్వామీజీ తెలిపారు. సీఎం జగన్ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనడం, రాజశ్యామల యాగాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
మేం ‘సిద్ధం’జగనన్నా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విశాఖ ప్రజల ఘన స్వాగతం గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల యాగానికి వచ్చిన సీఎం జగన్‌కు విశాఖ ప్రజలు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీ శారదా పీఠం వరకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ‘నిన్ను మరోసారి గెలిపించడానికి మేం సిద్ధం జగనన్నా’అంటూ స్వాగతం పలికారు.
ప్రజలు, మహిళలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుకు ఇరువైపులా నిల్చొని జెండాలు, సిద్ధం ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక అభిమాని కాన్వాయ్ వెంట ప్లకార్డు ప్రదర్శిస్తూ పరుగులు తీశాడు. సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ, అక్క చెల్లెమ్మలను పలకరిస్తూ
శ్రీ శారదా పీఠానికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment